వసంతానికి నేస్తాలు మల్లెలు.. మరి హేమంతానికి? రంగురంగుల చేమంతులు.. అల్లిబిల్లి లిల్లిపూలు.. దోస్తులు. తన రాకతో పరవశించే ప్రకృతికి మంచుతెరల చీర చుడుతుంది ఈ రుతురాజ్ఞి. భానూదయాన్ని ఆలస్యం చేస్తూ.. పొద్దుపై పెత్తనం చెలాయిస్తుంది. చీకట్లో శక్తి పుంజుకునే రాక్షసుల్లా.. మలిసంజె దాకా వెచ్చగా మాటేసి ఆపై చలిపంజా విసురుతుంది. నెచ్చెలి ఉన్నవారికిది కోరుకునే చలి. కీళ్లరిగిన వాళ్లకి మాత్రం కొరుకుడుపడని పులి. లోతుగా గమనిస్తే.. జంట మాసాలను వెంటేసుకొని ఆగమించిన హేమంతం ఆసాంతం సంతసమే!
ఏ దేశంలో ఉండేవారికైనా తాము ఇతరులకంటే గొప్పవాళ్లం, తమ సంస్కృతి, వారసత్వం ఘనం అనే నమ్మకం ఉండి తీరుతుంది. అది సహజం. కానీ, చాలా ఇతర దేశాల వారు కూడా ఒప్పుకొనే ఓ మాట ఏమిటంటే.. భారతీయులకు తాత్విక చింతన, విశ్లేషణా సామర్థ్యం చాలా ఎక్కువని! మేధస్సులో ఎవరికీ తీసిపోరు. ఇందుకు కారణంగా రక్తాలు, జన్యువులు లాంటి విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఓ స్పష్టమైన ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం. ఒక్కో రుతువూ క్రమంగా పరుచుకుంటూ… దాని ప్రభావాన్ని పూర్తిగా చూపించే ఆశ్చర్యకరమైన వాతావరణం ఈ అవనిలో కనిపిస్తుంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా వేసవికీ, శీతకాలానికీ ఉష్ణోగ్రతల్లో 15 నుంచి 25 డిగ్రీల వరకూ వ్యత్యాసం కనిపిస్తుంది. రోహిణిలో వేసవి తాపానికి గొంతెండినవాడు, ఆర్ద్రలో పడే చినుకులకు పరవశించిపోతాడు. ఎడతెరపి లేని వానలకు చిరాకుపడిన వాడు చలికాలం రాగానే మురిసిపోతాడు. ఇక్కడి మనుషులు మారిన రుతువులను ఎంతగా ఆస్వాదిస్తారో.. నేల కూడా అంతగానే ప్రభావితం అవుతుంది.
Hemantha Ruthuvu | మనభూమిలో సారం ఎక్కువ. అందుకే తరాలుగా మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం. రుతువుకు ఆ నేల స్పందించే తీరు కూడా అద్భుతం. కళ్ల ముందు కాన్వాస్ పరుచుకున్నట్టుగా ఇక్కడి గడ్డిపరకలు సహా పూలు, పళ్లు … అన్ని రంగుల్లోనూ కనిపిస్తాయి. తన కళ్ల ముందు ఇన్ని అనుభవాలనీ, మార్పులనీ, సజీవమైన ప్రకృతినీ గమనిస్తున్న మనిషిలో తాత్వికత రాకుండా ఎలా ఉంటుంది. అగాధపు లోయలు, ఆకాశపు కొండలు, నదులూ, సంద్రాలూ తనకు జీవితాన్ని అన్నివైపులా పరిచయం చేస్తాయి. ప్రతి కాలానికీ తట్టుకునేలా శరీరం, ఆ కాలంలో దొరికే ఆహారం తనను పరిపూర్ణమైన మానవుడిలా మారుస్తుంది. ఆరు రుతువులూ అద్భుతాలే! ఆమని హాయిగొలిపితే, గ్రీష్మ తాపం వర్షరుతువుకు ఆలంబన అవుతుంది. శిశిరం ఆకురాల్చి వసంతానికై అర్రులుచాస్తుంది. ఇక శరత్తు మత్తులో ఉండగానే వచ్చే హేమంతం కొన్ని ప్రత్యేకతల సమాహారంగా కనిపిస్తుంది. ఆ విశేషాలే ఇవి..
ఇప్పుడంటే నాలుగు గోడల మధ్యా.. ఓ కంప్యూటర్ తెర ముందు మన జీవితం గడిచిపోతున్నది. తినాలంటే రుచి మాత్రమే ఉండి పోషకాలు ఏమాత్రం లేని తిండి, కాలం గడపాలంటే మొబైల్, కాలు కదపాలంటే బండి, కుటుంబంతో గడపాలంటే రిసార్ట్. చూస్తుండగానే వారాలు, నెలలు, ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇక ఫలానా రుతువు అని గమనించుకునే సమయం ఏది. కార్తిక మాసంలో దీపాలు, సంక్రాంతి పిండివంటలు, దసరా పూజలు అన్నీ క్యాలెండర్ ప్రకారమే. కానీ ఆ క్యాలెండర్ పేజీల వెనకాల దాగిన రుతువులతో ఓసారి మమేకం అయితే… జీవం విలువ తెలుస్తుంది. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం అవుతుంది. తాత్వికత అలవడుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, అక్షరయానంగా హేమంతరుతువు మన జీవితంలో భాగమైన తీరును ఓసారి చూద్దాం!
అక్షరహేమంతం!
మనిషికి తన భావాన్ని ప్రకటించే అవకాశం మొదలవడంతోనే తన చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణించాడు. అందులో హేమంతమూ ఉంది. వాల్మీకి నుంచి కాళిదాసు వరకూ అందరూ హేమంత సంతసాన్ని తలచుకున్నవారే. తెలుగునాట కూడా ఈ ప్రాభవం తక్కువేమీ కాదు. భాగవతం అంటే తెలుగువారికి గుర్తుకు వచ్చేది అక్షరాలు పోత పోసిన బమ్మెర పోతనే! అప్పటి సామాన్యులను సైతం ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా సాగిన తన అనువాదం… భక్తిలోనే కాదు, తెలుగు సాహిత్యంలో కూడా ఓ విప్లవం! మంచిని చెప్పే ఉటంకింపులుగా, నోరు తిరిగేందుకు అభ్యాసంగా, అక్షరపు అందాన్ని చూపించే మాధుర్యంగా, భాష మీద పట్టు కలిగించే నేర్పుగా, దైవాన్ని తలుచుకునే ఆలంబనగా… పోతన భాగవతాన్ని ఎన్నివిధాలుగానో తెలుగు సమాజం అక్కున చేర్చుకుంది. పోతన కూడా భాగవతాన్ని కేవలం తెనుగీకరించలేదు.. ఇక్కడి జీవనశైలికి, సంస్కృతికి అనుగుణంగా మార్చేశారు. తను స్పృశించని అంశం లేదేమో. అందులో హేమంతమూ ఒకటి. పోతన భాగవతంలోని దశమ స్కంధంలో హేమంత వర్ణన స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో ఒక్కో పద్యం ఒక్కో అంశాన్ని విశదపరుస్తుది. ఒక రుతువును ఇన్ని రకాలుగా చూడవచ్చా అనిపించే భావనలివి.
హేమంతం ఓ దేవత అయితే!
ప్రకృతి రూపాలకు పేర్లు పెట్టడం, వాటికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం కొత్తేమీ కాదు. అలా హేమంతాన్ని కూడా ఓ వ్యక్తిలాగో, శక్తిలాగో భావించిన సందర్భాలు లేకపోలేదు. వేర్వేరు దేశాల్లోని జానపదులు హేమంతం చుట్టూ అల్లుకున్న నమ్మకాలు ఆసక్తికరంగా ఉంటాయి.
భక్తి మార్గశిరం
మార్గశిర, పుష్య మాసాలను హేమంత రుతువుగా పేర్కొంటాం. సుమారుగా ఇవి డిసెంబర్, జనవరి నెలలో వస్తాయి. మార్గశిరం అంటేనే చాలామందికి గీతలో కృష్ణుడు అన్న ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్న మాట గుర్తుకొస్తుంది. అసలు గీతను బోధించిందే ఈ పవిత్ర మార్గశిరంలో అనే విశ్వాసంతో ఈ మాసంలో గీతాజయంతిని పాటిస్తారు. ఒకప్పుడు మార్గశిరంతో మొదలయ్యే హేమంతమే మనకు సంవత్సరాదిగా ఉండేది అనడానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పటికీ భక్తిపరులకు మార్గశిరం ఓ గొప్ప సందర్భమే. మార్గశిరం అన్న పేరులోనే ఉన్నతమైన మార్గం అనే అర్థం ధ్వనిస్తుంది. ఈ మాసంలో చలి ప్రభావం ఎలాగూ తెలిసిందే. దానికి తోడు మనసులో అలజడి రేపే చంద్రుని ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెబుతారు. ఈ పరిస్థితులు కలిగించే చిరాకులను, కుంగుబాటును ఎదుర్కొనేందుకు ఆలయ సందర్శన, భగవన్నామస్మరణ, పూజలు, వ్రతాలు ఉపయోగపడతాయని పెద్దల నమ్మకం. అందుకేనేమో మార్గశిరంలో ప్రతిరోజూ ఏదో ఒక పండుగ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్రసప్తమి, కాలభైరవాష్టమి, గోవత్స ద్వాదశి, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి… ఇలా అనుదినం ఏదో పర్వం పలకరిస్తుంది. ఇక మార్గశిరంలో ఉన్న వ్రతాలూ విశేషమే! హనుమద్వత్రం, స్కంద వ్రతం, గురువార లక్ష్మి వ్రతం లాంటి సందర్భాలు కనిపిస్తాయి.
మార్గశిరంలో కనిపించే మరో విశేషం ఏమిటంటే ఇందులో ప్రతీ దైవానికీ ప్రాధాన్యం కనిపిస్తుంది. నాగపూజ, దత్తాత్రేయుడు, కార్తికేయుడు, భైరవుడు, గణపతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి… చివరికి యమ ధర్మరాజును కూడా ఈ మాసంలో కొలుస్తారు. చలి ఎక్కువగా ఉండే ఈ రోజులను యమదంష్ట్రలుగా భావిస్తూ, ఈ కాలం మృత్యుఘడియల్ని తరిమేసేందుకు ఆ సమవర్తిని కొలుచుకోవాలి అని సూచిస్తారు. మార్గశిరంలోనే కనుక సూర్యడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తే… ధనుర్మాసమూ వచ్చేస్తుంది. గోదాదేవి పాశురాలు, గొబ్బెమ్మలు, విష్ణుపూజలతో కేశవాలయాలన్నీ సందడిగా మారిపోతాయి. ఆ నెల రోజులూ వైష్ణవ భక్తులకు ఓ పారవశ్యం. వైకుంఠం వైపుగా వారికది మార్గశీర్షం!
మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం అనగానే సంక్రాంతి గుర్తుకు వచ్చేస్తుంది. పంటల పండుగ కాబట్టి ప్రతీ ప్రాంతంలో అక్కడి పరిస్థితులకు, జీవనశైలికి అనుగుణంగా ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు కనిపిస్తాయి. పౌష్ సంక్రాంతి (బెంగాల్), లోరి (పంజాబ్), సుగ్గి (కర్ణాటక), పొంగల్ (తమిళనాడు) ఇలా పేర్లు వేరైనా హేమంతంతో పాటు వచ్చే సానుకూలమైన మార్పును స్వాగతించే ప్రయత్నమే. కీడు పండుగ భోగి, పెద్దల తలపుగా సంక్రాంతి, పశువుల గౌరవార్థం కనుమ, గ్రామదేవతల కొలుపుగా ముక్కనుమ… ఇలా తెలుగునాట ఘనంగా సాగుతుంది సంక్రాంతి. మార్పును స్వాగతిస్తూ, అనుబంధాలను దగ్గర చేస్తూ, తోటి జీవులకు మర్యాదనిస్తూ, ధాన్యరాశులను అందరితో పంచుకుంటూ సాగే ఓ బతుకుపాఠం ఈ పండుగల పరంపర! సంక్రాంతి నాడు ఇంటిముందు పక్షుల కోసం కట్టే ధాన్యపు కంకుల నుంచి ఆ రోజు వండుకునే పిండివంటల వరకూ ప్రతి సంప్రదాయం వెనుకా తరతరాలుగా ప్రకృతికి అనుగుణంగా అలవర్చుకున్న జీవనవిధానం కనిపిస్తుంది.
హేమంత రుతుచర్య
ఏ కాలానికి తగిన ఆహారం ఆ కాలంలో తీసుకువాలి అనే ఎరుక మన పూర్వికులలో ఉన్నంతగా లోకంలో ఇంకెక్కడా కనిపించదు. కాలాన్ని బట్టి మన జీవనశైలి, ఆహారపు అలవాటు మారాలని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతుంది. దీనికే రుతుచర్య అని పేరు. ఇందులో హేమంత రుతుచర్య ఒకటి. ఈ కాలంలో వాత దోషం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. చర్మం పొడిబారిపోవడం, కీళ్ల నొప్పులు రావడం లాంటి లక్షణాలు కనిపించడం వెనుక ఇదే కారణం. తరచూ నూనెతో అభ్యంగనం చేస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తారు. సంక్రాంతి రోజు తప్పకుండా నువ్వుల నూనె పట్టించి స్నానం చేయమని చెప్పడం వెనుక కూడా ఇదే కారణం కనిపిస్తుంది. నువ్వులు వేడి పుట్టిస్తాయి, చర్మానికి మృదుత్వాన్నిస్తాయి. కీళ్లకు మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వాతదోషానికి పరిహారంగా చెబుతారు. హేమంత రుతువులో మధుర రసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటుంది ఆయుర్వేదం. కాబట్టి సహజమైన తీపి ఉండే బెల్లం, తేనె ఈ రోజుల్లో తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు అందండంతో పాటు వేడినీ కలిగిస్తాయి. అంతేకాదు శరీరంలో ఉష్ణం పుట్టించే నువ్వులు, కఫాన్ని కరిగించే తులసి, చర్మం పొడిబారకుండా చేసే నెయ్యి లాంటి పదార్థాలను తీసుకోవాలని ఆయుర్వేదం సూచించింది. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పులు వచ్చినప్పుడు దుష్ఫలితాలు కలిగించే సిట్రజన్ లాంటి మందులకంటే ముందుగా… గూడూచి, కరక్కాయ, మిరియాలు, పసుపు, శొంఠి లాంటి చేతికందే పదార్థాలను వాడి చూడమని పెద్దలు చెబుతుంటారు.
హేమంతం అంటేనే ఓ సమూలమైన మార్పు. వ్యవసాయపరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికత పరంగా అనూహ్యమైన ఆచరణ ఉండాల్సిన సమయం. ఆ బాధ్యతల్ని గమనించుకుంటూనే కళ్ల ముందు పరుచుకునే ప్రకృతిని మనలోకి కూడా కాస్త స్వీకరిద్దాం. పచ్చికలో నిలబడి, గుండెల నిండుగా ఊపిరి పీల్చుకుందాం. ఆ అనుభూతే హేమంతానికి ప్రతీక.
SAD గా వద్దు!
చలికాలం హాయిగా దుప్పటి ముసుగుపెట్టి పడుకోవాలనిపించడం సహజం. కానీ, కొంతమందికి మరీ నిస్ర్తాణంగా అనిపిస్తుంటుంది. ఏ పనీ చేయాలనిపించకపోవడం, నిరాశ, ఏకాగ్రత లేకపోవడం, కుంగుబాటు, ఒకప్పుడు ఇష్టంగా అనిపించిన విషయాల మీద కూడా ఆసక్తి లేకపోవడం… ఇలాంటి లక్షణాలు హేమంతంతో పాటుగా మన జీవితంలోకి ప్రవేశిస్తే మాత్రం అది Seasonal affective disorder (SAD) అయ్యే అవకాశం ఉంది. చలికాలంలో సుదీర్ఘమైన రాత్రుల వల్ల జీవగడియారం అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు… సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మూడ్‌ని, జీవగడియారాన్ని ప్రభావితం చేసే సెరెటోనిన్, మెలటోనిన్ లాంటి హార్మోనుల ఉత్పత్తి తగ్గిపోతుంది. వీటి ఫలితమే SAD. మన పెద్దలు పూజలు, దీపారాధన, వనభోజనాలు, వ్రతాలు, నామస్మరణ లాంటి సంప్రదాయాలను సూచించడం వెనుక ఈ కాలంలోని నిస్సత్తువను తరిమి మనసును, శరీరాన్నీ చురుగ్గా ఉంచే ప్రయత్నమే అని కొందరి నమ్మకం. ఒకవేళ చలికాలంలో ఈ SAD లక్షణాలు కనిపిస్తూ… అవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మేలు.
శ్వాసకోస సమస్యలకి చెక్!
చలికాలం మొదలవగానే జలుబు, దగ్గు, గొంతునొప్పి అతిథులుగా వచ్చేస్తాయి. అదైతే మనకు తెలుసు కానీ చలికీ ఈ సమస్యలకీ మధ్య ఏంటి సంబంధం? అది తెలుసుకుంటే, దాన్ని ఎదుర్కోవడం కూడా తేలికవుతుంది.
హేమంతం
హేమంతంలో కళ్ల ముందున్న ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, పంటలు ఇంటికొచ్చే సమయం కాబట్టి ఇంట్లో వాతావరణమూ సందడిగా ఉంటుంది, ఇక ఆలయాలైతే కిటకిటలాడుతుంటాయి. వీటన్నింటి మధ్యా ఓ చిన్న బెరుకు. జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు కాదు… ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయం. కారణం! చలికాలంలో ఎక్కువగా సంభవించే గుండెపోట్లు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు రక్తప్రసరణ వేగం పెరుగుతుంది, రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్లరక్తపోటు కూడా హెచ్చుతుంది, చలికి రక్తం చిక్కబడుతుంది, డి విటిమిన్ లోపమూ ఓ సమస్యే! ఇలాంటి కారణాలన్నింటి వల్లా ఎవరికైనా ఈ కాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువని చెబుతున్నారు. అయితే ఇందుకు స్పష్టమైన పరిష్కరాలు ఉన్నాయి.
1 చలికాలంలో వ్యాయామం చేస్తే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందనే ఓ అపోహ. నిజానికి చెమట పట్టని, సూర్యరశ్మి దక్కని ఈ కాలంలోనే వ్యాయామం అవసరం. దాని వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
2 దాహం వెయ్యకపోతే నీరు తాగక్కర్లేదు అనే మాట తప్పు. దాహం ఓ ప్రమాదఘంటిక మాత్రమే. అంతకుముందే నీరు తీసుకోవాలి. నీరు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ను పదిలంగా ఉంచుతుంది. అవి అదుపు తప్పితే రక్తపోటు మీద నేరుగా ప్రభావం ఉంటుంది.
3 చల్లటి వాతావరణానికి సిగిరెట్, మద్యం వల్ల మేలు జరుగుతుందనేది కూడా అపనమ్మకమే. అవి గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి. పైగా ఈ పొడి వాతావరణంలో మనం విడిచే సిగిరెట్ పొగ ఇతరులకు మరింత హాని చేస్తుంది.
4 ప్రకృతి కాలానికి అనుగుణంగా పండ్లను ఇస్తుంది. ఏ కాలంలో దొరికే, పండే ఆహారాన్ని ఆ కాలంలో తీసుకుంటే శరీరంలోని త్రిదోషాలు అదుపులో ఉంటాయి.
6 చలికాలంలోని పొడి వాతావరణం వల్ల కాలుష్యం గాలిలోనే ఉండిపోతుంది. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సమయాలకు దూరంగా ఉండటం మంచిది.
చలికి వెరవని ముగ్గురు మిత్రులు!
చలికాలం నదులు గడ్డకట్టుకుపోతాయి, జంతువులు దీర్ఘనిద్రలోకి జారుకుంటాయి, పక్షులు వలసబాట పడతాయి, సూర్యుడు సైతం వద్దామా వద్దా అన్న సంశయంలో ఉండిపోతాడు. కానీ, మూడు చెట్లు మాత్రం నిబ్బరంగా తన చుట్టూ జరిగే మార్పును చూస్తుండిపోతాయట. వెచ్చని రోజుల కోసం విశ్వాసంతో ఎదురుచూస్తుంటాయట. అవే దేవదారు (పైన్), వెదురు (బ్యాంబూ), ప్లమ్ (రేగు). ఇవి ఎంతటి చలినైనా నిశ్చలంగా తట్టుకుని మనగలగడం గమనించారు ఆసియా వాసులు. అందుకే వాటికి Three Friends of Winter అని పేరు పెట్టారు. చైనా, జపాన్, కొరియా, వియత్నాంలలో ఈ పేరుకు ప్రాముఖ్యత ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిబ్బరంగా నిలబడి, భవిష్యత్ మీద ఆశతో, పట్టుదలతో ముందుకు సాగడానికి వీటిని ఓ సూచనగా భావిస్తారు. అక్కడి హేమంతపు వేడుకలలో వీటిని తప్పకుండా అలంకరిస్తారు.
…? కె.సహస్ర