తెలంగాణ కీర్తి జగతికే స్ఫూర్తి
ప్రాశస్త్యమైనట్టి వెలుగులా దీప్తి-
తెలంగాణ స్ఫూర్తి
చెమ్మలింకి పోగ చేతులెత్తేసిన
రాతి బురుజులంటి రేగడీ నేలల
కాళేశ్వరమ్ము కళ కళారవముల
శివమెత్తి పాడుతూ అణువణువు తడిపిన-
తెలంగాణ స్ఫూర్తి
కన్నీటి జడివానలను వెలిపించి
పంట సిరులే పాలపిట్టలై ఎగురచ్చి
రైతుబంధువయ్యి లోగిళ్ళలో వాల
ప్రగతి బోనమెత్తి దరువులేయించిన-
తెలంగాణ స్ఫూర్తి
నాటి భగీరథుని శపథమే పూని
ఇంటింటికీ స్వచ్ఛ తాగునీటి ఊట
భాగీరథీ వోలె గలగలా పారగ
భగీరథ యత్నమున ఘనత సాధించిన-
తెలంగాణ స్ఫూర్తి
పరిశుభ్రతా మొలక విత్తులేయించి
వైకుంఠధామాలు సేంద్రీయ ఎరువుల
ఉత్పత్తి నెలవులై గ్రామాలు విలసిల్ల
పల్లెలకు పచ్చని దుప్పట్లు కప్పిన-
తెలంగాణ స్ఫూర్తి
లబ్ధి పొందుతు జనులు స్వావలంబన దిశగ
కలల సాకారముకు అడుగులే కదుపుతూ
దళితబంధువన్న కల్పతరువూ నాటి
కల్యాణకాంతులే ప్రసరింపజేసిన-
తెలంగాణ స్ఫూర్తి
బాలబాలికలకు ఆంగ్ల బోధన చేసి
ఐటీతో పాటుగా మేటైన రంగాల
ఉజ్వల భవితయే లక్ష్యముగా కాంక్షించి
మన ఊరు మన బడితో మహర్దశ తెచ్చిన-
తెలంగాణ స్ఫూర్తి
ఆసరా రూపాన ఆపన్నులందరికి
ఆరనీ విద్యుత్తు దీపాల అభయమే ఇచ్చి
తీరొక్క సంక్షేమ పథకాల సింగిడై
ఉయ్యాల పాటలతొ బతుకమ్మ నెత్తిన-
తెలంగాణ స్ఫూర్తి
యాదాద్రి నరసన్న చల్లనీ దీవెనల
వాడనీ తంగేడు మోదుగు పూవులా
వైభవమ్ముగ సదా తెలంగాణ జ్యోతి
అఖండమై అభివృద్ధి జ్వాలగా రగులగ-
తెలంగాణ స్ఫూర్తి
– రావుల కిరణ్మయి , 82475 66615