హైదరాబాద్ :కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లి బంగారం లాక్కుని మహిళను దుండగుడు బావిలో తోసేసి పారిపోయాడు. 21 గంటలు బావిలోనే ఉండి, ప్రాణాలతో మహిళ బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి(55) అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఎప్పటిలాగే లక్ష్మిని ఆమె కొడుకు సందీప్ కూలి అడ్డ వద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో కూలీ పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకున్న గుర్తు తెలియని దుండగుడు నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి మహిళ వద్ద ఉన్న అర తులం బంగారం, 4వేల నగదు లాక్కుని బావిలో తోసేశాడు. మహిళ బావిలో ఉన్న తాడు పట్టుకుని పైకి రావడం గమనించిన దుండగుడు తాడును కోసేసి వెళ్లిపోయాడు. లక్ష్మి బావిలో ఈదుకుంటూ, మోటారుకున్న పైపును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నది.
రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా నుస్తులాపూర్ గ్రామం అంతా గాలించినా మహిళ లభించని ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బావి దగ్గరికి వెళ్లిన భూ యజమానికి బావిలో నుంచి కేకలు వినిపించడడంతో గ్రామస్తుల సహకారంతో లక్ష్మిని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.