Yasmin Karachiwala | సామాజిక మాధ్యమాల్లో సినిమా రివ్యూయర్లు, ట్రావెలాగ్ ముచ్చట్లు పంచుకునే వాళ్లదే హవా! ఆ తర్వాతి స్థానం ఫిట్నెస్ ట్రైనర్లదే! ఆరోగ్య సూత్రాలు, వర్కవుట్ విధానాలు తెలియజేసే మహిళలు సోషల్ మీడియాలో సూపర్స్టార్లుగా ఎదుగుతున్నారు. ముంబయికి చెందిన యాస్మిన్ కరాచీవాలా ఈ కోవకే చెందుతుంది. ఫిట్నెస్ పాఠాలు చెబుతూ తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఆమె చేసిన వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో సెలెబ్రిటీలకు ఫిట్నెస్ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, అలియా భట్ తదితర తారలకు వ్యక్తిగత ఫిట్నెస్ శిక్షకురాలిగా పనిచేస్తున్నది. శరీర దృఢత్వాన్ని పెంచే పిలేట్ కసరత్తులు చేయించడంలో ఆమె దిట్ట. తేలికైన కసరత్తులకు సంబంధించిన ఎన్నో విషయాలు తన యూట్యూబ్ చానెల్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుంది యాస్మిన్. ఈ ఫిట్నెస్ ట్రైనర్ ఇన్‌స్టా హ్యాండిల్‌ను పది లక్షల మంది ఫాలో అవుతుండటం విశేషం.