తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి కథలు-సమగ్ర విశ్లేషణ పుస్తకం, ‘అభిమానం’ వివిధ పీఠికల సమా హారం పుస్తకం ఆవిష్కరణ ఈనెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సభకు కవి, రచయిత, పాలపిట్ట ఎడిటర్ గుడిపాటి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ముఖ్య అతిధిగా, పుస్తకాల ఆవిష్కర్తగా కవి, రచయిత, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి స్మృత్యర్థం సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రదానం చేసే ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ మలయాళీ కవి కే సచ్చిదానందన్‌ను ఎంపిక చేశామని మేనేజింగ్ ట్రస్టీ సీ గంగ, ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య తెలిపారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే సినారె 95వ జయంత్యుత్సవ కార్యక్రమంలో రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు తెలిపారు.
సృజనాత్మక కథనాలతో తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసే యువ రచయితల కోసం ‘ఛాయ సాహిత్యోత్సవం’ ప్రత్యేక నవలల పోటీని నిర్వహిస్తున్నది. ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్త్తున్న ఈ పోటీలో పాల్గొనాలని సంస్థ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్కే మోహన్‌బాబు కోరారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో నివసించే రచయితలు మాత్రమే ఈ పోటీకి అర్హులని స్పష్టం చేశారు. నవల 25 వేల పదాలకు మించకూడదని, 3 హార్డ్ కాపీలను (టైప్ చేసి) పంపించాలని పేర్కొన్నారు. ఎంపికైన మొదటి రెండు ఉత్తమ నవలలకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు పారితోషికం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు తమ రచనలను 2026 ఆగస్టు 17లోగా ఛాయ రిసోర్స్ సెంటర్, ఫ్లాట్ నెంబర్: 201, బ్రామరి నిలయం, హెచ్-117, మధురానగర్, హైదరాబాద్500 038కు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23742711 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.