మహిళలు ఎక్కువగా మక్కువ చూపించే అంశాల్లో ఆభరణాలదే అగ్రస్థానం. శుభకార్యాలు, పండగలు, పార్టీలు.. సందర్భం ఏదైనా మహిళలు తమ అభిరుచికి తగ్గట్టు రకరకాల నగలు ధరించి వగలు పోతుంటారు. మగువల
మనసు దోచేందుకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లను రూపొందిస్తూనే ఉంటారు తయారీదారులు. వినూత్న
నగలను రూపొందించడంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన టిఫనీ మరో వెరైటీ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఎప్పటికప్పుడు ముచ్చటైన నగలతో మహిళల మనసులు దోచే టిఫనీ మరో యాంటిక్ డిజైన్లతో ముందుకొచ్చింది. గ్రీకు నాగరికత ఆధారంగా ఆభరణాలను రూపొందించి అతివలోకాన్ని అచ్చెరువులో ముంచేసింది. తాజాగా మార్కెట్లో విడుదల చేసిన ‘టైటాన్’ రకం ఆభరణాలు.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. గ్రీకు పురాణాల్లో సముద్రుణ్ని టైటాన్ అని పిలుస్తారు.
ఆ పేరుతో ఈ నగలను రూపొందించారు. సముద్ర దైవం పోసిడాన్ మోసుకెళ్లిన త్రిశూలం స్ఫూర్తితో వీటిని తయారుచేశారు. శూలం డిజైన్ చెవికమ్మలు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, గొలుసులను అందుబాటులో ఉంచారు. వీటి తయారీలో బంగారంతోపాటు టైటానియం కూడా ఉపయోగిస్తున్నారు. వాటిపై వజ్రాలు, ఇతర రత్నాలను అమర్చి మరిన్ని వన్నెలు అద్దుతున్నారు. టైటాన్ నగలో మొత్తం 19 ముక్కలు ఉంటే.. వాటిలో ఏడింటిని టైటానియంతో చేయగా, మిగిలిన వాటిని ఎల్లో గోల్డ్‌తో తయారు చేశారు.
బ్లాక్ టైటానియంతో రూపుదిద్దుకున్న గొలుసులు, కర్ణాభరణాలు రిచ్ లుక్‌లో దర్శమిస్తున్నాయి. వజ్రాలు, రాళ్లు పొదిగినవి రూపొందినవి కూడా ఆధునిక మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోడ్రన్ దుస్తుల మీదకి ఈ జువెలరీ చక్కగా నప్పుతుంది. అంతేకాదు వీటిని పురుషులు కూడా ధరించవచ్చు. ఈ వెరైటీ ఆభరణాలను టిఫనీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.