పెళ్లి’ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఇదే కారణంతో చాలామంది తమ దగ్గర డబ్బు లేకపోయినా.. లక్షల్లో అప్పు చేసి నలుగురికీ పప్పన్నం పెడుతున్నారు. పెళ్లిని ఘనంగా చేసుకోవడం మంచిదే, కానీ అప్పుల టెన్షన్లతో మనశ్శాంతి కోల్పోవడం మాత్రం సరైంది కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఇటీవలి సర్వే ప్రకారం.. మధ్యతరగతి వాళ్లలో ఎక్కువమంది పర్సనల్ లోన్ తీసుకుని మరీ పెళ్లిళ్లను ఆర్భాటంగా చేసుకుంటున్నట్లు తేలింది. వీరిలో చాలామంది నెలనెలా ఈఎంఐలు కట్టడానికి సతమతమవుతున్నారట.
మరికొందరైతే ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు మొత్తాన్ని కూడా రెండు రోజుల పెళ్లి కోసం ఖర్చు చేసేస్తున్నారట. ఈ క్రమంలో పెళ్లిళ్లను మినిమలిస్టిక్‌గా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చో ముందుగానే ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు.
అలంకరణ: సాధారణంగా మినిమలిస్టిక్ వెడ్డింగ్‌లో అలంకరణలు చాలా తక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్ పూలు, భారీ లైట్లు కాకుండా.. మామూలు పువ్వులు, మొక్కలతో అలంకరణ చేయొచ్చు. పెళ్లి మంటపం నుంచి ఇంటి దగ్గర డెకరేషన్ వరకు అన్నిట్లోనూ మినిమలిస్టిక్‌గా ఆలోచించాలి.
అతిథుల సంఖ్య: మన బడ్జెట్‌ని బట్టి చాలా ముఖ్యం అనుకున్న వాళ్లను ఆహ్వానిస్తే సరిపోతుంది. దానివల్ల ఫంక్షన్ హాల్ నుంచి భోజనాల వరకు అన్నిట్లోనూ ఖర్చు తగ్గుతుంది. తక్కువైనా భోజనాల్లో రుచికరమైన వంటకాలను పెట్టుకోవచ్చు.
దుస్తులు: సోషల్ మీడియా పెరగడంతో చాలామంది ఫ్యాషన్ ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నారు. దాంతో సెలెబ్రిటీ మాడల్ బ్రైడల్ డ్రెస్సులు అంటూ లక్షలు ఖర్చుపెడుతున్నారు. అలాకాకుండా కుటుంబ ఆచారాన్ని బట్టి దుస్తులను ఎంచుకుంటే చాలావరకు ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా, కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి కొనుక్కున్న దుస్తులతో అందంగా ముస్తాబవ్వొచ్చు. ఇలా మినిమలిస్టిక్‌గా ఆలోచిస్తూ తక్కువ ఖర్చులో ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చు. దానివల్ల అప్పులు ఉండవు కాబట్టి కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు.