బాల సాహిత్యమే పునాదిమానవ జీవితానికి బాల్యం ఆధారభూతమైన దశ. ఈదశలో పిల్లల మనస్సు ఆకర్షణకు లోనవుతుంది, ఊహలకు
గొప్ప స్థావరంగా ఉంటుంది. అలాంటి దశలో వారు చదివే, వినే, చూసే, అనుభవించే అంశాలే భవిష్యత్తు కాలంలో వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
పిల్లలు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రేమ, ఆహారం, స్వచ్ఛమైన గాలి, ఆటలు ఎంత అవసరమో కళలు, కథలు, కవితలు, సంగీతం కూడా అంతే అవసరం. బాలసాహిత్యం అనేది పిల్లల కోసం రాసేది. అలా రాసిన బాల సాహిత్యం పిల్లల్లో తమదైన ఊహాశక్తి, జ్ఞానం, నైతిక విలువలు, సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కథలు, కవితలు, నాటికలు, జానపద గాథలు, ఇతర రూపాల్లో లభించే బాల సాహిత్యం పిల్లల మానసిక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. నిజానికి బాల సాహిత్యం ఎదుగుతున్న పిల్లల జీవితాల్లో ఒక అమూల్యమైన సంపద. ఇది వారి మనసును ఆకర్షిస్తూ, విజ్ఞానాన్ని అందిస్తూ, నైతిక విలువలను నేర్పిస్తుంది. భవిష్యత్ సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి బాల సాహిత్యం ఎంతో ముఖ్యమైనది. పిల్లలను ఉత్తమ తరంగా, పౌర సమాజంగా సంసిద్ధం చేయడానికి బాల సాహిత్యం ఒక శక్తివంతమైన సాధనం. దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మనం పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించవచ్చు.
బాల సాహిత్యం చదువడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి రెక్కలు కట్టుకొని ఎగురుతుంది. మాయాజాల కథలు, సాహస గాథలు వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఇవి వారి సృజనాత్మక ఆలోచనలను పెంచి, సమస్యలను వినూత్నంగా పరిష్కరించే సామర్థ్యాన్ని అందిస్తాయి.
బాల సాహిత్యం వివిధ రూపాల్లో ఉంటుంది. వాటిద్వారా వారిలో భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సరళమైన, ఆకర్షణీయమైన శైలిలో రాసిన కథలు, కవితలు వారి పఠన, రచన, శ్రవణ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. బాలసాహిత్యం పిల్లలకు సత్యం, ధర్మం, సహానుభూతి, సహకారం వంటి నైతిక విలువలను కూడా నేర్పుతుందనే చెప్పవచ్చు. అలనాటి పంచతంత్రం, ఈసప్ కథలు వంటివి నీతి బోధనల ద్వారా పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. వేమన, సుమతి పద్యాలు వాళ్లలో సృజనాత్మకతకు పాదులు వేస్తాయి. అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు చెప్పే కథలు, జానపద కథలు పాటల ద్వారా పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. ఇది వారిలో సాంస్కృతిక గౌరవాన్ని, గుర్తింపును కలిగిస్తుంది.
బాలలు కథలు, కవితలు, పాటలు చదువడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఓర్పు, పట్టుదల వంటి గుణాలు పెరుగుతాయి. బాల సాహిత్యం పిల్లల్లో సానుకూల వ్యక్తిత్వ లక్షణాలను రూపొందిస్తుంది. సమూహ కథలు, స్నేహగాథలు పిల్లలకు సహకారం, జట్టు కృషి, టీం స్పిరిట్ పక్కవారి భావాలను గౌరవించడం లాంటి అంశాలను నేర్పుతాయి. అంతేకాదు, సైన్స్ విజ్ఞాన సంబంధిత కథలు, కవితలు శాస్త్రీయ పిల్లల్లో జ్ఞానాభిరుచిని పెంచుతాయి. కథల ద్వారా పిల్లలు వివిధ భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. దుఃఖం, సంతోషం, భయం వంటి భావాలను నియంత్రించడం నేర్చుకుంటారు. బాల సాహిత్యం పిల్లలకు వినోదాన్ని అందిస్తూనే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది వారి మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ఇట్లా బాలల గురించి బాలల సాహిత్యం సినిమాలు సాంస్కృతిక రంగం గురించి చాలా మాట్లాడతాం. కానీ, మన దేశంలో పిల్లల కోసం చేస్తున్నదేమిటి? ఎంత? అని ఆలోచిస్తే జరుగుతున్నది చాలా స్వల్పమనే చెప్పాలి. ముఖ్యంగా పిల్లల సృజనాత్మక రంగంలో జరుగుతున్న కృషి చాలా తక్కువ. మలయాళం, బెంగాలీ, కన్నడ, కొంత మరాఠీ భాషల్లో మాత్రం ఎన్నదగిన కృషి జరుగుతున్నది. తెలుగులో బాల సాహిత్యం విరివిగానే వస్తున్నప్పటికీ ఇంకా నాణ్యమైన రచనలు రావాల్సి ఉన్నది. మరోవైపు బాల సాహిత్యకారులను ద్వితీయస్థాయి సృజనకారులుగా కాకుండా వారికి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వాల్సి ఉన్నది. సాహిత్య విషయాలు ఇట్లా ఉంటే సిన్మా సంగతి మరింత దారుణం. పిల్లల కోసం ప్రత్యేకంగా తీసిన వందల బాలల సినిమాలు ముంబై చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ గోదాముల్లో స్తబ్ధంగా పడి ఉన్నాయి. ఇక మన హైదరాబాద్లో జరగాల్సిన అంతర్జాతీయ స్థాయి పిల్లల సినిమాల పండుగకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తిలోదకాలిచ్చేశాయి.
ఈ స్థితిలో బాల సాహిత్యకారులు మరో అంశాన్ని గమనించాల్సి ఉన్నది. ఇవ్వాళ ప్రాథమికోన్నత విద్యాసంస్థలన్నీ ఇంగ్లీష్ మాధ్యమానికే మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో ఉద్యాగాల కోసమైనా, మరి దేనికోసమైనా ఇంగ్లిష్ తప్పనిసరి అనే వాదంతో తెలుగు బోధన అపురూపమైపోయిందనే చెప్పాలి. ఇక ఐటీ తదితర రంగాల్లో ఉన్నవాళ్లకు తెలుగు చదువడమే గగనమైపోయింది. అందుకే బాలసాహిత్య సృజనకర్తలు కేవలం తెలుగులోనే రాసి ఊరుకోకుండా వాటికి ఆంగ్లానువాదాలను కూడా జతచేసి ప్రచురించగలిగితే ఈ రోజుల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళల్లో వాటికి సముచితమైన స్థానం లభిస్తుంది.
టీవీల్లో, ఇంటర్నెట్లో ఇంగ్లిషుకే అలవాటు పడిపోతున్న బాలలకు ద్విభాషా పుస్తకాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ దిశలో పెద్దపల్లి లాంటి ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక ప్రయత్నాన్ని అందరి దృష్టికి తేవాలని ఉన్నది. పుల్లూరి జగదీశ్వర్రావు అనే బాల సాహిత్యవేత్త ‘లిటిల్స్’ అనే ఒక కథల పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రాసి ప్రచురించారు.
ఆయన ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో తహశీల్దార్గా పనిచేస్తున్నారు. విద్యాధికుడైన ఆయన పలు పత్రికల్లో కూడా వ్యాసాలు రాస్తారు. ‘ఎడారి మొక్కలు’ కథతో మొదలయ్యే ఈ కథా సంకలనంలో 24 కథలున్నాయి. అలతి అలతి మాటల్లో జీవకారుణ్యం, పర్యావరణం, జీవ వైవిధ్యం, కాలుష్యం వంటి అనేక అంశాలను కథలుగా ద్విభాషల్లో గుదిగుచ్చారు. ఈ కథలను చదివి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆకర్షితుడై 150 పేజీల ‘లిటిల్స్’ పుస్తకాన్ని తానే ముద్రించి పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపిణీ చేయించారు. కలెక్టర్ శ్రీహర్ష రాసిన ముందుమాటలో ‘పాఠశాల విద్యను అభ్యసిస్తున్న కాలం బాలబాలికలకు అత్యంత ముఖ్యమైన కాలం. వాళ్లు వ్యక్తులుగా రూపొందే క్రమం అక్కడే మొదలవుతుంది’ అన్నారు. అది ముమ్మాటికీ నిజం. పుల్లూరి జగదీశ్వర్రావు వలె పిల్లల కోసం ద్విభాషా కథలు, కవితలు రాయడం, కలెక్టర్ శ్రీహర్ష లాగా ప్రోత్సహించి స్కూలు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్రమంతటా, అన్ని జిల్లాల్లోనూ జరగాల్సి ఉన్నది. అట్లయితేనే అర్థవంతమైన బాల సాహిత్యం అందుబాటులోకి వస్తుంది.
-వారాల ఆనంద్
94405 01281