apicbook.com | ‘పిల్లల కోసం సరికొత్త అక్షర లోకాన్ని సృష్టించారామె. ఆకర్షణీయమైన రంగులు, అందమైన బొమ్మలతో పిల్లల మనసులు దోచేలా, కంటికి ఇంపుగా అక్షరాలను అలంకరించి చిన్నారుల ముందుకు తెచ్చారు. రామాయణం, భారతం వంటి ఇతిహాసాలను.. దసరా, దీపావళి, సంక్రాంతి తదితర పండుగలను ఇతివృత్తాలుగా తీసుకుని ముచ్చటైన పుస్తకాలను ముద్రిస్తున్నారు apicbook.com స్థాపకురాలు శ్రీవిద్య.
చందమామ కథలను కార్టూన్ నెట్వర్క్లు మింగేశాయి. బాలమిత్ర పుస్తకాలకు హోమ్వర్క్లు శత్రువుగా మారాయి. దీంతో పిల్లల కథలు కనుమరుగు అయిపోయాయి. మొత్తంగా బాల సాహిత్యం అటకెక్కింది. ఆ కమ్మని జ్ఞాపకాలకు ‘apicbook.com’ పేరుతో మళ్లీ ప్రాణం పోస్తున్నారు శ్రీవిద్య. ఈమె రూపొందించిన తొలి తెలుగు పర్సనలైజ్డ్ బొమ్మల కథల పుస్తకాలు పిల్లలను నవ్విస్తాయి. ఏడ్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పుస్తకాలకు ఎపిక్ బుక్స్ పూర్తిగా భిన్నమనీ, ఫోన్ అలవాటు నుంచి పిల్లల దృష్టిని మళ్లించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని శ్రీవిద్య గర్వంగా చెబుతున్నారు.
ముళ్లపూడి శ్రీవిద్య స్వస్థలం భద్రాచలం. చాలా సంవత్సరాల క్రితమే వీరి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. పెండ్లి తర్వాత భర్త వాసుతో అమెరికా వెళ్లారు. ఎనిమిదేండ్లు అక్కడే ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉంటున్నారు. తన పిల్లలకు మంచిమంచి కథలు చెబుదామని పుస్తకాల కోసం ఎన్నోచోట్ల వెతికారు శ్రీవిద్య. కానీ, ఎక్కడా నాణ్యమైన బాల సాహిత్యం దొరకలేదు. దీంతో, చాలా నిరాశగా అనిపించింది. పిల్లల కోసం తానే మంచి కథల పుస్తకాలను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అక్కడితో ఆగిపోకుండా.. ‘హనుమంతునితో సాహసయాత్ర-ఒక దీపావళి కథ’ పేరుతో తొలి తెలుగు పర్సనలైజ్డ్ బొమ్మల కథల పుస్తకాన్ని తెచ్చారు. పుస్తకాన్ని ఆర్డర్ చేసిన చిన్నారినే ముఖ్యపాత్రగా తీసుకుని కథ నడిపిస్తారు. దీంతో హనుమంతునితో సాహసయాత్ర చేసినట్టు, రాముడికి యుద్ధంలో సహాయపడినట్టు, రావణుడి మీద గెలిచినట్టు.. కలల లోకంలో విహరించిన అనుభూతిని కలిగిస్తారు. దీంతో పిల్లలు ఆనందపడిపోతారు. మళ్లీ మళ్లీ చదువుతారు. నేస్తాలతోనూ చదివిస్తారు. అలా పుస్తకాలతో స్నేహం ఏర్పడుతుంది. అదే అనుబంధంగా మారుతుంది.
పిల్లల కోసం కథలు రాయడం ఒక ఎత్తయితే, ఆ కథలకు బొమ్మలు గీయడం మరో ఎత్తు. అందులోనూ ఆ బొమ్మలు చిన్నారులను ఆకర్షించేలా రకరకాల రంగుల్లో ఉండాలి. పెద్దగా కనిపించాలి. భాష విషయానికొస్తే.. ప్రాస అదనపు ఆకర్షణ అవుతుంది. ‘మా ఇద్దరు పాపలకు కథలు చెప్పేటప్పుడు ఎలా చెబితే బాగా అర్థమవుతుంది? భాష ఎలా ఉండాలి? అనే కోణంలో చాలా అధ్యయనం చేశాను’ అంటారు శ్రీవిద్య. చాలా కథలకు శ్రీవిద్య భర్త వాసు కథా కథనాలను అందించారు. బొమ్మలు వేసే బాధ్యత మాత్రం ఆమే తీసుకున్నారు. పిల్లల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా బొమ్మలు గీయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చిందంటారు శ్రీవిద్య. తాను బీటెక్ చదివి ఉండటం, అందులోనూ సాఫ్ట్వేర్ రంగం గురించి తెలిసి ఉండటం వల్ల.. ఆ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్లో బొమ్మలు గీసేందుకు దోహదపడిందని వివరిస్తారామె.
పిల్లలతోపాటు వారి తల్లిదండ్రుల నుంచీ ఎపిక్ బుక్స్ తొలి ప్రచురణ పట్ల సానుకూల స్పందన వచ్చింది. దీంతో మరో ఐదు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు శ్రీవిద్య. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతోపాటు దీపావళి, సంక్రాంతి పండుగల విశేషాలతో పుస్తకాలను ముస్తాబు చేశారు. ఈ రచనలను ప్రవాసులు మరింత ఇష్టపడుతున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్డర్ అందిన వారం రోజుల్లోనే చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్, సోనూసూద్, స్వప్నాదత్ కోరికోరి ఎపిక్ బుక్స్ తెప్పించుకున్నారని ఆనందంగా చెప్పారు శ్రీవిద్య. త్వరలోనే హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ వీటిని అందుబాటులోకి తేవాలన్నది ఆమె ఆలోచన.
-గంజి ప్రదీప్ కుమార్