‘కవనంలో కదనం కలిస్తే… అరుణోదయంలో కరుణాహృదయం కలిస్తే అది అశోక్ తేజ’ అన్న పాపినేని శివశంకర్ మాటల్లో సుద్దాల అశోక్ తేజ కవన ఔన్నత్యం అవగతమవుతుంది. కళాత్మకతను, తాత్వికతను మేళవించిన పాటలతో గేయ కవిత్వానికి అశోక్ తేజ అమేయ గౌరవ, మర్యాదలను సమకూర్చాడు. శ్రీ శ్రీ, వేటూరి తర్వాత తెలుగు సినీపాటకు జాతీయ ఖ్యాతిని అందించాడు. సామాజిక ఉద్యమ రణక్షేత్రంలో కలం దువ్విన కవి మురారిలా శ్రామిక గీతోపదేశాన్ని ప్రవచించాడు. జానపదాన్ని ప్రాణప్రదంగా భావించి, తదనుగుణమైన జీవన వ్యాకరణ శిల్పంతో అశోక్ తేజ సినిమా పాట వాసిని రసరమ్యంగా ఇనుమడింపజేశాడు. నిసర్గ సుందరమైన తెలంగాణ నుడికారంతో తెలుగు పాటను కదం తొక్కించాడు.
విప్లవ గేయమైనా, సామాజిక చైతన్య గీతమైనా, సినిమా పాటైనా, దీర్ఘ కావ్యమైనా, ఆ రచనకు ప్రాణ చైతన్యాన్ని అందించి, అశోక్ తేజ పాఠకుల హృదయాలపై చెరగని ముద్రవేస్తాడు. ‘ఒకటే జననం/ ఒకటే మరణం/ ఒకటే గమ్యం/ ఒకటే గమనం’ అంటూ లక్ష్యసాధన ఎరుకను కలుగజేసి ‘బ్రతుకు అంటే గెలుపు/ గెలుపు కొరకే బ్రతుకు’ అంటూ విజయానికి, జీవితానికి అశోక్ తేజ స్ఫూర్తిదాయకమైన కొత్త భాష్యం చెప్పాడు. ‘ఊపిరిజెండా ఎగరెయ్, చావుకు ఎదురుగా అడుగెయ్’ అంటూ భుజం తట్టి ధైర్యం చెప్తాడు. ‘ధగధగలాడే ఓ జెండా/ వినవే పేదల గాథ’ అంటూ పదేండ్ల ప్రాయంలోనే కలమెత్తి గర్జించిన అశోక్ తేజ నేటికీ దిగ్విజయంగా పాటల జెండా ఎగురవేస్తూనే ఉన్నాడు.
‘గరంగరం పోరి నా గజ్జల సవ్వారి’ అనే సినిమా పాటతో తెరంగేట్రం చేసి, ఆరుపదులు దాటినా గరంగరంగా, ఘనంగా సృజన చేస్తున్నాడు. పాటల సవ్వారితో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. ఈ జైత్రయాత్రలో మరో ముందడుగు ఆయన రాసిన ‘కొమురం భీముడో’ పాట. ఈ పాట వింటే జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించాలనే తెగింపు ఏర్పడుతుంది. అవరోధాలను అధిగమించి జీవితాన్ని గెలిచే శక్తి అలవడుతుంది.
దేశమంటే మనుషులేనా, దేశమంటే మట్టి కాదా? చెట్టు కాదా? పిట్ట కాదా?జంతుజాలం కాదా?’ అని ప్రశ్నిస్తూ ఇటీవల అశోక్ తేజ వెలువరించిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ అనే పర్యావరణ దీర్ఘకావ్యం విశిష్టమైనది. అనేక పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వైభవాలకు గిరిజన జీవన ప్రాభవాలకు అడవి కేంద్రబిందువైందని విశ్లేషిస్తూ, విశ్వజనీనమైన పర్యావరణ హితాన్ని ప్రబోధిస్తూ అశోక్‌తేజ రాసిన ఈ కావ్యం పాఠక జనామోదాన్ని పొందింది.
తెలుగు సాహిత్యంలో అపూర్వమైన, అపురూపమైన పోరాటగీతాలు పాడిన సుద్దాల హనుమంతుకు సరైన వారసుడు అశోక్ తేజ. తండ్రి వాయించే హార్మోనియం రాగాలు ఆలకిస్తూ, తల్లి జానకమ్మ పాడే పాటలను వింటూ, అశోక్ తేజ ఆకలిని మరిచి, ఆ పాటల పందిరిలో సేదతీరాడు. ఘనమైన హనుమంతు సృజన యుక్తిని, కళాశక్తిని సమర్థమంతంగా అందిపుచ్చుకొని ఇరవై ఏండ్ల ప్రాయంలోనే ‘వెలుగురేకలు’ నవల రాసి తొలి రచనతోనే రాష్ట్ర స్థాయి నవలల పోటీలో అశోక్ తేజ విజేతగా నిలిచాడు. సుద్దాల హనుమంతు అసంపూర్తిగా వదిలేసిన ‘వీర తెలంగాణ’ సాంఘిక యక్షగానాన్ని పూర్తిచేసి తండ్రికి ఘనంగా నివాళి అర్పించుకున్నాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ, ‘బతుకు పాటలు’ వెలువరించి గేయకవిగా, ఆ తర్వాత సినీ కవిగా రాణించాడు. ‘ఆకుపచ్చ చందమామ’, ‘నేలమ్మా నేలమ్మా’, ‘నెమలి కన్నోడ’ లాంటి పాటల సంకలనాలతో ప్రభావశీలమైన కవిగా ప్రఖ్యాతి గాంచాడు.
పురాతన విశ్వాసాలను త్రోసిరాజని, శ్రమజీవుల చెమట బిందువుల్లోంచి సంగీత సాహిత్యాలు ఆవిర్భవించాయని, కష్టజీవులే ఆది కళాకారులని అశోక్ తేజ తన పాటల ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించాడు. ‘టప టప మని చెమటబొట్టు/ తాళాలై పడుతుంటే’ అనే గీతంలో పాటమ్మ పుట్టుకను కవి మేనమామలా నిరూపించాడు. అసాధారణమైన ఈ పాటలోని సందేశానికి పరాకాష్ఠగా అశోక్ తేజ బృహత్తరమైన ‘శ్రమకావ్యాన్ని’ రచించి ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు శ్రమ పేగుతెంచుకు పుట్టిన మహోన్నతమైన సంస్కృతీ సంపదలను తన కలంతో రాశిపోశాడు.
‘నేలమ్మా నేలమ్మా’ అనే పాటలో బహుముఖీనమైన నేలతల్లి ఔన్నత్యాన్ని అపూర్వంగా గానం చేశాడు. ఈ పాట ప్రజావేదికల మీద నిరంతరం మార్మోగుతుంటుంది. ‘మిన్నులున్న చందమామ య్య చేతిలో మహిమ ఏమున్నది/మన్నుల నుంచి అన్నము తీసే మహిమ నీకున్నది/ మింటి చుక్కలల్లోవాడు/ చెమట చుక్కలల్లో నువ్వు’ అంటూ అన్నదాతను ఆకుపచ్చ జాబిలిగా అభివర్ణించిన ఈ కవి పాట నిత్యం జాతి గుండెల్లో పదిలంగా నిలిచిపోతుంది.
‘దేశమంటే మనుషులేనా, దేశమంటే మట్టి కాదా? చెట్టు కాదా? పిట్ట కాదా?జంతుజాలం కాదా?’ అని ప్రశ్నిస్తూ ఇటీవల అశోక్ తేజ వెలువరించిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ అనే పర్యావరణ దీర్ఘకావ్యం విశిష్టమైనది. అనేక పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వైభవాలకు గిరిజన జీవన ప్రాభవాలకు అడవి కేంద్రబిందువైందని విశ్లేషిస్తూ, విశ్వజనీనమైన పర్యావరణ హితాన్ని ప్రబోధిస్తూ అశోక్‌తేజ రాసిన ఈ కావ్యం పాఠక జనామోదాన్ని పొందింది. ‘పిట్ట కడుపున నువ్వూ పుట్టకపోతివి నా తండ్రీ/ పొట్ట నిండేదాక మేతనే పెట్టేది పిట్ట తల్లి/ ఆవు కడుపులో నీవు పుట్టకపోతివి నా తండ్రీ/ బొజ్జ నిండేదాకా పాలనే ఇచ్చేది ఆవు తల్లి/ ఈ లంబాడీ తల్లి కడుపులో నువ్వు ఎందుకు పుట్టావురా?/ తల్లి పాలతోని తాటి కల్లును తాగే కర్మ నీకొచ్చిందిరా’ అంటూ సాగే అశోక్‌తేజ పాట హృదయాలను కదిలిస్తుంది. పని నుంచి తాను సాయంత్రం ఇంటికి వచ్చేవరకు పాల కోసం ఏడవకుండా నిద్రించటానికి బిడ్డకు తాటికల్లు అందించే గిరిజన స్త్రీ మాతృవేదనను అద్భుతంగా అక్షరబద్ధం చేశాడు కవి. ‘చీకటిని ముద్దనూరి నా కంటి కాటుకెట్టి/ సూర్యుణ్ణి తీసుకొచ్చి చుక్కబొట్టు నాకు పెట్టి/ వేపమండలు చుట్టి/ గుండెల్లో కల్లు పోసి/ వంగీ నా పాదాలను/ వరమడుగు కోండిరా/ ఇది కుక్కలు చింపే ముందర విస్తరాకు పూజరా’ అంటూ మాతంగి స్త్రీల మానసిక, శారీరక హింసను గొప్ప పాటగా మలిచాడు అశోక్ తేజ. ‘మెడలను నరికే ముందర/ మేకపిల్ల కొలుపురా/ ఈ జాతర పేరు మీద కడజాతి పాతర’ అని తరతరాలుగా అణగారిన వర్గాలు అనుభవిస్తున దుర్భర బాధలను తనగీతాల్లో ఆవిష్కరించాడు.
‘వీధుల్లో అనాథ బిడ్డల ముడుచుకున్న డొక్కల్లో/ ఆకలికి మా ఓటంటు పేగులు జేజేలు కొడుతున్నట్టు/ బారుల్లో మత్తెక్కినోడు/తాగే బీరు సీసాతో కొడితే/ పనిచేసే పసిబిడ్డ నెత్తిన అర్ధరాత్రి పొద్దొచ్చినట్టు’ నగరం నిద్రపోతున్నదని వినూత్న వక్రోక్తితో, పదునైన భావచిత్రంతో కూడిన అశోక్ తేజ పాట శ్రోతలను కదిపి కుదిపివేస్తుంది.
ఇలాంటి సమున్నతమైన సాహిత్య విలువలతో కూడిన పాటలతో పాటు ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’ లాంటి హుషారు గీతాలతో కుర్రకారును ఉర్రూతలూగించాడు. ఒక్కొక్కసారి అశోక్ తేజ పాట అగ్ని పర్వతంలా బద్ధలవుతుంది. మరొకసారి మంచు పర్వతంలా కరిగి ముద్దవుతుంది. ఆవేశం, ఆర్ద్రత, ఆలోచనల ముప్పేటలా ఈ కవి పాట పరవశింపజేస్తుంది. సినారె లాగా పాటలు రాసి పేరు తెచ్చుకోవాలని చిన్నప్పుడు కలలుగన్న అశోక్ తేజ కఠోరమైన కవితా పరిశ్రమతో ఎదిగి, ఆ మహాకవితో పాటు సినిమాలకు పాటలు రాసి, ఆయన మెప్పు పొందాడు. ఒకప్పుడు ‘కర్పూర వసంత రాయలు’ కావ్యాన్ని సినారె గానం చేసినట్టుగా అశోక్ తేజ కూడా ఎన్నో వేదికల మీద ‘శ్రమ కావ్యాన్ని’ రాగరంజితంగా, భావోత్తేజంగా ఆలపించి సభాసదులను సమ్మోహితులను గావించాడు. సినారె సినిమా సృజన స్ఫూర్తిని నవ నవోన్మేషంగా చాటి చెప్తున్న అశోక్‌తేజకు తెలంగాణ సారస్వత్తు పరిషత్ సినారె పురస్కారం ప్రదానం చేయడం అత్యంత సముచితం.
(జూలై 27న తెలంగాణ సారస్వత పరిషత్తు అశోక్ తేజకు సినారె సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా…)
-డాక్టర్ కోయి కోటేశ్వరరావు
94404 80274