కాళిదాసు శ్లోకాలను తెలుగులో స్వేచ్ఛా కవితానువాదం చేసిన డాక్టర్ రఘువర్మ విమర్శకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందిస్తున్నది.
సాహిత్య రచనలో అనువాదం క్లిష్టమైన ప్రక్రియ. రెండు భాషలు తెలియడమే కాదు, ఆ భాషల్లోని సాహిత్యంపై కూడా అనువాదకుడికి తగిన పరిజ్ఞానం ఉండాలి. సాధారణంగా ఇతర భాషల సాహిత్యం ఇంగ్లీషు మాధ్యమంగానే మరో భాషలోకి ప్రవేశిస్తుంది. ఆంగ్ల భాషపై పట్టున్నవాళ్లు ఇతర భాషల్లో ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలను తర్జుమా చేస్తుంటారు. సంస్కృత కావ్యాలను సరాసరి తెలుగులోకి తేవడానికి చాలా విషయాల్లో ప్రవేశం ఉండాలి. సంస్కృతంతో పాటు ఇరు భాషల కవిత్వంపై సాధికారిత ఉండాలి. తెలుగు కవిగా నిలబడినవారే ఆ ప్రయత్నంలో నెగ్గుకురాగలరు. తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అనువాద సాహిత్యానికి ఇచ్చే రామవరపు శాంతాసుందరి స్మారక పురస్కారం-2023 సంవత్సరానికి గాను రఘువర్మ అందుకుంటున్నారు.
తెలుగులో డాక్టరేట్ అందుకున్న డాక్టర్ తుమ్మనపల్లి లక్ష్మీనారాయణ కలం పేరు రఘువర్మ. ఆయన పలు కాలేజీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. సొంతూరు జగిత్యాలలో విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన 2021లో మహాకవి కాళిదాసు విరచిత మేఘసందేశం కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు.
వచన కావ్యానువాదరీతిలో కాళిదాసు శ్లోకాలను రఘువర్మ అనువదించిన తీరు ప్రశంసలకు పాత్రమైంది. మూలభావాలకు భంగం కలుగకుండా స్వేచ్ఛను అవలంబిస్తూ చక్కని శైలిలో పూర్తిచేశారని, అచ్చతెనుగు పదబంధాలు-సమాసాలతో రచనకు వన్నె తెచ్చారని పలువురు మెచ్చుకున్నారు.
2022లో కాళిదాసు మరో కావ్యమైన ఋతుసంహారఃను రఘువర్మ అనువదించారు. 2023లో రవీంద్రనాథ్ టాగోర్ ‘గీతాంజలి’కి తెలుగులో తనదైన రీతిలో స్వేచ్ఛానువాదాన్ని తెచ్చారు. అదే సంవత్సరం భర్తృహరి ‘నీతి శతకం’ను కూడా తెలుగులోకి అనువదించారు. కావ్య ప్రమాణాల్లో ఉత్కృష్ట గ్రంథాలను ఎంచుకొని ప్రతిభావంతంగా అనువదించిన రఘువర్మకు గుర్తింపుగా ఈ పురస్కారం లభిస్తున్నది. వీటికి తోడుగా ఆయన ఎన్నో ఆంగ్ల కవితలను తెలుగులోకి తెచ్చారు. తన సొంత కవిత్వంతో హృదయ జలధి, కవిత్వం వింతభాష, మూడోకంటి చూపు, మేఘ రాగరంజని అనే సంపుటాలను వెలువరించారు. కవి, అనువాదకుడైన రఘువర్మ మంచి చిత్రకారుడు, గాయకుడు కూడా. తన పుస్తకాలకు తానే ముఖచిత్రాలు వేసుకున్నారు. సినీ, లలిత సంగీత గీతాలాపనలో సిద్ధహస్తుడు. గాయకుడిగా ప్రశంసలు, పురస్కారాలందుకున్నారు.
స్వయం కృషి, పట్టుదలతోనే ఇన్ని కళల్లో రాణించే స్థాయికి రఘువర్మ చేరుకున్నారు. ఇంటర్‌లోనే చదువు ఆపేసి సొంత బంగారు దుకాణంలో ఉండమని ఇంటి పెద్దలు ఒత్తిడి చేయగా వారికి తెలియకుండా ఆయన ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేశారు. వ్యాపారంపై మనసు నిలువని ఆయన 1981లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ దాకా చదివారు. ఆయన ఉద్యోగ జీవితం పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్‌గా అస్థిరంగానే ముగిసింది. ఒంటరి బతుకుకు మరో దెబ్బగా 1996లో కుడి కన్ను చూపు కోల్పోవడం ఆయన జీవితంలోని విషాదమని చెప్పవచ్చు. ప్రతిభ గల సాహిత్యకారుడైన రఘువర్మ నేటి లౌక్యానికి, కపటానికి దూరంగా ఉంటారు. తనదైన ధోరణిలో తనకు పట్టు దొరికిన కళలతో సహవాసం చేస్తున్నారు. తన శ్రమకు బదులుగా గొప్పగా ఏమీ ఆశించని కవి రఘువర్మను సత్కరించడమంటే ఆ పురస్కారానికి యోగ్యు డు దొరికిండనే చెప్పాలి.
– బద్రి నర్సన్ 94401 28169