ట్రెండీగా కనిపించాలి.. సౌకర్యవంతంగానూ ఉండాలి.. ఉపయోగంలోనూ తగ్గేదేలే అనిపించాలి.. పర్సుల విషయంలో ఈ లక్షణాలన్నీ ఉండాలంటే బెల్ట్ బ్యాగుల గురించి చెప్పుకోక తప్పదు. ఫ్యాషన్ యాక్సెసరీల కోవలో ఇప్పుడు నడుము బ్యాగులకు క్రేజ్ పెరుగుతున్నది. ప్రయాణంలో అయినా, వాకింగ్‌కు వెళ్లినా చేతిలో కనీసం ఒక పర్సు, అందులో సెల్‌ఫోన్ తప్పకుండా ఉండాల్సిందే. అలాంటప్పుడు చేత్తో పట్టుకునే అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయి. సాధారణ లెదర్ రంగులతో పాటు గులాబి, ఆకుపచ్చ, ఎరుపు.. ఇలా విభిన్న వర్ణాల్లో దొరుకుతున్నాయి. మ్యాచింగ్‌గా ధరించేందుకూ బాగుంటాయి. కావాలనుకుంటే మామూలు బ్యాగులా చేతిలోనూ పట్టుకోవచ్చు. ఇప్పటి యువతకు నచ్చాలంటే ఇన్ని ఫీచర్స్ ఉండాల్సిందే మరి, ఏమంటారు?!