Fashion | వాచ్ అనగానే సింగిల్ పీస్‌గానే మనకు తెలుసు. అదీ కాదంటే, దానితో పాటు బ్రేస్లెట్ లేదా కడాతో దొరుకుతాయి. ఇప్పుడు వీటికి ఉంగరమూ తోడైంది. అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి కోసమూ ఈ తరహా సెట్లు తయారవుతున్నాయి. తొలుత కస్టమైజ్డ్గానే సిద్ధమైన ఈ ‘త్రీపీస్ వాచ్ సెట్’లు ఇప్పుడు అందుబాటు ధరల్లో, బోలెడు డిజైన్లలో దొరుకుతున్నాయి.
కాలంతో పాటు మారే ఫ్యాషన్ ప్రకారం సమయాన్నీ చూపించడం మొదలు పెట్టింది వాచీ. అందుకే, అవసరంగా కన్నా, ఆహార్యంలో భాగంగానే చూస్తారు చాలామంది. ఆ కారణంగానే చేతి గడియారాలను చేతనైనంత సరికొత్తగా తీర్చిదిద్దుతుంటారు డిజైనర్లు. ఫ్యాషన్ ప్రియులకు మ్యాచింగ్ పిచ్చి ఎక్కువని గమనించి చేతికి పెట్టుకునే ఆభరణాలన్నిటినీ సెట్‌గా తయారు చేస్తున్నారు. అంటే వాచీతో పాటు బ్రేస్లెట్ లేదా కడ, వీటికి సరిపడా ఉంగరం ఇందులో ఉంటాయి.
ఈ మూడు పేర్లూ కలిపి ‘వాచ్ బ్రేస్లెట్ రింగ్ సెట్’గా పిలుస్తున్నారు. రోజువారీ పెట్టుకునేందుకే కాదు, ప్రత్యేక సందర్భాలు, వేడుకలప్పుడు ధరించడానికి వీలుగా రకరకాల రాళ్లు పొదిగి మెరిసిపోయేవీ రూపొందుతున్నాయి. పూలు, ఆకులు, సీతాకోక చిలుకల్లాంటి విభిన్న డిజైన్లు వీటిలో వస్తున్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకునేలా రెడీ మేడ్‌గా దొరుకుతున్నాయి. ఆడపిల్లలే కాదు, కాస్త ఫ్యాషన్‌ను ఇష్టపడే మగపిల్లలూ వీటిని పెట్టుకుంటున్నారు.