ఎత్తయిన చోట ఉన్నప్పుడు పడిపోతామేమోననే భయంతో కొంతమంది బిగుసుకుపోతారు. జాగ్రత్తపడటం మంచిదే. కానీ, పడిపోకుండా రక్షణ ఉన్నా భయపడతారు. పర్వతాలు, వంతెనలు, ఎత్తయిన కట్టడాలపైకి వెళ్లినప్పుడు అందరూ ఉల్లాసంగా గడిపేస్తుంటే వీళ్లు తమతోపాటు పక్కవాళ్లను కూడా భయపెడుతుంటారు. ఎత్తయిన ప్రదేశంలో నిలబడి సుదూరాన్ని చూస్తుంటే సంతోషానికి బదులు భయం కలుగుతుంటే ఆక్రోఫోబియా ఉందని అర్థం చేసకోవాలి. దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు.
ఆక్రోఫోబియా మీ మనసు, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మొదటగా అర్థం చేసుకోండి. అప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి మీ అంతట మీరే ప్రయత్నిస్తారు. ఆక్రోఫోబియా నుంచి బయటపడటానికి కొద్దిపాటి ఎత్తయిన ప్రదేశాలకు తరచుగా పోతూ ఉండాలి. ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు సుదీర్ఘంగా గాలి పీల్చుకోవడం, మనసును అదుపులో పెట్టుకోవడానికి కొంచెంసేపు ధ్యానం చేయండి. అప్పుడు ఆందోళన తగ్గుతుంది. మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్లకు దగ్గరగా ఉండండి.