అమరావతి : గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు (Penugonda Laxminarayana) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘ దీపిక ’ (Deepika) అభ్యుదయ వ్యాస సంపూటికి గాను అవార్డు వచ్చింది. దేశవ్యాప్తంగా 21 భాషలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ(Central Sahitya Akademi) అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఎంపికైన పుస్తకాల పేర్లను ప్రకటించింది.
పెనుగొండ లక్ష్మీనారాయణ స్వగ్రామం పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెం. ఆయన గుంటూరులో న్యాయవాదిగా (Advocate) పనిచేస్తూ 1972 నుంచి అభ్యుదయ రచయిత సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు .
అవార్డు గ్రహితలకు వచ్చే ఏడాది మార్చి 8న ఢిల్లీలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నిర్వాహకులు ఈ అవార్డు కింద రూ. లక్ష నగదుతో పాటు శాలువాతో సన్మానం చేయనున్నారు. తెలుగు నుంచి మొత్తం 14 పుస్తకాలను జ్యూరీ సిఫారసు చేయగా పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటి ‘దీపిక ’కు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాహిత రంగంలో ఇచ్చే అత్యంత పురస్కారంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.