అనగనగా ఒక రోజు
ఆసుపత్రి లోపలా బయటా
ఎదురుచూపుల ప్రసవం
రెండు ఎదురుచూపుల నడుమ
భారత్ పాకిస్తాన్ సరిహద్దులా గేట్ బంద్
ఒక ఎదురుచూపుల తండ్రి
ఇద్దరు పిల్లల్ని ఆడిస్తూ
కింద మీద పడుతున్న ఎంపైర్
ఒకడు చిచ్చర పిడుగు
ఇంకొకడు అల్లరి టపాసు
ఒకడు ఏడిస్తే
ఇంకొకడు సంబురమయితున్నడు
చిన్నోడిని ఏడిపించి పెద్దోడు
సుద్దపూసలా నవ్వుతున్నడు
పిల్లలిద్దరూ
నింగీ నేల ఏకమయితున్న జడివాన
అందరి చూపు తమవైపు తిప్పుకుంటున్న
బుచ్చి తారా తోరణం
పిల్లలు అల్లరి పాటల పల్లవులు
ఏ పాటకు ఏ తాళమవ్వాలో
ఏ రాగానికి ఏ తాయిలమవ్వాలో
ఏ గీతానికి ఏ ఊరడింపు రాగం అద్దాలో
అమ్మకు మాత్రమే తెలుసు
అయ్య
మంత్రదండం మరచిపోయిన ఇంద్రజాలికుడు
ఎటువైపు మొగ్గాలో తెలియని అమాయకుడు
ఆ తండ్రి అంటాడు
అన్నా ! కొంచెం గీ పిల్లలకు బెదురుపెట్టు అని
కలం పట్టుకున్నం
కర్ర పెత్తనం ఎలా చేయగలం
పూవుల్ని ప్రేమించే వాళ్లం
పూనకం ఎలా నటించగలం
చేజారిపోయిన బాల్యం మీద
మనసు చావని వాళ్లం
కండ్లముందు కదలాడు జ్ఞాపకాలు
ఎలా చెరిపేసుకోగలం.
– గజ్జెల రామకృష్ణ 89774 12795