గ్రామీణ మహిళల్లో ఉండే అవగాహన లేమి.. గర్భాశయానికి గండంగా మారుతున్నది. శస్త్రచికిత్సతో గర్భాశయాన్ని తొలగించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా దాదాపు ఐదుశాతం మంది మహిళలు.. రకరకాల కారణాలతో తమ గర్భాశయాన్ని తొలగించుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అవగాహన లేమి, నిరక్షరాస్యతతోపాటు దవాఖానల ధనదాహం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.
ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు.. కుటుంబ ఆరోగ్య సర్వేలో నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో 25 నుంచి 49 ఏండ్ల మధ్య వయసు గల 4.5 లక్షల మంది మహిళలను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం.. 25 – 49 ఏండ్ల వయసుగల ప్రతి 100 మంది భారతీయ మహిళల్లో ఐదుగురు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్నారని తేల్చారు. వీరిలో అత్యధికంగా వ్యవసాయరంగంలో పనిచేసే మహిళలే 32 శాతం ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు బీహార్‌లో గర్భాశయ శస్త్రచికిత్స రేట్లు అధికంగా ఉన్నాయని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. ఇందుకుగల కారణాలు వెల్లడిస్తూ.. ‘తక్కువ ఆదాయ వర్గాల్లోనే ఈ గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు అత్యధికంగా జరిగాయి. రుతుక్రమంపై ఉండే అపోహలు, జననేంద్రియ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం లాంటివి.. గ్రామీణ మహిళల్లో గర్భాశయ అనారోగ్య సమస్యలకు మూలకారణంగా తెలుసుకున్నారు. దాంతో.. తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారని అధ్యయనకారులు వెల్లడించారు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బయటపడటం, రుతుస్రావం సమయంలో నొప్పిని నివారించడంతోపాటు ప్రసవం తర్వాత గర్భాశయాన్ని ఉపయోగంలేని అవయవంగా చూడటం కూడా.. వీరిని శస్త్రచికిత్స వైపు మళ్లిస్తున్నది. మరో ముఖ్యవిషయం.. ఈ శస్త్రచికిత్సల్లో మూడింట రెండు వంతులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే జరిగాయట. ఆయా దవాఖానల లాభాపేక్ష కూడా శస్త్రచికిత్సలు పెరగడానికి కారణమని పరిశోధకులు తెలుసుకున్నారు. గ్రామీణ మహిళల్లో లైంగిక-పునరుత్పత్తి వ్యవస్థపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగంలో పనిచేసేవారి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.