శీతాకాలంలో దంత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ తగ్గడం, పడిపోయే ఉష్ణోగ్రతలు.. దంతాలపైనా ప్రభావం చూపిస్తాయి. ఈక్రమంలో శీతాకాలంలో ఇబ్బందిపెట్టే దంత సమస్యలు, వాటి నివారణ చర్యలను వైద్యులువివరిస్తున్నారు.
చల్లని పదార్థాలు తిన్నా, నీళ్లు తాగినా.. దంతాలు జివ్వుమని లాగుతాయి. దంతాల పై ఉండే ఎనామిల్ దెబ్బతినడం, బలహీనంగా మారడం వల్ల ఈ సమస్య వస్తుంది. చలి వల్ల దంతాల లోపలి నరాలు ప్రభావితమై.. నొప్పి పుడుతుంది. దీనిని నివారించడానికి.. ఎనామిల్‌ను దెబ్బతీసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా, సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఆరెంజ్ పండ్లకు కాస్త దూరం పాటించాలి.
చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా వేస్తుంది. దాంతో నీళ్లు తక్కువగా తాగుతారు. ఫలితంగా, లాలాజలం ఉత్పత్తి తగ్గి.. నోరు పొడిబారుతుంది. అయితే, లాలాజలం తక్కువైతే దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. రోజూ తగినన్ని నీళ్లను తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో చిగుళ్లపై నోటిలోని బ్యాక్టీరియా దాడి చేసి, వాపు, రక్తస్రావానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో దంతాలు బలహీనంగా మారి, ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండేందుకు రోజుకు ఒకసారి గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించాలి. చల్లని, వేడి నీటికి బదులుగా.. గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.