లోకో భిన్న రుచిః అంటారు. మనుషులు ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అలాగే మానవాళి ప్రస్థానంలో సాహిత్యం విభిన్న ఆస్వాదనలను మనకు అందిస్తుంది. ఆరోగ్య సమాజ నిర్మాణంలో కవిత్వం పాత్ర అమోఘం అన్నది ఇప్పటికే తేటతెల్లమైంది. ప్రపంచాన్ని తనదైన కవిత్వ రెటీనాతో చూడటమే కవుల లక్షణం. అందుకే కవులను ప్రచ్ఛన్న శాసనకర్తలుగా అభివర్ణిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కోలా ఉంటాయి. అనుభవాన్ని, అనుభూతులను నిక్షిప్తం చేయటానికి ఏ ప్రక్రియైన సరే అనిపిస్తుంది. అలాంటి స్పందించిన ఓ కవి హృదయం సృజనాత్మకతను జోడించి మనకు అందించిన ప్రక్రియ సప్త పది.
కవిగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులైన సుధామ (అసలు పేరు అల్లంరాజు వెంకటరావు) మానస పుత్రిక సప్తపది. కవిగా, కార్టూని స్టుగా, రచయితగా, విమర్శకునిగా, సమీక్షకునిగా, కాలమిస్ట్‌గా, పజిల్స్ నిర్మాతగా, వక్తగా తెలుగు సాహిత్య ప్రపంచానికి సుధామ చిరపరిచితులు. ‘అగ్నిసుధ’, ‘చిత్రగ్రంథి’, ‘కవికాలం’, ‘తెమ్మెర’ సుధామ వెలయించిన కవితా సంకలనాలు. ‘మనసు పావనగంగ’ పేర లలిత గీతాలు, పాటల సంకలనం, 2001లో ప్రచురించిన ‘సం.సా.రా.లు’ గ్రంథానికి 2004లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహితీ గ్రంథ పురస్కారం లభించింది.
సవ్యం/ భవ్యం/ కవితాత్మగా వెలసి దీపిం చు సప్తపది దివ్యం/ అంటూ చురుగ్గా జనాల్లోకి వచ్చిన కవితా ప్రక్రియ సప్తపది. మూడు ప్రాస లు ఏడు పదాలు అనేది సప్తపది భౌతికరూపం.
సప్త పది నిర్మాణ పద్ధతి:సప్త పది అంటే మొత్తం ఏడు పదాలతో రూపొందే లఘు కవిత. వస్తువు ఏదైనా కావచ్చు. అనుభూతి, సామాజిక అంశం ఏదైనా సప్త పదిగా సంతరించవచ్చు.కవిత మొత్తం మూడు లైన్లు.మొదటి, రెండవ లైన్లలో ఒక్కొక్క పదమే ఉంటుంది. ఆ రెండు పదాలు కూడా అంత్యప్రాసతో ఉండాలి. మూడవ లైన్లో ఆ రెండు పదాలను సమన్వయపరిచే అనుభూతియో, సామాజిక వ్యాఖ్యనో కవితాత్మకంగా ఐదు పదాల్లో ఉంటూ లఘు కవిత రూపొందాలి. అంతేకాదు! మూడవ లైన్లో ఐదవదైన చివరిపదం మొదటి రెండవ లైన్లలోని పదాల అంత్యప్రాస తోనే తప్పనిసరిగా ముగియాలి. సప్తపదిలో ఒకసారి వచ్చిన పదం మళ్లీ రాకూడదు. ఏదైనా పదం సమాస పదం అయినప్పుడు దాన్ని రెండుగా విడగొట్టి పదాల సంఖ్యను ఏడుగా సప్తపది లఘు కవితలో సరిపెట్టకూడదు
సప్తపదికి ఒక ఉదాహరణ:నవత, కవిత చేపట్టి యువత సాగితేనే సాహిత్యానికి భవిత.కేవలం ఏడు పదాల నిబంధనలనూ పాటిస్తూ కవిత్వంగా రూపొందించడం ప్రధానం.
ఓసారి చూడండి అంతే.. ప్రసార భారతి సం చిక వాట్సాప్ విప్లవం అని చెప్పాలి. ఆ సంచిక ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్న సప్త పది కూడా అంతే విప్లవం తీసుకొచ్చింది. ఎంతగా స్పందించకపోతే విహారి లాంటి ఒక సాహితీ స్రష్ట.. సప్తపదులు అంటే ‘నూట పదహార్లు’ రాయగలుగుతారు? సప్తపది శతాధికమైనది. సహస్రాధికం కావాలంటూ విహారి ఆకాంక్షిస్తూ రాసిన ముందుమాటలో ముక్త రచన జనపదం దాకా విస్తరించిందంటూ లోకజ్ఞత, తాత్వికత ఈ రచనకు కావాలంటూ పఠితకు ఆలోచనా ప్రేరకం, అనుభూతి దాయకం, రసస్ఫోరకం కావాలని, సప్తపది ఆకాంక్ష అదేనని తెలియజేశారు. 2023, ఏప్రిల్ 17న సృష్టించబడిన ఈ ప్రక్రియకు నియమాలు పెట్టగానే దాదాపుగా 98 మందికి ఈ లఘు కవితా ప్రక్రియ కొత్త స్ఫూర్తి కలిగించింది. 24 గంటల్లో 600 కవితలను పంపడం ఆషామాషీ విషయం కాదు. విహారి తొలిగా ‘సప్తపది/ వినూత్నమిది/ రూపం సారం కావాలి కవి అమ్ములపొది’ – అని రాసి మార్గదర్శకత్వం చేశారు. అంతటితో వదలకుండా, వచ్చిన కవితలను పరిశీలింపజేసిన సుధామ, వై.రామకృష్ణారావు న్యాయ నిర్ణేతగా ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందించారు.
సప్తపదిలో పాద విభజన 1+1+5 అంత్య ప్రాసతో పాటు భావ సమన్వయం కుదరాలి. సప్తపదిలో ఒకసారి వచ్చిన పదం మరోసారి రాకూడదు. సుధామ మొదట రాసిన లఘు కవితలు ఒక్కసారి పరిశీలిద్దాం.
‘కాఫీ/ సాఫీ/ ఉదయం గొంతులో పడ్డాకే నిరుత్సాహం మాఫీ’ అంటూ కాఫీ తాగనిదే రెండుకాళ్ల బండి సాగని వైనాన్ని చెప్తారు. ‘బడి / గుడి/ బాల్యం నుండి వృద్ధాప్యానికి సాగు నడవడి’- అంటూ బడి నుండి మొదలైన యానం గుడిదాకా సాగిన వృద్ధాప్య ఛాయలను 7 పదాల్లో చెప్పేశారు. ‘వలపు/ వగపు/ ఆమె పురస్కార తిరస్కారాల బ్రతుకు మలుపు’- అంటూ స్త్రీ ప్రేమలోని పార్శ్వాలను ఎరుకజేశారు. ‘పాపా యి/ సిపాయి/ ఇంటికి దేశానికి వారి ఉనికి వల్లే హాయి’- అంటూ తరతరాల జీవన గమనాన్ని ఎరుకపరిచాడు.
ఇప్పుడు సప్తపదులు రెండో పుస్తకం కూడా మార్కెట్లోకి వచ్చేసింది. రమణ యశస్వి ‘యశస్వీయ సప్తపదులు’ పేరుతో రుజాగ్రస్త వ్యవస్థకు చికిత్స చేసే కవిత్వపు గుళికలను డాక్టర్ రమణ ఈ పుస్తకం నిండా పరిచినట్టు అనిపిస్తుంది. సామాజిక అభ్యుదయ ఆకాంక్షను వెలువరించే లఘు చిత్రాలుగా సప్తపదులు కనిపిస్తున్నాయి.
దృశ్యీకరణ స్ఫూర్తితో బాగా రాయగలవారు ఎందరో ఈ సాహితీ ప్రక్రియ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. వై.రామకృష్ణారావు అన్నట్టు సప్తపది అనగానే మూడు ముళ్లు, ఏడడుగులు గుర్తుకొస్తాయి. మనం సాహితీ సప్తపదిలో మూడు ప్రాసలు, ఏడు పదాలు మననంలోకి వస్తాయి. యశస్వి గజల్స్, హైకూలు, నానీలు, రెక్కల్లాంటి సాహితీ ప్రక్రియను సృజించిన డాక్టర్ రమణ, సప్తపదుల ప్రక్రియలో కూడా కాళ్లు మోపటం, కలం చేత పట్టి సప్తపదులు చెక్కటం మెచ్చుకోదగిన అంశం. నిజంగానే విహారి మంచి సంకల్పంతో చెప్పిన వెంటనే రెం డో పుస్తకం ద్విశతకంతో ఇంత తొందరగా మన కు అందటం గొప్ప విషయంగా చెప్పవచ్చు.
తెలికిచెర్ల విజయలక్ష్మి ‘హంగు/ రంగు/ బట్టలెన్ని ఉన్నా మొదటి తువ్వాలు అమ్మ కొంగు’- అని రాసి అమ్మ కొంగులోని ప్రాశ స్త్యం ఎంత గొప్పదో తెలియజేశారు. ‘స్నేహం/ మోహం/ తేడా తెలిసిన యువతికి కలగదు ద్రోహం’- అని డాక్టర్ భండారం వాణి నేటి యువతకు హితవు పలికారు. ‘మాట/ పాట/ ఒకటికొకటి తోడైతే రక్తి కడుతుంది ఆట’- అని కళ్ళే వెంకటేశ్వరశాస్త్రి రాశారు. ‘పంచకట్టు/ చీరకట్టు/ ఆధునిక యువత వేషధారణలో నానాటికి తీసికట్టు’- అంటూ ఇప్పుడు యువత ఏ విధంగా ఆలోచిస్తుందో చక్కగా తెలియజేశారు యార్లగడ్డ శ్రీరంగలక్ష్మి. నిజమే మరి, క్రియ-ప్రక్రియ రెండూ కొత్తవి సృజించినవారికి షుక్రి యా అని మనం అనుకుం టూ సప్తపదులు చెక్కుదాం. కొత్త ప్రక్రియకు ఆహ్వానం పలుకుదాం. సప్తపదుల సృజనకర్త సుధామకు అభినందనలు.
-అయినంపూడి శ్రీలక్ష్మి
99899 28562