ఓ రెండేండ్ల చిన్నారి ఇంట్లో వయ్యారంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే తల్లి మురిసిపోయింది. అదే చిన్నది పదహారేండ్ల వయసులో ఆత్మవిశ్వాసంతో క్యాట్ వాక్ చేస్తే యూకే ‘క్యా బాత్ హై!’ అన్నది.అందాల కిరీటం పెట్టి హర్షధ్వానాలు చేసింది. ఖండాంతరాలు దాటి అఖండమైన ప్రతిభను చాటుతున్న ఈ సిద్దిపేట బిడ్డ పేరు సుహానీరావు బోయిన్పల్లి. ‘మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్’ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి దక్షిణ ఆసియా అమ్మాయిగా రికార్డు సాధించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న పాతిక మంది యువతులను తోసి ‘రాణి’ అనిపించుకుంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్న ‘గెలాక్సీ ఇంటర్నేషనల్’ పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజిక్కించుకున్న సుహానీని ‘జిందగీ’ పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే…
అమ్మ కండ్లలో మురిపెం. నాన్న మాటల్లో విశ్వాసం. ఈ రెండూ చూస్తూ, వింటూ పెరిగిన సిద్దిపేట సివంగిని నేను. బెజ్జంకి మండలం తోటపల్లి మా సొంతూరు. అమ్మ, నాన్న.. ఇద్దరిలో ఎవరు దగ్గర చనువంటే.. అమ్మ దగ్గరే అంటాను. అమ్మకూచినన్నమాట! నాలో కళాభిరుచికి స్ఫూర్తి అమ్మే. ఆమెకు కళలంటే ప్రాణం. తన ఆశలను నాకు రెక్కలుగా తొడిగి ఆశయ సాధనకు పురిగొల్పింది.
అమ్మ ముద్దు, నాన్న మద్దతు కలిసి నా ప్రయాణం మొదలుపెట్టాను. నాన్న ఒకే ఒక్క షరతుపెట్టారు. ‘నువ్వు కన్న కలలు నిజం చేసుకో. కోరుకున్న కళల్లో పరిణతి సాధించు. కానీ, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకు. నువ్వు ఏ రంగంలో ఎదగాలనుకున్నా మా సపోర్ట్ ఉంటుంది’ అన్నారు. ఆయన మాట ప్రకారమే చదువులో రాణిస్తూనే.. నా ప్రత్యేకతలు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను.
టీవీ ప్రభావం
చిన్నప్పటి నుంచీ నాపై అమ్మ ప్రభావమే ఎక్కువ. అమ్మకు శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం. చిన్నప్పుడు బాగా నేర్చుకోవాలని ఉండేదట. ఆ మాటే ఇంట్లో చెబితే వద్దన్నారట. ఆ అసంతృప్తి ఇప్పటికీ అమ్మ ముఖంలో కనిపిస్తుంటుంది. అందుకే నన్ను భరతనాట్యం నేర్చుకోమని సలహా ఇచ్చింది. నాకు నాట్యం నేర్చుకోవాలని సరదా! అమ్మ మాటా అదే అయింది. అలా శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను.
టీవీలో టాలెంట్ షో, అందాల పోటీల కార్యక్రమాలు చిన్నప్పుడు అమ్మ బాగా చూసేదట. నా చిన్నప్పుడు అవి నేను బాగా చూసేదాన్నట. అప్పుడు నాకు రెండున్నరేండ్లు ఉంటాయేమో! హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. టీవీలో ఓ ఫ్యాషన్ షో చూసి.. నేనూ అలాగే పోజులు ఇచ్చానట. నా ఉత్సాహం చూసి అమ్మ తెగ సంబరపడేదట. పెద్దయ్యాక నేను ఫొటోలకు పోజిస్తుంటే.. ‘నీ మీద టీవీ ప్రోగ్రామ్స్ ప్రభావం బాగానే పడిందే!’ అని ఆటపట్టిస్తుంటుంది.
నటనపై ఆసక్తి
ఇంతకూ మా అమ్మానాన్నల పేర్లు చెప్పలేదు కదూ! అమ్మ పేరు సరిత. నాన్న ప్రమోద్‌రావు. 14 ఏండ్ల కిందట యూకే వచ్చాం. బకింగ్షైర్లో ఉంటున్నాం. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ గృహిణి. ప్రస్తుతం నేను ఇయర్-11 చదువుతున్నా. డిజైన్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అంటే ఇష్టం. విదేశంలో ఉంటున్నా.. మన కళలు, సంప్రదాయాలు అంటే చాలా ఆసక్తి. ఆ ఇష్టంతోనే భరతనాట్యంలో డిప్లొమా చేశాను.
డ్యాన్స్ టీచర్ అయితే కళాసేవ మరింత చేయొచ్చనే ఉద్దేశంతో పోస్ట్ డిప్లొమా చేస్తున్నాను. ఇక్కడ పలు నాట్య ప్రదర్శనలూ ఇచ్చాను. ‘నాట్యకళా జ్యోతి’ అన్న బిరుదును అందుకోవడం గౌరవంగా ఉంది. నాట్యంతోపాటు నటన అన్నా ఆసక్తే! చర్చల్లో పాల్గొనడం అంటే మహా సరదా! వీకెండ్స్‌లో ఏమైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా వెళ్తుంటాను. ఖాళీ దొరికితే పుస్తకాలే ప్రపంచం. ఇప్పటివరకు నేను చదివిన వాటిలో జేన్ ఆస్టిన్ రాసిన ‘ప్రైడ్ అండ్ ప్రిజుడిస్’ నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులో ‘లా’ చదవాలని ఉంది.
అందాల ప్రదర్శన కాదు
ఓ వైపు చదువు, మరోవైపు కళలు ఇలా ఉన్న నా ప్రపంచంలోకి అందాల పోటీలు అనుకోని ఆహ్వానం పంపాయి. నాకూ ఇష్టమే కాబట్టి పాల్గొన్నా. అయితే, అందాల పోటీలు అనగానే చాలామందికి ఒకరకమైన అభిప్రాయం ఉంది. అందాల ప్రదర్శనగానే దాన్ని చూస్తారు. ఇదనే కాదు, ఏ రంగంలో అయినా ఆడవాళ్ల పట్ల సమాజం ప్రతికూలంగా ఆలోచిస్తుంటుంది. ఈ కారణంగా చాలామంది ప్రతిభావంతులైన మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు.
బయటికి వచ్చినవాళ్లూ తాము అనుకున్న రంగంలో ఎదగలేకపోతున్నారు. ఏ పోటీలో అయినా గెలవాలంటే ప్రతిభే ప్రధానం. నేను పాల్గొన్న మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్నే తీసుకుందాం.. ఇక్కడ శారీరక సౌందర్యం పోటీలో ఓ భాగం మాత్రమే! అందం, ఆహార్యం, తెలివితేటలు అన్నీ పరిశీలించిన తర్వాతే విజేతగా ప్రకటించారు. అయితే, ఎవరో ఏదో అనుకుంటారనీ, ఎవరూ గుర్తించడం లేదనీ పరుగు ఆపడం సరికాదు. వచ్చిన అవకాశాన్ని అందుకొని ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుంది.
చాన్స్ వస్తే సినిమాల్లోకి
అందంగా కనిపించడానికి ప్రత్యేకంగా కసరత్తులేం చేయను. డ్యాన్స్‌ను మించిన వ్యాయామం ఏముంటుంది? సైక్లింగ్, ట్రెడ్‌మిల్‌తో దోస్తీ ఉండనే ఉంది. అవి కూడా అరగంటకు మించి చేయను. సినిమాలు బాగా చూస్తాను. తెలుగులో నాని యాక్టింగ్ అంటే చాలా నచ్చుతుంది. హీరోయిన్ సమంత అంటే ఇష్టం.
దర్శకుడు రాజమౌళి సూపర్బ్! భవిష్యత్తులో అవకాశం వస్తే సినిమాల్లో నటించాలని ఉంది. ఇప్పటికైతే నా లైఫ్ నేను అనుకున్నట్టుగా సాగిపోతున్నది. సమయం కుదిరినప్పుడల్లా సామాజిక సేవలో పాలుపంచుకుంటాను. బీచ్ క్లీనప్, బయోడీగ్రేడబుల్ ప్యాడ్ డొనేషన్ క్యాంపెయిన్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాను. వాటికి వెళ్లినప్పుడు ఏదో తెలియని తృప్తి కలుగుతుంది.
…?నరేశ్ ఆరుట్ల