సాహిత్యపరంగా తెలంగాణకు జరిగిన సుదీర్ఘ వివక్ష వల్ల తెలంగాణ కథలు, కథకుల వివరాలెన్నో వెలుగులోకి రాకుండా పోయాయి. సరైన
గుర్తింపు లేక ఎందరో రచయితల ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. 25 ఏండ్ల క్రితమే పదునైన తెలంగాణ కథలు రాసిన
నల్లాల లక్ష్మిరాజం ఇటీవల మరణించినా సాహితీ లోకానికి ఆ సమాచారమే అందలేదు.‘జగిత్యాలకు చెందిన నల్లాల లక్ష్మిరాజం దళిత
కథలు రాశాడట. అవి ఎక్కడ ఉన్నాయి? ఆయన వివరాలేంటి?’ అనే మాటలు నాలుగైదు ఏండ్లుగా వినిపిస్తున్నది. అయితే ఈ వెదుకులాట సాగుతుండగా ఇటీవల ఆయన మరణించడం అత్యంత విషాదకరం.
లక్ష్మిరాజం జగిత్యాల సమీపంలోని తక్కళ్లపల్లి వాస్తవ్యుడు. బాల్యం నుంచే పాటలంటే అతనికి ఇష్టం. విద్యార్థి దశలోనే రాసి పాడేవారు. డిగ్రీ పూర్తయ్యాక పై చదువులు చదివి ఉపాధ్యాయుడు కావాలనుకున్నా ఆర్థిక ఇబ్బందులు, స్థానిక కారణాల వల్ల ఇరవై ఏండ్ల వయసులో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిపోయారు. కోరుట్లలో హెడ్‌కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తున్న ఆయన ఆరేండ్లు సర్వీసు ఉండగానే ప్రమాదవశాత్తు అకాల మరణానికి గురయ్యారు. చదువుకొనే రోజుల్లోనే గ్రామాల్లో కనబడే దళిత వివక్షను ఎదుర్కొనేందుకు అంబేద్కర్ యువ సంఘాన్ని ఏర్పాటు చేసి యువతలో అవగాహనను పెంచారు.
జగిత్యాలలో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తన కవిత్వం వినిపించేవారు. లక్ష్మిరాజం నేపథ్యం తెలుసుకున్న ప్రముఖ రచయిత బీఎస్ రాములు లక్ష్మిరాజం సొంత అనుభవాల ఆధారంగా దళిత కథలు రాయమని ప్రోత్సహించారు. కథల విషయంలో స్థానిక మరో కథా రచయిత కేవీ నరేందర్ కూడా తగిన సూచనలు అందజేశారు. తన జీవితానుభవాలు, గ్రామాల్లోని పరిస్థితులను అంశాలుగా ఎంచుకొని నల్లాల మంచి కథలు రాశారు. ఆ కథలు ఆనాటి పత్రికల్లో వచ్చాయి. వాటిలో తొమ్మిది కథలతో 2005లో ‘తిరుగు ప్రయాణం’ సంపుటి వచ్చింది. బీఎస్ రాములు ఆధ్వర్యంలోని విశాల సాహిత్య అకాడమీ దీనిని ముద్రించింది.
ఆయన కథల్లో తెలంగాణ భాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పత్రికల్లో తెలంగాణ యాస, సంభాషణ గల కథలకు స్థానం దక్కని రోజుల్లో రచయిత రాజీ పడలేదు. కథల్లో కొన్ని వాక్యాలు ఆయన దృక్పథాన్ని తెలియజేస్తాయి.
ఆయన కథల్లో ఆయన ఆలోచనలు తటస్థంగా కనిపిస్తాయి. పటేళ్ల దౌర్జన్యాన్ని ఎత్తిచూపినా దాని నిర్మూలనకు హింసే పరిష్కారం అనే ధోరణిని ఆయన నిరసించారు. లక్ష్మిరాజం కథల్లో ఆనాటి పత్రికల్లో వచ్చే కథల ప్రభావం కనబడుతుంది. ఎంతటి వేదనతో కథ మొదలైనా ఆదర్శవంతమైన ముగింపునకే మొగ్గు చూపారు. కథలు చెప్పే విధానాన్ని రచయిత సమర్థవంతంగా పాటించారు. పాత్రలు, సన్నివేశాల చిత్రణలో నేటివిటీని కాపాడారు. ఆయన రాసిన ఏ కథ చదివినా రచయితగా లక్ష్మిరాజం నేర్పరితనం కనబడుతుంది. తక్కువ చదివినా తరగని జీవితానుభవం ఆయనకు ఉన్నది. రచయిత వెదుకులాటలో ఆయన మరణ వార్త ఆలస్యంగా తెలియడం ఈ నేల సాహిత్య దురవస్థకు నిదర్శనం.
-బద్రి నర్సన్