కరాకస్: వెనిజువెలా భూకంప(Venezuela Earthquake) శిథిలాల కింద 8 రోజులు సజీవంగా ఉన్న ఓ వ్యక్తిని రక్షించారు. గత వారం రెండు సార్లు వెనిజువెలాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఓ మాల్ బిల్డింగ్ ఆ భూకంప తీవ్రతకు కూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే గురువారం ఎమర్జెన్సీ వర్కర్లు హెర్నన్ ఆల్బర్ట్ గిల్ అనే వ్యక్తిని కాపాడారు. అతని వయసు 44 ఏళ్లు. 9 అంతస్తుల గెలారియస్ ప్లాయా గ్రాండ్ షాపింగ్ సెంటర్లో అతను సెక్యూర్టీ గార్డుగా పనిచేస్తున్నాడు. ట్యూబ్ ద్వారా ఆల్బర్ట్ గిల్‌కు ద్రవాలను అందించారు. అయితే అతన్ని చేరుకునేందుకు రెండు టన్నెల్స్ తొవ్వారు.
దాదాపు 140 టన్నుల బరువున్న శిథిలాల కింద ఆ మృత్యుంజయుడు సుమారు వంద గంటల పాటు సజీవంగా ఉన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిల్‌ను ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగేజ్ పరామర్శించారు. అతన్ని లివింగ్ మెరాకిల్గా ఆమె పోల్చారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో షేర్ చేశారు. జూన్ 24వ తేదీన సంభవించిన జంట భూకంపం వల్ల వెనిజువెలాలో సుమారు 2595 మంది మరణించారు. వేల మంది ఆచూకీ ఇంకా తెలియకుండా ఉంది. చిలీ, అమెరికా, పోర్చుగల్, మెక్సికో, కోస్టారికా, వెనిజువెలా దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.