లీసా రే.. తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి. అందమైన హీరోయిన్‌గానూ, క్యాన్సర్ మహమ్మారిని గెలిచి నిలిచిన యోధురాలిగానూ ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ప్రేక్షకులు. లీసా రే.. కించిత్ వ్యాపార ధోరణి ఉన్న కళాభిమాని కూడా. కళనే వ్యాపారంగా మలుచుకుని.. ‘ది అప్‌సైడ్ స్పేస్’ అనే వేదికను ఏర్పాటుచేశారు. సమకాలీన కళాఖండాల్ని సేకరించడం ఆమె హాబీ. ‘మొదటి ఉద్యోగంలో మొదటి జీతంతో ఏదో పెయింటింగ్ కొన్నట్టు గుర్తు’ అంటారు లీసా రే. సాంకేతిక ప్రపంచం గురించి పెద్దగా తెలియని చిత్రకారులకు ఆన్లైన్లో అపార అవకాశాలను పరిచయం చేయడమే ఈ స్టార్టప్ ఉద్దేశం.
ముఖ్యంగా.. ఎన్ఎఫ్టీలు, డిజిటల్ ఆర్ట్ తదితర విభాగాలను ఆర్ట్ మార్కెట్‌కు అనువుగా ఎలా మార్చుకోవాలన్నది నేర్పిస్తారు. అవసరమైతే మెంటర్‌గానూ వ్యవహరిస్తారు. ‘ఒక్కమాటలో చెప్పాలంటే.. చిత్రకారుడికి, కళాభిమానికి మధ్య మేం వంతెనలా నిలబడతాం. కళల్ని బతికించడం, కళాకారులను ప్రోత్సహించడం.. రెండూ మా బాధ్యతలే’ అని వివరిస్తారు. ఇక్కడ పెయింటింగ్స్‌ను ఎన్ఎఫ్టీ రూపంలోనూ విక్రయిస్తారు. దీనివల్ల ఆర్టిస్టులు అంతర్జాతీయ విపణిలో తమ పెయింటింగ్స్ విక్రయించుకోవచ్చు.