జీవితంలో ఇష్టపడిన దానికోసం మనసారా కష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడే ఏ కష్టాన్నైనా భరించగలం. ఆపైన కష్టపడినప్పుడే మనకు ఇష్టమైనదాన్ని సాధించగలం. సంగీతమూ అంతే. సాధన చేయాలి. సేవన చేయాలి. భావన చేయాలి. శోధన చేయాలి. అప్పుడే, సంగీత కళాకారుడికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. అలా సిద్ధి పొందినవారే ఒక ఘంటసాలగానో, సుశీలగానో, సాలూరి రాజేశ్వర్‌రావు గానో, బాల సరస్వతీదేవి గానో, బాల మురళీగానో, నేదునూరిగానో, చిత్తరంజన్ గానో, బాలకృష్ణ ప్రసాద్గానో పరిణతి చెందిన సప్తస్వర వ్యక్తిత్వాలై సాక్షాత్కరిస్తారు. సంగీత ప్రియుల ఆరాధ్య దైవాలవుతారు.
జీవితంలో వెలుగు నీడల మధ్య- ఆ సన్నని కాల్దారి మీద నడిచిన వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్. వెన్నెల వేళలూ చూశాడు. చీకటి రేయిలనూ కడచాడు. ఆ దారిలో ఎదురైన అనేక అనుభవాలు అతని చూపుల్లో వినిపిస్తాయి. ఎన్నో అనుభూతులు అతని మాటల్లో కనిపిస్తాయి. ఆ అనుభవాల ఆనందాలూ, అనుభూతుల పరిమళాలూ అతని ‘పసి’ నవ్వుల్లో దోగాడుతుంటాయి. అందుకే, బాలకృష్ణ ప్రసాద్ పాట వినడం ఒక అనుభవమే కాదు, ఒక మనోహరమైన అనుభూతిలోకి మేల్కొనడం. ఒక అద్వితీయ ఆధ్యాత్మిక సంగీత సభలో పాల్గొనడం.
సంగీత సాహిత్యాల పరిధులెరిగి రాగ సౌరభం చెడకుండా, భావ సౌకుమార్యం పోకుండా స్వచ్ఛమైన, శుద్ధ్ధమైన ఉచ్ఛారణతో ప్రతి పదాన్నీ ఆ రాగ స్పర్శతో పాడే విశిష్ఠ శైలి తీరే-బాలకృష్ణ. ఆ రాగాల వనమాలి పేరే-బాలకృష్ణ. రాగం తానై, భావం తానై.. లయలో సంచరించే నైపుణ్యంతో కూడిన ఏకాగ్రత తప్ప, భావ సౌందర్యాన్ని మరుగునపరిచే అనవసర విన్యాసాలూ, మరే భేషజాలూ అతని పాటలో వినిపించవు. శబ్ద సౌందర్యం, స్వర సౌష్ఠవం తెలిసినవాడుగనకే భావ సౌమ్యం అతనికి అలవడింది. సంగీత సౌకుమార్యాన్నీ, సాహిత్య సౌరభాన్నీ ఆత్మలో నింపుకొన్నాడుగనకే-సప్తస్వర వేదం అతని గొంతులో స్థిరపడింది.
సుతారం, సుతిమెత్తన, మార్దవం, హాయి అనే పదాలకు పర్యాయపదమై తెలుగువారి అంతరంగాల్లో ఆధ్యాత్మిక స్వర దీపాలు వెలిగించిన భావుకుడూ, నిత్య సాధకుడూ, ఆత్మశోధకుడూ, గాయకుడూ, వాగ్గేయకారుడూ మా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య సంకీర్తనా ప్రచార యజ్ఞంలో-వేటూరి ప్రభాకర శాస్త్రిగారూ, అలానే ఆ కీర్తనలను మొదట స్వరపరిచి తెలుగువారికి సమర్పించిన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ప్రాతఃస్మరణీయులు. బాలాంత్రపు రజనీకాంతరావు గారూ, మర్ల సూర్యనారాయణ మూర్తి గారూ, మల్లిక్ గారూ, నేదునూరి కృష్ణమూర్తి గారూ, అలానే-అనేక ఉత్తర దక్షిణాది వాగ్గేయకారుల రచనలతో పాటు అన్నమాచార్యుల వారి రచనలను కూడా స్వరసహితంగా గ్రంథస్థం చేసిన మంచాళ జగన్నాథరావుగారూ, కామిశెట్టి శ్రీనివాసులు గారూ చిరస్మరణీయులు. అన్నమయ్య పదాలను జన బాహుళ్యానికి చేరువగా తీసుకువెళ్లడంలో వీరి పాత్ర, కృషి వందనీయం. ఈ వరుసలో బాలకృష్ణ ప్రసాద్‌కు కూడా ఒక విశిష్ట స్థానం ఉందనడం అతిశయోక్తి కాదు. తన గురువుగారైన నేదునూరి బాణీలు కూడా బాలకృష్ణ కంఠంలో అందంగా, లలితంగా ఒదిగిపోయి అన్నమయ్య భావ చిత్రాలకు సజీవాకృతినిచ్చాయి.
శాస్త్రీయ, లలిత, జానపద రీతుల్లో బాలకృష్ణ ప్రసాద్ స్వయంగా స్వరాలద్ది గానం చేసిన అన్నమాచార్యుల వారి అనేక సంకీర్తనలు విశేష జనాదరణ పొంది ఇప్పటికీ అనేక వర్ధమాన గాయనీ గాయకుల పెదవులపై మసలుతూనే ఉన్నాయి.
అసలు అన్నమయ్యకూ బాలకృష్ణ ప్రసాదుకూ- మట్టికీ, మనిషికీ.. వానకూ, నేలకూ ఉన్న బాంధవ్యం ఏదో ఉందనిపిస్తుంది నాకు. చినుకు నేలను తాకగానే గుబాళించే మట్టి పరిమళం అందరికీ అనుభవైకవేద్యమే. అలానే, తెలుగు నేల నుంచి వెలువడిన స్వచ్ఛమైన స్వరరాగ సుధారస మాధుర్యం ఏదో అతని పాటలో ఎగసి వినగానే ఆ సొగసు మనసులను ఆవరించుకొని వశపరుచుకొంటుంది.
తండ్రి చెయ్యి పట్టుకొని పిల్లాడిని బడికి నడిపించినట్టు ఈతని పాట మనసులను ఆకట్టుకొని నా వంటి ‘నాస్తికుడిలాంటి’ వాడికి కూడా భగవంతునిపై ధ్యాస మళ్లించి, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయిస్తుంది. దేవుడనే ఊహ నమ్మినవారికి ఆలాపన.. నమ్మనివారికి ఆలోచన. ఉన్నాడనుకున్నవారికి ఈతని పాట-ఒక పథం అయితే, లేదనుకున్నవారికి అదొక-పాఠం. సంగీత పాఠం. అంతే. సంగీత సాహిత్యాలను ఉపాసించాడుగనకే ఆ రెంటి పరిధులూ తెలిసి సాగే అతని స్వర విన్యాసంలో విషయ పరిజ్ఞానం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. నాద సాక్షాత్కారం కలిగింది గనకే అన్నమయ్యను అంతరంగ రంగంపై ప్రతిష్ఠించుకొని ఆ పద కవితా పితామహుని ఆంతర్యాన్నెరిగిన తన్మయత్వంతో పాడతాడు. తన పాటతో పరిసరాలనూ, శ్రోతల హృదయాలనూ సునాదమయం చేస్తాడు.
అదీ అతని గానం సాధించిన పరమార్థం. అందుకే, అతని చేరువ సరస్వతి సన్నిధానం. అతనికి మాత్రం చిత్తజ గురుడు అన్నమయ్యే నిధీ, నిధానం. అందుకే, అంటానూ బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య పదాలతో శ్రీపతి సన్నిథికి దారిచూపే సంగీత రాయబారీ, అన్నమాచార్యుల వారు అందించిన తిరువేదాన్ని సామాన్యుల వరకూ చేరవేయడానికి దేశాటనం చేసిన ఆధ్యాత్మిక బాటసారీ అని. అన్నమయ్య సంకీర్తనలను- ఆరాధించి, పరిశీలించి, విశ్లేషించి దోషరహితంగా చందోబద్ధ న్యాయాన్ని పాటిస్తూ తన్మయుడై, చిన్మయుడై సాహిత్య భావాన్ని బట్టి లలితంగా, శాస్త్రీయంగా, జనరంజకంగా, మనోరంజకంగా, చిత్తరంజకంగా ఆలపించే గాత్రధారీ, అన్నమయ్య పద సంకీర్తనలకు విస్తృత ప్రాచుర్యం కలిగించిన ముఖ్య పాత్రధారీ, సూత్రధారీ – శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.
శబ్దానికి ఉన్న శక్తీ.. నిశ్శబ్దానికి ఉన్న పటిమా తెలుసు గనకే చిరునవ్వుతో భాషించడం అలవడింది. మాటలనూ, భాషనూ పొదుపుగా వాడుతూ నొసలు చిట్లించేవారికీ, చెవులుకొరికే వారికీ తన పాటతోనే జవాబు చెప్పే పాటవం అతనిది. తాను నేర్చుకున్న సంగీతం మీదా, నేర్పిన గురువుల పట్లా అచంచల భక్తి కలిగిన సాధకుడు. తన పెదవులపై రాగరంజితాలై కదిలే ‘పదాల’పై ప్రగాఢ అనురక్తి కలిగిన శోధకుడు. నాలాంటి ఎందరికో జ్ఞాన దానం చేసిన బోధకుడు. చెదరని విశ్వాసంతో పరమాత్మను కొలిచే ఆస్తికుడు బాలకృష్ణ ప్రసాద్. తనకు జీవితాన్నీ, జీవనాన్నీ కరుణించిన సంగీత సాహిత్యాలపై విధేయతా, నడవడికలో నమ్రతా, ఆత్మ విమర్శ చేసుకోగలిగిన కుశాగ్ర బుద్ధీ, తాను చేపట్టిన అన్నమయ్య సారస్వత ప్రచార యజ్ఞంపై చిత్తశుద్ధి కలిగిన నిత్య అభ్యాస యోగి- బాలకృష్ణ ప్రసాద్. ఆత్మీయంగా పలకరించే చూపూ, కుశలం అడిగే చిరునవ్వూ, అరమరికలు లేని కలుపు గోలుతనం, మాటల్లో మెత్తదనం, నడకలో నిదానం, నడతలో పూర్ణత్వం, సుత్తిమెత్తని హాస్యం – అతని ప్రత్యేకతలు.
ఏదో ఒక రాగంలో పాడే పాటకూ.. రచయిత అంతరంగాన్ని శోధించి, సాహిత్యాత్మను ఆవిష్కరించే పాటకూ తేడా బాలకృష్ణ పాటలో వినిపిస్తుంది. మోతాదు మించిన శాస్త్ర ప్రకర్ష కర్ణరంజకం, మనోరంజకం కాదనేది బాలకృష్ణ గాయకులకు తన పాట ద్వారా ఇచ్చిన సందేశం. గత నలభై ఏండ్లలో కొన్ని పురస్కారాలూ, మరికాసిని బిరుదులతో బాలకృష్ణ ప్రసాద్ పాటా, పేరూ తెలుగు రాష్ర్టాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపించి అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ ఆమని సొబగుల పాటను ప్రేమించి ఏమని పొగడుదుమే! అనుకున్నవారెందరో. అతని పాటనీ, పాడే విధానాన్నీ అనుసరించేవారూ, అనుకరించేవారూ మరెందరో. శిష్యులూ, ప్రశిష్యులూ, గాయనీ గాయకులూ, అభిమానులూ అనేకం. అయితే, గమనించాల్సింది ఏమంటే మొన్న ఈ లౌకిక ప్రపంచం నుంచి నిష్క్రమించేవరకూ అతని అడుగు నేల మీదనే ఉన్నది. ఇలాగే పాడుతూ బతుకాలని ఉంది అందుకే పుట్టాలీ మళ్లీ మళ్లీ అని బాలకృష్ణ ప్రసాద్ రాసి పాడిన లలిత గీతం ఒక మరవలేని జ్ఞాపకం. అదేమోగానీ, అతని పాటలు వినడమే కాదు, అతనితో నా రచనలూ, స్వర రచనలూ పాడించిన నాకు బాలకృష్ణ పాట వినడానికే మళ్లీ మళ్లీ పుట్టాలనిపించడం-కాస్త అతిశయోక్తిగా ధ్వనించే నిజం.
నా ఆత్మబంధువు, సోదరుడు, చిన్ననాటి చెలికాడు బాలకృష్ణ ప్రసాద్ ఇంక మన మధ్య లేరన్నది నిజం. అయితే, అతని పాట ఆ సూర్యచంద్రతారార్కం ఉంటుందనేది కూడా నిజం. స్వస్తి.
– (వ్యాసకర్త: గేయ రచయిత, స్వరకర్త)
కలగ కృష్ణమోహన్