అతివల పెదాల గురించి వర్ణించాలంటే పదాలు సరిపోవు. అయితే, గులాబీ రేకుల్లాంటి పెదాలు కంటపడితే దేవదాసు సైతం కాళిదాసుగా మారిపోతాడు. మరి మీ మోవి గని మోజుపడాలంటే.. అధరాలు తేనెలూరాలి. అలా ఉండాలంటే.. ఇదిగో ఇవి ప్రయత్నించండి..
ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొద్దిగా తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో పెదాలు హైడ్రేటెడ్‌గా మారుతాయి. సాఫ్ట్లుక్తో మెరుస్తాయి.
ఆరోగ్యంతోపాటు అందానికి కూడా బీట్రూట్ ఉపయోగపడుతుంది. బీట్రూట్ రసాన్ని వేళ్లతో పెదాలపై మెత్తగా రుద్దాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ పెదాలు వర్ణరంజితమై ముద్దులొలుకుతాయి.
ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, టీ స్పూన్ తేనె, రెండు స్పూన్ల చక్కెర ఒక కప్పులోకి తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై మెల్లగా రుద్దాలి. దీనివల్ల పెదాలపై ఏర్పడిన డెడ్స్కిన్ తొలగిపోతుంది. మోవిపై ఉన్న నల్లదనం మాయమై నల్ల ఇరుక్కే అనిపిస్తాయి.
వెట్ న్యాప్కిన్తో గానీ, మెత్తని టూత్‌బ్రష్‌తో గానీ పెదాలపై మెల్లగా రుద్దాలి. దీని వల్ల పెదాలపై డ్రైగా ఏర్పడిన లేయర్ తొలగిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేయడం మంచిది. తర్వాత పెదాలకు కొబ్బరినూనె రాసుకుంటే మరీ మంచిది.