Cassata Ice Cream | ఆకాంక్ష గాంధీది పక్కా ఐస్‌క్రీమ్ కుటుంబం. తండ్రి, తాత, ముత్తాత.. అంతా ఐస్‌క్రీమ్ వ్యాపారులే. డైనింగ్ టేబుల్ మీద రోజూ ఆ చర్చలే జరిగేవి. అమ్మమ్మ, అమ్మ, పిన్ని.. ఆ ముచ్చట్లే చెప్పుకొనేవారు. దీంతో తానూ ఐస్‌క్రీమ్ గాళ్‌గా మారిపోయింది. ఇప్పుడు, వాడీలాల్ ఐస్‌క్రీమ్స్.. పరివారానికి నవతరం ప్రతినిధి ఆకాంక్ష. అహ్మదాబాద్‌లో సోడా దుకాణంతో మొదలైంది ఆ కుటుంబ వ్యాపారం. ఆ తర్వాత చేత్తో ఐస్‌క్రీమ్‌లు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఆకాంక్ష వాళ్ల తాతయ్య ఆవిష్కరించిన ‘కసాటా ఐస్‌క్రీమ్’కు ఆదరణ పెరగడంతో.. ఒక్కసారిగా దశ తిరిగింది. వాడీలాల్ ఐస్‌క్రీమ్స్ ఓ బ్రాండ్‌గా అవతరించింది.
అహ్మదాబాద్ చుట్టుపక్కల పది ఔట్లెట్స్ వెలిశాయి. తరువాతి తరం పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. వ్యాపారం కోట్లకు చేరుకుంది. ‘తరాలనాటి విలువలను కాపాడుకుంటూనే.. వ్యాపారాన్ని బహుళజాతి సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం’ అంటుంది ఆకాంక్ష. కంపెనీ మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంది తను. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం, ఆన్లైన్ వ్యాపారాన్ని పెంచడం ఆమె తక్షణ లక్ష్యాలు. ఈ మధ్యే కనిపిస్తున్న ఐస్‌క్రీమ్ కెఫేల ఏర్పాటు ఆలోచనా తనదే. కొత్తతరాన్ని ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ. ఫ్రాంచైజీ మాడల్‌లో దేశమంతా విస్తరించే ఆలోచనలూ ఉన్నాయి తనకు. వాడీలాల్ ఐస్‌క్రీమ్స్ గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఆ అంకెలను రెట్టింపు చేసే పనిలో ఉంది ఆకాంక్ష.