ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పేరు చెప్పగానే ఇటీవల ఆ ప్రాంతం కుంగిపోతున్నదనే వార్తలే గుర్తుకువస్తాయి. జోషీమఠ్ చోటా చార్ధామ్ యాత్రలో ఓ మజిలీ. కాబట్టి, కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శనకు వెళ్లే యాత్రికులు లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఎంతో చెత్త ఇక్కడ పోగవుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు. అయితే స్థానిక మునిసిపాలిటీ మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలను లాభదాయకంగా మలుచుకుంది.
ఇటీవలి కాలంలో యాత్రికులు వదిలి వెళ్లిన సుమారు మూడువేల కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయించింది. ఒక కోటి ఇరవైలక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు మునిసిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చుకుందన్నమాట.
ఇకపోతే ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువ వరకు యాత్రికుల రోడ్డువారగా పడేసిన నీళ్లసీసాలు, శీతలపానీయాల సీసాలే ఉండటం గమనార్హం. “బదరీనాథ్, కేదార్నాథ్ మార్గాల్లో ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాం. వాటిని మునిసిపాలిటీ ఇటుకలుగా మార్చి అమ్మకానికి పెట్టింది” అని గోపేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారి ప్రీతమ్ సింగ్ నేగి వెల్లడించారు. కాగా, జోషిమఠ్ నుంచి పాండుకేశ్వర్, హేమకుండ్సాహెబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మార్గాల్లో యాత్రికులు పారేసిన వ్యర్థాలను శుద్ధిచేసే బాధ్యతను గోపేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ చూసుకుంటున్నది.
అయితే, చార్ధామ్, హేమకుండ్ సాహెబ్ క్షేత్రాలను రోజుకు సగటున డెబ్బయి ఐదువేల మంది సందర్శిస్తుంటారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఆదాయం సంగతి అలా ఉంచితే, వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతుండటంతో పర్యావరణ పరిరక్షణ ఓ సవాలుగా మారుతున్నదని పర్యావరణ కార్యకర్త చందన్ నయాల్ ఆవేదన. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులను వీలైనంత వరకు తీసుకువెళ్లకపోవడం ఉత్తమం.
– రాధాస్వామి సత్సంగ్ సంప్రదాయం