కొత్త ఏడాదిలోకి అడుగిడగానే చేతిలోకి తీసుకున్న ఒక కమ్మని కథలహారం డాక్టర్ వాణీ దేవులపల్లి ‘నుమాయిష్.. మరికొన్ని కథలు’. నా లోని చదువరికి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఇందుకు ‘నుమాయిష్’ అనే ఉర్దూ పద ప్రయోగం ఒక కారణమైతే, ఆకర్షణీయమైన ముఖ‘చిత్రం’ మరో కారణం కావచ్చు.
గురువర్యులు గిరిజా మనోహర్, కాత్యాయినీ రాసిన సమీక్షలు, రచయిత్రి వాణి ముందుమాటతో సమకాలీన సమాజానికి అద్దంపట్టిన 14 కథలతో కూడిన ఈ పుస్తకం ప్రతి పాఠకుడి మస్తిష్కానికి పదును పెడుతుంది. కథలను నా దృష్టికోణం నుంచి ఒక్కొక్కటిగా ఆస్వాదించాలనుకొని, కథను చదవడం, ఓ పేజీ తిరగేసి మరో పేజీలోకి దూరే లోపలే ఆ కథకు అతుక్కుపోవడం, ఆ కథ అయిపోయాకే తేరుకోవడం జరిగిందంటే ఆ కథల్లో కథనం, కథాబలం ఎంత మెండుగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి కథా సంకలనంతోనే గొప్ప రచనా శైలిని ప్రదర్శించి, వైవిధ్యమైన కథా వస్తువులను ఎన్నుకున్నారు వాణీ దేవులపల్లి.
భిన్న నేపథ్యాలతో ఈ పుస్తకంలో ఉన్న 14 కథల్లో తెలంగాణ అస్తిత్వం, మధ్య తరగతి స్త్రీ అస్తిత్వ పోరాటం చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ఏ కథలోకి దిగినా అందులో పచ్చని పల్లెల నేపథ్యం, మన జీవితంలోకి మనమే తొంగి చూసుకున్న భావం తప్పకుండా కలుగుతుంది. మొట్టమొదటి కథ ’గురవయ్య సారు కానిగీ బడి’ అమాంతం 50 ఏళ్ల కిందటి నా బాల్యాన్ని మోసుకొచ్చి ముందుంచిందంటే అతిశయోక్తి కానే కాదు. కథ ముగింపులోపు పాఠకుడు కన్నీరుకార్చక ఉండలేని కథ.
ఒక స్త్రీపై మగవాడికుండే అపోహ, సొంత అక్క అనుబంధాన్ని కూడా అర్థంచేసుకోలేని ఒక తమ్ముడి మూర్ఖత్వం, ఆడబిడ్డ ఆప్యాయత, అనురాగాలని జమా ఖర్చులతో బేరీజు వేసుకున్న ఆ తమ్ముడికి ఆప్యాయత, అనురాగాలంటే ఇవీ అని చూపిన అక్క ప్రేమ. ఇలా అక్క, భార్య తమ నిష్కల్మషమైన ప్రేమతో గోపాల్‌కి జ్ఞానోదయం కలిగించే రాగబంధాలు కథ ఆద్యంతం ఆసక్తికరం. ‘తప్యాలచెక్క’ కేవలం ఒక కథ కాదు, ఒక అబల వ్యధ. అలాగే, ‘పనిమనిషి’ మన మనసులను కదిలించే మరో కథ. ఇక ‘నుమాయిష్’కథ కట్టి పడేస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకు దర్పణంగా నిలిచే చిన్న కథ ఇది. ఈ కథా సంపుటికి నుమాయిష్ మరికొన్ని కథలు అని పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం వుందనిపించింది. ఇందులోని ప్రతి కథా మధ్య తరగతి జీవితాల్లోని వాస్తవిక సన్నివేశాలకు ప్రతిబింబం లాంటిది. మహిళల జీవితం బయటకు అందంగా కనపడే ’నుమాయిష్’ కాదని ప్రతినిత్యం ఒక సంఘర్షణ అని, ఒక త్యాగమని, ఒక సాహసమని తెలిపే వాస్తవ చిత్రాల సమాహారం ఈ పుస్తకం. దాదాపు అన్ని కథల్లో ప్రత్యేకంగా కనబడేది రచయిత్రి ఎంచుకున్న శైలి. ఏ కథకు, ఏ భావానికి ఏ రకమైన భాషను వాడి పాఠకులను మెప్పించాలో వాణికి బాగా తెలుసు. ఇవి మనం చదవాల్సిందే, చైతన్యం పొందాల్సిందే.
-డాక్టర్ తుమ్మూరి శరత్‌బాబు
76719 36040