(ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీపునరుద్ధరణపై ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ ముఖ్యాంశాలు)
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం కాదు. ఇది వే లాది కుటుంబాల జీవనాధారం, జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే, ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలనే ఏకైక లక్ష్యంతో, ఈ నెల 15వ తేదీన సీసీఐ సాధన సమితి ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ నేతల బృందం ఢిలీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల మంత్రి హెచ్డీ కుమారస్వామి గారిని కలిసింది. సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని వారికి విజ్ఞప్తి చేశాం. కేంద్రమంత్రితో మా చర్చల సందర్భంగా అత్యంత కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.250 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కానీ, రాయితీలు కానీ, సహకారంపై అధికారిక సమాచారం కానీ అందకపోవడం వల్లే ప్రక్రియ ఆలస్యమవుతున్నదని చెప్పారు. కానీ ఇప్పటివరకు మీ అధికారిక వైఖరిని ప్రకటించకపోవడం అత్యంత విచారకరం. గత రెండున్నరేండ్లుగా మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నదనే విషయం తేటతెల్లమైంది.
ఒకవేళ కేంద్రంతో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే అంశంపై కూడా ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించకపోవడం మరింత నిరాశ కలిగిస్తున్నది. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఈ పరిశ్రమను పునరుద్ధరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ప్రకటించారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఇప్పటిదాకా కనీసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడం మీ సర్కార్ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ఈ ప్లాంట్‌ను పునరుద్ధరించాలనే ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా మీ వద్ద లేకపోవడం ఆదిలాబాద్ ప్రజల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని కండ్లకు కడుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ అంశంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు స్వయంగా సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా నేను కూడా అప్పటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతే గారికి లేఖ రాసి విజ్ఞప్తి చేశాను. ఆనాడు సీసీఐ పునరుద్ధరణకు మా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సీసీఐ పునరుద్ధరణ జరిగితే టీఎస్-ఐపాస్ విధానంలో కొత్త పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలను ఈ పరిశ్రమకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చాం. పరిశ్రమను కేంద్రం నిర్వహించలేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినా, నడపడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశాం.
మా ప్రభుత్వం నాడు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను పునరుద్ధరించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం క్షమించరానిది. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను మీ మీద పెడుతున్నప్పుడు, ఇంకా కుంటిసాకులు చెప్పి మీరు తప్పించుకోలేరు. ముఖ్యమంత్రిగా ఆదిలాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అందువల్ల, తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదిలాబాద్వాసుల పక్షాన మీరు ఈ అంశాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను.
1. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక వైఖరి ఏమిటి?
2. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు పంపింది?
3. రూ.250 కోట్లను రాష్ట్ర వాటాగా పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా, లేదా?
4. సీసీఐ పునరుద్ధరణ కోసం టీఎస్-ఐపాస్ తరహా రాయితీలను వర్తింపజేయడానికి మీ సర్కార్ సిద్ధమేనా?
5. అవసరమైతే కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకు వస్తుందా?
6. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, ఈ పరిశ్రమను పునరుద్ధరించే రాష్ట్ర ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉన్నదా?
ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయాలకు అతీతంగా వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని, సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రితోపాటు, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు గారు సమయం కేటాయిస్తే, సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, వేలాది కుటుంబాల భవిష్యత్తు కోసం, ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నాను.’