అతివలను ఆకర్షించే వాటిలో ఆభరణాలది మొదటిస్థానం. అందులోనూ నిండైన రంగుతో ఉండే పూసలు, రాళ్లు పొదిగిన నగలంటే మరింత ఇష్టపడతారు. ప్రకృతిలో దొరికే ముత్యాలు, రత్నాలతో తీర్చిదిద్దిన నగలు మగువ మేనిపై మరింత అందంగా మెరిసిపోతాయి. ఇక, జవరాళ్లను అమితంగా ఆకర్షించే రాళ్లు కెంపులు. గులాబీ, ఎరుపు రంగుల మేళవింపుతో ఇంపుగా తళుకులీనే కెంపులు నగల సొంపును మరింత పెంపు చేస్తాయి. కెంపులు పొదిగిన ట్రెండీ నగలను ఈ తరం యువతులూ ఇష్టంగా ధరిస్తున్నారు.
నవరత్నాల్లో ప్రధానమైనది కెంపు. రూబీగా పిలిచే ఈ రత్నాన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కెంపును సూర్యుడి రత్నంగా చెబుతారు. వీటిని ధరించిన వారికి శ్రేయస్సు, విజయం లభిస్తాయని భావిస్తారు. కెంపు ధరించడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నమ్ముతారు. అందుకే భారతీయ సంప్రదాయ నగల్లో కెంపులు ఎక్కువగా మెరిసిపోతుంటాయి. ఎర్రని మాణిక్యాలను ఏ రాళ్లతో జోడించినా అందంగా అమరిపోతాయి. గుత్తపూసలు, ముత్యాలు, పచ్చల కలయికతో కెంపులు పొదిగిన నగలు సంప్రదాయ దుస్తులపై ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
కెంపులు ఉంగరాల్లోనూ ఇంపుగా కుదురుకుంటాయి. తర్వాత కంఠాభరణాలు, వడ్డాణాలు, వంకీలు, మాంగ్టిక్కాలు, గాజులు ఇలా రకరకాల ఆభరణాల్లో కెంపులతో ఒంపులు తిరిగిపోతుంటారు వనితలు. యువతను ఆకట్టుకునేలా సన్నని గొలుసులు, వాచీలు, గాజులు, ముక్కుపుడకల్లోనూ కెంపులకు చోటిస్తున్నారు డిజైనర్లు. బంగారం కొనలేని వారికి వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ బాపతులోనూ కెంపుల నగలు అందుబాటులో ఉన్నాయి.