మూడేళ్ల వయసులో డయాలసిస్.. ఏడేళ్ల వయసులో కిడ్నీ మార్పిడి…ఇరవై ఏళ్లకు మళ్లీ డయాలసిస్… కొన్నాళ్లకు రెండో కిడ్నీ మార్పిడి.. ఇదీ ఆమె జీవితం. కిడ్నీల మార్పిడి జరిగినా పర్వతాలెక్కింది. మంచు నదులు దాటింది. ఆమె పట్టుదలకు గిరులు దాసోహం అన్నాయి. ఆ విజయాలే రికార్డులుగా నమోదయ్యాయి. దక్షిణ ధ్రువానికి చేరి కొత్త చరిత్ర సృష్టించడమే కాదు.. పట్టుదలతో వైకల్యాన్ని అధిగమించ వచ్చని, ప్రతికూలమైన చోటా రాణించవచ్చని నిరూపించింది. అంటార్కిటికా యాత్రలో దక్షిణ ధ్రువ సమీపానికి చేరుకొని, రేపటి విజయాలకు బాటలేసుకున్న స్నేహా భూపతి రాజు జిందగీతో పంచుకున్న ఆత్మవిశ్వాస యాత్ర ఆమె మాటల్లోనే..
మూడేళ్ల వయసున్నప్పుడు నాకు ఫ్లూ వచ్చింది. ఇన్ఫెక్షన్ల వల్ల కిడ్నీ పాడైంది. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకున్నాను. ఏడేండ్ల వయసులో కిడ్నీ మార్పిడి చేశారు. దాంతో నా బాల్యంలో సింహభాగం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పట్లో నర్సులు, డాక్టర్లే నా ఫ్రెండ్స్. అనారోగ్యం, ఆపరేషన్ వల్ల మూడో తరగతి వరకు స్కూల్‌కి రెగ్యులర్‌గా పోలేదు. ఆరోగ్యం బాగాలేదన్న భయంతో పాపను ఇంటికే పరిమితం చేయొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు. బయటికి తీసుకెళ్లొచ్చని, అయితే చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇన్ఫెక్షన్లు సోకితే మళ్లీ కిడ్నీ సమస్య తిరగబడొచ్చని చెప్పారు. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నాకు, అపురూపంగా పెంచాల్సిన బాధ్యత మా అమ్మానాన్నలకు ఏర్పడింది.
కిడ్నీ మార్పిడి తర్వాత అందరిలా బడికిపోయాను. ఆటలు ఆడేదాన్ని. చక్కగా చదువుకునేదాన్ని. బయటి తిండి తినకుండా జాగ్రత్తగా ఉంటూ సమయానికి మందులు వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. బడిలో అందరితో కలిసి ఆడుకోలేని సందర్భంలో నా స్నేహితులు పదిమందైనా నాతో ఉండేవాళ్లు. నా ఆరోగ్యం గురించి వాళ్లకు తెలుసు. మందులు వేసుకున్నావా అని అడిగేవాళ్లు తప్ప… నా ఆరోగ్యం గురించి అంతకంటే ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. టీచర్లు కూడా నన్ను ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నారు. నా పట్ల జాలి చూపి, వేరుగా చూడలేదు. కాబట్టే ‘నేను వేరు’ అనే భావనే నా మనసులోకి ఎన్నడూ రాలేదు. ఎప్పుడూ కుంగిపోలేదు. అలాంటి స్నేహితులు, మంచి టీచర్లు ఉండటం నా అదృష్టం.
చిన్నప్పటి నుంచి నాకు హాస్పిటల్ లైఫ్ తెలుసు కాబట్టి. డాక్టర్ కావాలనుకున్నాను. కాకపోతే సైన్స్ చదివితే రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. శ్రమ అధికం. అందుకే, ఆరోగ్య రీత్యా సోషల్ సైన్సెస్ చదవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయినా డాక్టర్ కావాలని ఎంబైపీసీలో చేరాను. మెడిసిన్ చదివితే రకరకాల ఇన్ఫెక్షన్ల బాధితులను కలవాల్సి వస్తుంది. కాబట్టి నా ఆరోగ్య పరిస్థితికి అది అనువైనది కాదనుకుని ఇంటర్ తర్వాత బీబీఎం కోర్సులో చేరాను.
హైదరాబాద్‌లో చదువుకునే అమ్మాయిలందరిలానే నేనూ పెరిగాను. పర్వతారోహణ, సాహస యాత్రల గురించి పెద్దగా అవగాహన లేదు. బీబీఎం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజ్ నుంచి మనాలి టూర్‌కు వెళ్లాం. మా ఫ్రెండ్స్, అక్కడికి వచ్చిన టూరిస్టులు గుర్రాలు, ఒంటెలు ఎక్కుతున్నారు. నా కాళ్ల మీద నేను నిలబడగలిగినప్పుడు, శారీరక వైకల్యం లేనప్పుడు జంతువులు ఎక్కి వెళ్లాల్సిన అవరసం ఏముంది అనిపించింది. ఫొటోలు దిగడం కోసం, ఆనందం కోసం ఆ గుర్రాలు, ఒంటెలు ఎక్కడానికి మనసు రాలేదు. కాళ్లూ చేతులు బాగుండి వాటికి భారం కావొద్దనుకుని కొండ దారిలో నడవడం మొదలుపెట్టాను. నాతోపాటు గైడ్ కూడా నడుస్తూ వచ్చారు. ‘ఈ వాతావరణం, ఇంతెత్తు దారిలో నడవడం తేలిక కాదు. మీరు చాలా బాగా నడుస్తున్నారు. మీరు ఎత్తయిన పర్వతాలు ఎక్కగలరు. మన దేశంలో సాహస యాత్రలు చేయదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా ప్రయత్నించండి’ అని గైడ్ చెప్పారు. ఈ వాతావరణం నాకు బాగా సరిపోయినట్లుందని ఆ రోజే అనుకున్నాను. అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎత్తయిన ప్రదేశాల్లో నడవాలనే ఆశ అప్పుడే చిగురించింది.

డాక్టర్లు ఇంతకుముందు చెప్పినట్టుగానే కిడ్నీ సమస్య తిరగబడింది. డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. చివరికి రెండో కిడ్నీ కూడా మార్పిడి చేశారు. ఆపరేషన్ తర్వాత రెండేళ్లకు కోలుకున్నాను. హిమాలయాలకు వెళ్లాలనుకున్నాను. నా ఆరోగ్య సమస్యలు, ఆసక్తులు వాళ్లకు తెలుసు. అక్కడ నేను తీసుకునే జాగ్రత్తలు, అక్కడ ఉండే సపోర్ట్ గురించి మావాళ్లకు చెప్పి ఒప్పించాను. మొదట్లో ఒకరోజు, రెండు రోజుల సాహస యాత్రలు చేశాను. ఒకసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి పోయాను. అక్కడి నుంచి మంచు ఎడారిలో ట్రెక్కింగ్ ఉంది. మా ప్రయాణం పది రోజులు సాగింది. ఇంకొక్క రోజులో లక్ష్యాన్ని చేరుకుంటామనగా నా ఆరోగ్యం సహకరించలేదు. మంచులో తడవడం వల్ల జలుబు చేసింది. ముక్కులు పూడుకుపోయి ఊపిరి తీసుకోలేకపోయాను. వెంటనే రెస్క్యూ హెలికాప్టర్ రప్పించి నన్ను అక్కడి నుంచి తీసుకువచ్చారు.
ఎత్తయిన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ వాతావరణాన్ని తట్టుకునేందుకు తప్పనిసరిగా మందులు వేసుకోవాల్సిందే. కానీ, అత్యంత ప్రభావం చూపే మందులు నేను వేసుకోకూడదు. కాబట్టి ఆ మందు వేసుకోకుండానే హిమాలయాల్లో పది రోజులు ప్రయాణం చేశాను. నాకు ఊపిరాడని స్థితి ఎదురుకాలేదు. ఆ బృందంలో చాలామంది ఆ ప్రతికూల వాతావరణంలో ఇబ్బందిపడ్డారు. కానీ, నాకు ఏ ఇబ్బంది అనిపించలేదు. పర్వాతాలు నన్ను అంగీకరించాయని నాకు ఆ రోజే తెలిసొచ్చింది. యోగా, మెడిటేషన్, బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేసేవాళ్లు మెడిసిన్ తీసుకున్నా ఇబ్బంది పడ్డారు. నేను ఎన్నిసార్లు ఎత్తయిన ప్రాంతాలు, పర్వతాలపైకి వెళ్లినా ఏ సమస్యా రాలేదు. సాహస యాత్రలు ఆగలేదు. ఆ చల్లని వాతావరణం నాకు చాలా ఇష్టం. సాహస యాత్ర చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతుంటాను.
ఓసారి చాదర్ ట్రెక్కి పోయాను. హిమగిరుల చెంతనున్న లద్దాక్‌లో ప్రవహించే నది శీతాకాలం గడ్డకడుతుంది. గడ్డకట్టిన నదిపై దాదాపు డబ్బు కిలోమీటర్లు నడిచాను. ఈ యాత్రతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకుని లేహ్‌లో ట్రెక్ చేసిన వ్యక్తిగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి నా పేరు ఎక్కింది. అంతేకాదు వసుంధర రాఘవన్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వాళ్ల విజయాల గురించి రాసిన ‘ద కిడ్నీ వారియర్స్’ రెండో ఎడిషన్‌లో నా విజయాలను పరిచయం చేశారు.
అంటార్కిటికా సాహసయాత్రకు వెళ్తున్న ఒక బృందం పరిచయమైంది. ఆ బృందంలో నన్నూ చేర్చుకున్నారు. గత డిసెంబరులో అంటార్కిటికా సాహస యాత్రకు వెళ్లాం. అక్కడికి వెళ్లే చాలామంది కొద్ది దూరానికే వెనక్కి వచ్చేస్తారు. మా బృందం పూర్తిగా మంచుతో ఉండే దక్షిణ ధ్రువానికి సమీపంగా ఉండే అంటార్కిటిక్ సర్కిల్ సరిహద్దుని దాటి కొంత లోపలికి పోయాం. వేసవి కాలం కాబట్టి మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ప్రత్యేకమైన పడవలో దక్షిణ అమెరికాలోని ఉషోయ నుంచి బయలుదేరాం. మంచు శకలాలు తేలియాడే నదిలో మా ప్రయాణం ముందుకు సాగింది. అంటార్కిటికాలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్యంబారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నందున ఆ షరతుల మధ్య ముందుకు వెళ్లాం. ఆ ప్రకారం నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లి, అక్కడి నుంచి వెనక్కి వచ్చి పడవలోనే నిద్రించేవాళ్లం. అత్యంత చల్లని వాతావరణంలో గడిపిన అనుభవం ఉన్నవాళ్లను ఒకటి, రెండు రోజులు అంటార్కిటికా ఖండంపై క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఉండేందుకు అనుమతిస్తారు. ఆ అవకాశం నాకూ వచ్చింది. అంటార్కిటికా నేలపై ఓ రాత్రి నిద్రించాను. ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకుని అంటార్కిటికా చేరిన మొదటి వ్యక్తిగా ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన తర్వాత నాలాంటి వాళ్లు చాలామంది అభినందించారు. స్నేహితులు, బంధువులు సంతోషించారు. ఇకముందూ ఇంతే సంతోషంగా సాహసయాత్రలు చేయాలన్నది నా కోరిక. ఈ సాహస యాత్రలే నా జీవితం!