నమస్తే మేడం. నా వయసు 37 సంవత్సరాలు. మా వారి వయసు 41. ఈ మధ్యే పెండ్లయింది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు 28 రోజుల సైకిల్. ఇటీవల వారం రోజులు ఆలస్యం అయింది. నేను నెల తప్పానా. ఈ సమయంలో మేం కలవచ్చా?
– ఓ పాఠకురాలు
మీరు వెంటనే పిల్లలు కావాలనుకోవడం మంచి విషయం. వారం రోజులు నెలసరి ఆగింది అంటున్నారు కాబట్టి, మార్కెట్లో దొరికే కిట్ సహాయంతో ముందుగా యూరిన్ టెస్ట్ చేసుకోండి. ఇంకా కచ్చితమైన ఫలితం కోసం బీటా హెచ్‌సీజీ అనే రక్త పరీక్ష చేస్తారు. అందులో మీరు నెల తప్పారా, లేదా అన్న విషయానికి సంబంధించి దాదాపు కచ్చితమైన ఫలితం దొరుకుతుంది. దాని ఆధారంగా డాక్టర్ని సంప్రదించండి.
ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే కనుక, మీరు ఇప్పుడు కలవకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వయసులో వచ్చే గర్భం చాలా బలహీనంగా ఉంటుంది. ఇరవైల్లో వచ్చేదానికి ఇది పూర్తి భిన్నం. అందుకే, పిండం పరిస్థితి ఏంటి అన్నది డాక్టర్ల ద్వారా తప్పకుండా తెలుసుకోవలసిందే. ఇక, ఈ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. భార్యాభర్తలిద్దరూ మంచి గైనకాలజిస్టుని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ కొన్ని పరీక్షలు చెబుతారు. అండాల సంఖ్య ఎంత ఉంది, అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అన్నది చూస్తారు. బీపీ, షుగర్, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయుల్లాంటివీ పరీక్షిస్తారు. ఫలితాల ఆధారంగా మందుల్ని సూచిస్తారు. వాటిని వాడుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డని త్వరగా కనొచ్చు. ఆల్ ది బెస్ట్!
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్