‘చారల పిల్లి’ పుస్తకంలో వేంపల్లె షరీఫ్ రాసిన కథ ‘బడే పీర్’ చదివితే ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ కథ గుర్తుకువస్తుందన్నారు ఓల్గా తన ముందుమాటలో. ఇదే షరీఫ్ రాసిన ‘జుమ్మా’ పుస్తకంలో ఉన్న ‘పర్దా’ కథ చదివి… ‘రచయిత పేరు లేకుంటే ఇది ప్రేమ్‌చంద్ రాసిన కథ అనుకునేవాణ్ని’ అన్నారు ప్రముఖ విమర్శకుడు చిన వీరభద్రుడు. తెలుగు కథా ప్రియులకు ప్రముఖ ఉర్దూ, హిందీ కథకుడు ప్రేమ్‌చంద్‌ను పదే పదే గుర్తుచేస్తున్న షరీఫ్‌ను నేనైతే ఆంధ్ర ‘ప్రేమ్‌చంద్’ అంటాను.
అలా ఎందుకు అంటానంటే… అంతకుముందు అతను రాసిన ‘పర్దా’, ‘టోపీ జబ్బార్’, ‘జుమ్మా’, ‘ఆకుపచ్చ ముగ్గు’, ‘దస్తగిరి చెట్టు’, ‘పానీ’ వంటి చక్కటి కథలను చదివి ఉన్నాను కాబట్టి. తెలుగు కథా సాహిత్యంలో ముస్లిం జీవితానికి తన అందమైన నుడికారం, భాష, అభివ్యక్తితో ఖదీర్‌బాబు ఒక సహానుభూతిని రగిలించి వదిలేస్తే ఇప్పటికీ ఆ ఒరవడిని కొనసాగిస్తున్నవాడు షరీఫ్. అలా అని ఖదీర్‌కు షరీఫ్‌కి పోలిక ఉన్నదా, అంటే లేదనే అంటాను. అయితే కథనాన్ని సహానుభూతి ధోరణిలో చెప్పే విధానం దగ్గర కొంత పోలిక ఉన్నమాట వాస్తవమే అయినా షరీఫ్ కథనాలు ఖదీర్ దర్గా మిట్ట కథలతో పోల్చుకుంటే కొంత భిన్నంగా అనిపిస్తాయి. ఖదీర్.. తన ముస్లిం జీవితంలోని రోజువారీ వ్యవహారాలను అత్యద్భుతంగా కథనం చేసి వారి జీవితం పట్ల సాటి ముస్లిమేతరుల్లో ఒక ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తాడు. షరీఫ్… తన జీవితంలోని రోజువారీ వ్యవహారాలకు సామాజిక అంశాలను ముడిపెట్టి చెప్తాడు. ఇక్కడే వీళ్లిద్దరికి మౌలికపరమైన తేడా ఉన్నది.
షరీఫ్ తన కథల్లో ఎక్కడ కూడా గంభీరమైన పదాడంబరాలు, విపరీత ఉపమాన, ఉపమేయాలు, వర్ణనలను ఉపయోగించడు. సాదా సీదాగా కథ చెప్పుకుంటూ పోతూనే, ఎక్కడో ఉన్నట్టుండి సామాజిక స్పృహను తళుక్కుమనిపిస్తాడు. అది కథ మధ్యలో కావొచ్చు, సంభాషణల్లో కావొచ్చు, ముగింపులో కావొచ్చు. అందుకే చాలామంది ఇతర ముస్లిం కథకుల మాదిరి సహానుభూతి రచయితల జాబితాలో ఇతను కలసిపోకుండా కొంత కాపాడుకుంటున్నాడు. ఇప్పుడీ గొడవంతా ఎందుకంటే ఇతని తాజా కథల పుస్తకం ‘చారల పిల్లి’ చదివినప్పుడు ఇలాంటి కలకలం ఏదో నాలో రగిలింది కాబట్టి. ఒక్కో కథ చదివి కొంత విరామం తీసుకుంటే కానీ, మరో కథ చదువబుద్ధి కానంతగా ఈ కథలు కట్టిపడేశాయి. ఈ కొత్త కథా సంపుటిలో ‘సైకిల్ చక్రాలు’, ‘నల్లబండ’,‘ చారల పిల్లి’, ‘షేర్ని’, ‘హలాల్’, ‘పత్తి గింజలు’ కథలు హైలైట్‌గా నిలుస్తాయి.
కథా రచయిత వేంపల్లె షరీఫ్
ఈ నెల 23న ‘తెలుగు యూనివర్సిటీ
కీర్తి పురస్కారం’ అందుకుంటున్న
సందర్భంగా….
నిజానికి సామాజిక స్పృహ అంశాలను అదే పనిగా కథను చేయడానికి కూర్చొని మెప్పించేందుకు ప్రయత్నిస్తారు చాలామంది కథకులు. ఇతను మాత్రం అంత కష్టపడుతున్నట్టు కనిపించడు. రోజువారీ వ్యవహారాల్లోనే ఆ సున్నిత అంశాలను వెతుక్కుంటున్నాడు. బహుశా ఇప్పుడు రోజువారీ అంశాలే రాజకీయం అవుతున్నప్పుడు రాజకీయం లేకుండా రోజు వారీ విషయాలను కథనం చేయలేం కదా? ఒకవేళ షరీఫ్‌తో మాట్లాడితే అతని నుంచి ఇలాంటి సమాధానమే రావొచ్చు. మొత్తానికి ముస్లిం సమాజం చుట్టూ అలుముకుంటున్న సమకాలీన రాజకీయాలను, వాటి వికృత చేష్టలను, అవి గీస్తున్న సరిహద్దులను సహానుభూతి హృదయంతో తెలుసుకోవాలంటే షరీఫ్‌ను చదువాలి. అంతేకాదు, ముస్లిం సమాజంలోని అంతర్గత గందరగోళాలను దర్శించాలనుకున్నా షరీఫే మనకు శరణ్యమవుతాడు. షరీఫ్ బహుముఖాల కథకుడు. మతం అనే సున్నిత సమస్యను తనదైన కోణంలో దర్శిస్తూ తాను కొత్తగా గ్రహించిందేదో మనకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇతని ప్రయత్నం ఇలాగే కొనసాగాలి. ఆ మేరకు అతని కలం నుంచి మరిన్ని కథలు రావాలి.
– (వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
మొగుతాల రాజు 73869 86182