ఆత్మలు అమ్ముకున్నాక
ఆస్తుల మత్తు కమ్ముకుంటది
తలపులు గంపగుత్తకు చెల్లిపోయాక
విలువలు సింహాసనం
కింద పాతరౌతయి
భావనలు ఊడిగానికి మరిగాక
సృష్టులు కోతిబొమ్మలై
వనాన్ని చెరుస్తయి
ఆశలకు తోకలు మొలిచాక
ఆశయాలు నేల విడిచి వెళ్లిపోతయి
బుల్లెట్ ప్రూఫ్ అందలం ఊరేగిస్తది
దంచే పంచ్ డైలాగ్‌లకు
చప్పట్లు మోగాక
మందార మకరంద మాధుర్యమున
భాషించు నెవడు
సిద్ధమైన, వెల్ల వేసిన
స్క్రిప్ట్ వల్లింపులున్నాక
హరిశ్చంద్రుని సత్య నియమమే ఏల
పక్షి స్వేచ్ఛా రెక్కలు విరిచి
చెట్టు తల్లి, పిల్ల వేళ్ళు నరికి
నదికి నవ్వుల నురుగుల అద్దకం
సముద్ర మీదిన
కాగితప్పడవల నిండారా
త్రిజోరీల రాక
స్వేదం
పెరుగన్నంలో కలిసిపోతున్నదే
నిట్టాడు కూల్చి
దోషిగ నిలబెడ్తున్నరే
ఒప్పుల కుప్ప నుంచి
అప్పుల కుప్పల మునిగినమే
వెంటాడే, వేటాడే లక్ష్యాల
రెండు కళ్ళ సిద్ధాంతపు బాటనే
హరిణ మరణపు వేళ,
మానిషాద శోకం
ఏ మనిషికైనా చేరేనా
మూగ నిగళాల గొంతు
పెకలించేనా
– చెంగల్వ