ఒత్తిడి నుంచి బయటపడేసే దివ్యౌషధం తేనీరు. కానీ, కొందరు మాత్రం టీ కప్పును చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. ఈ వైఖరినే టెపిడోఫోబియా అని నిర్ధారించారు పాశ్చాత్య ధన్వంతరులు. ప్రతి వందమందిలో తొమ్మిది మంది ఈ తరహా బాధితులే అని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఉష్ణోదకం అందుకోవడానికి గడగడ వణికిపోతుంటారు. ఏ కొట్టుకు వెళ్లినా టీ వడకట్టి ఇవ్వమని బెట్టు చేస్తుంటారు. టీ తాగడానికి అంతలా ఇదైపోవడం ఏమిటో? అని వారి ఆవేదనను తేలిగ్గా తీసుకోకండి. అసలు విషయం తెలిస్తే.. వారి మనోభావాలను మనమూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటాం! పాలతో అచ్చికలాడిన తేనీరంటే ఎంత ఇష్టపడతారో, అదికాస్తా అట్టుకడితే అంతలా అట్టుడికిపోతారు టెపిడోఫోబియా బాధితులు. కప్పులో అట్టును ఓ పక్క పట్టుకునేటట్టు నెట్టి టీ వేళను నెట్టుకువస్తారు.
గోటితో మీగడను అమాంతం ఎత్తి ఏ గోడకో విసిరికొడతారు. ఇలా తెలివిగా మేనేజ్ చేసి బతుకు జీవుడా అనుకుంటారు! అసలు సమస్యంతా కప్పు అంతా మీగడ తరకలు తేలుతుంటేనే! జిహ్వను అతుక్కునే మీగడను మింగలేక, కక్కలేక ఇదైపోతుంటారు పాపం. ఆ క్షణంలో ‘ఈ ఏకాక్షరి తాగితే ఏ కాంక్ష అయినా నెరవేరుస్తామ’ని దేవదూతలు దిగివచ్చి చెప్పినా సాహసానికి ఒడిగట్టరు. కారణం టెపిడోఫోబియా! కొందరి విషయంలో వాళ్లు కాచి ఇచ్చే టీ కోసం ముఖం వాచేలా ఎదురుచూసే తేనీటిప్రియులు.. మరికొందరి విషయంలో ఎక్కడ టీకి ఆహ్వానిస్తారో అని ముఖం చాటేస్తుంటారు. గ్రహచారం బాగోలేక వారి పాలబడి బలవంతంగా తేనీరు అందుకోవాల్సి వస్తే.. రంగు, రుచి లేకపోవడంతోపాటు మచ్చుకైనా వేడిలేక, పచ్చిపాల వాసనతో భయపెట్టే టీని తెలివిగా నేలపాలో, మొక్కలపాలో చేసి ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుంటారు. ఏమంటారు?
కావాల్సినవి:
పాలు: ముప్పావు కప్పు, నీళ్లు: అరకప్పు, టీ పొడి: ఒక టీస్పూన్, ఇలాచీ: ఒకటి, చక్కెర: 1/2 టేబుల్ స్పూన్
ముందుగా గిన్నెలో పాలు, నీళ్లు పోసి టీ పొడి వేసి చిన్నమంటపై మరగనివ్వాలి. ఇలాచీ దంచి వేసి కాసేపు మరగనివ్వాలి. టీ పొడి అంతా పక్క గోడలకు పట్టుకునేలా మరిగిన తర్వాత.. దాన్ని చక్కెర వేసుకున్న గ్లాసులోకి వడకట్టుకొని కలుపుకొంటే పర్ఫెక్ట్ ఇలాచీ టీ రెడీ!
టీ-టైమ్ కన్నా ముందుగానే ఎక్కడ ఈ సృష్టి ముగిసిపోతుందో అని నేను భయపడుతుంటా!
పోస్టు ద్వారా
బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం,
రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
ఈ-మెయిల్ : sunmag@ntnews.com
-సిడ్నీ స్మిత్, ఆంగ్ల రచయిత