మనవాడు ఎవరైనా ఢిల్లీ దాకా ఎదిగితే సంతోషిస్తాం. విదేశీ గడ్డపై చట్టసభలో భాగమైతే గర్వంగా భావిస్తాం. అలాంటి ఉత్సాహాన్నే తను పుట్టిన గడ్డకు అందించారు శనిగరం బిడ్డ ఉదయ్ నాగరాజు. ఉన్నత చదవుల కోసం బ్రిటన్ బాట పట్టిన నాగరాజు.. అక్కడ అంచెలంచెలుగా ఎదిగి ప్రజాప్రతినిధిగా ఎదిగారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికై తెలంగాణ సత్తా చాటారు. శనిగరం గ్రామ ప్రజల ఆప్యాయతే తన ఎదుగుదలకు కారణం అంటున్నారు. తనకు వచ్చిన అవకాశాన్నిభారత్- బ్రిటన్ సంబంధాల బలోపేతానికి ఉపయోగిస్తానని చెబుతున్నారు. ఇటీవల సిద్దిపేటకు వచ్చిన ఉదయ్ నాగరాజుతో జిందగీ ప్రత్యేక ఇంటర్వ్యూ.
జిందగీ: మీ యూకే ప్రయాణం ఎలా ప్రారంభమైంది?
ఉదయ్ నాగరాజు: 2001లో తొలిసారి యూకే వెళ్లాను. అప్పటికి భారత్ ఇప్పటి స్థాయిలో లేదు. మా నాన్న తీసుకున్న రుణంతో యూకే వెళ్లి అకడ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ చదువుకున్నాను. సెలవుల్లో రోజుకు 17- 18 గంటల వరకు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి చదువు పూర్తి చేసి ఐటీ రంగంలో ఉద్యోగం పొందాను. భారత్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనూ నాకు ఆర్థికంగా సహాయం చేసిన పెద్దలు ఉన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సింగపూర్ రాజేశ్వరరావు వంటి పెద్దలు అందించిన సహకారం నా జీవితంలో ఎంతో కీలకం. వారి ప్రోత్సాహం నాపై గొప్ప ప్రభావం చూపింది.
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ప్రత్యక్ష రాజకీయాలను గమనించడంతో పాటు పుస్తకాల ద్వారా కూడా రాజకీయాలను అధ్యయనం చేశాను. యూకేలో ఉన్న సమయంలో భారతీయ మూలాలున్న వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాను. భారతీయ మూలాలున్న వాళ్లు కౌన్సిలర్లు, ఎంపీలు, రాజకీయ సలహాదారులుగా ఎందుకు ఎదగకూడదనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ క్రమంలో నా పనిని గుర్తించిన పార్టీ, ప్రధాన కార్యాలయంలో సలహాదారుగా పనిచేసే అవకాశం కల్పించింది.
మీ స్వగ్రామం, బాల్యం గురించి మాతో పంచుకుంటారా?
మా సొంతూరు శనిగరం. ఇది ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఉంది. నేను వరంగల్‌లో పుట్టాను. నా ప్రాథమిక విద్యను వరంగల్‌లో అభ్యసించాను. తర్వాత హైదరాబాద్‌లో సెకండరీ విద్యను కొనసాగించాను. నా మూలాలు మాత్రం ఎప్పటికీ శనిగరం గ్రామంతోనే ఉంటాయి. నా అస్తిత్వం ఈ ఊరితోనే ముడిపడి ఉంటుంది. ఇటీవల గ్రామానికి వెళ్లి అకడి ప్రజలను, చిన్ననాటి మిత్రులను కలుసుకున్నప్పుడు ఎంతో ఆనందం వేసింది. చిన్నప్పటి బతుకమ్మ పండుగ జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి.
మీరు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కావడం ఎలా సాధ్యమైంది..?
బ్రిటిష్ పార్లమెంట్ విషయానికి వస్తే.. అకడ ఎగువ సభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. ఇది మన దేశంలోని రాజ్యసభకు సమానమైన సభ. గత డిసెంబర్లో నన్ను హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ చేశారు. అంతకుముందు బ్రిటన్‌లో మన లోక్‌సభకు సమానమైన హౌస్ ఆఫ్ కామన్స్‌కు పోటీ చేశాను. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచాను. అది చాలా కఠినమైన నియోజకవర్గం. అకడ మెజారిటీ కూడా చాలా తకువగా ఉండేది. అయినప్పటికీ ఆ ఫలితాన్ని ఓటమిగా భావించకుండా ముందుకు సాగాను. పార్టీ కోసం చేసిన సేవలు, యూకే-ఇండియా సంబంధాలపై నాకు ఉన్న ఆసక్తి, రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి నేను చేస్తున్న కృషి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నాను.
విద్యారంగంలో భారత్, యూకే పరస్పరం ఏమి నేర్చుకోవచ్చు?
రెండు దేశాల్లోనూ ప్రత్యేకమైన బలాలు ఉన్నాయి. రెండు దేశాల్లోని ఉత్తమ అంశాలను కలిపి కొత్త విధానాలను రూపొందించాలి. ముఖ్యంగా రీసెర్చ్, సిల్స్, ఇన్నోవేషన్, విద్య, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచాలి. యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యాలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారం, విద్యార్థులు-యువతకు అవకాశాలు లాంటి అంశాల్లో భారత్, యూకే కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
చాలామంది యువత విదేశాలకు వెళ్లడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు కదా! దీనిని ఎలా చూడాలంటారు?
అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. మన యువతలో ప్రతిభ, యాంబిషన్, సిల్స్ ఉన్నాయి. అయితే ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరగాలి. ఇకడి యువతలో ప్రతిభ ఉంది కాబట్టి వారు విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ, మన యువత కేవలం ఇతర దేశాలకు వెళ్లి అకడి అవకాశాలను మాత్రమే ఉపయోగించుకునే పరిస్థితి ఉండకూడదు. మన యువత సామర్థ్యాన్ని మనదేశంలోనే ఉపయోగించుకునే విధంగా అవకాశాలు, నైపుణ్యాలు, పరిశోధన, స్టార్టప్‌లు, పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. మన యువతను కేవలం ఇతర దేశాలకు వెళ్లే మానవ వనరుగా కాకుండా.. ప్రపంచ సమస్యలకు పరిషారాలు చూపగల శక్తిగా తీర్చిదిద్దాలి.
నేటి ఏఐ యుగంలో ప్రజాప్రతినిధులు ఎలా సన్నద్ధం కావాలి?
ప్రపంచం చాలా వేగంగా మారుతున్నది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నది. ఏఐని కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. కానీ, అందరికీ కనీస ప్రాథమిక అవగాహన ఉండటం చాలా అవసరం. 193 దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ సెక్రటరీ జనరల్‌తో నేను చర్చించినప్పుడు ఒక సూచన చేశాను. ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పించే కార్యక్రమం ఉంటే చాలా బాగుంటుందని చెప్పాను. ఏఐని మంచిగా ఎలా ఉపయోగించుకోవాలి..? దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటి..? ఆ సమస్యలను ఎలా పరిషరించాలి…? దానికి ఎలాంటి నియంత్రణ, విధానాలు అవసరం? అనే అంశాలపై ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలి. ఏఐపై అవగాహన లేకపోతే దానికి సంబంధించిన చట్టాలను ఎలా రూపొందిస్తారు? వాటిని ఎలా గవర్న్ చేస్తారు? అందుకే ప్రజాప్రతినిధులకు ప్రాథమిక అవగాహన చాలా కీలకం.
మీ సిద్దిపేట ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
సిద్దిపేట నేల నాకు ఎన్నో విలువలు నేర్పింది. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు, గ్రామ ప్రజల ఆప్యాయత, నాకు సహకరించిన పెద్దల ప్రోత్సాహం నా ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి. నేను చిన్నప్పుడు చూసిన సిద్దిపేటకు, ఇప్పుడు చూస్తున్న సిద్దిపేటకు చాలా తేడా ఉంది. అప్పట్లో గ్రామాలకు రవాణా సౌకర్యాలు కూడా పరిమితంగా ఉండేవి. కరీంనగర్ నుంచి వచ్చే బస్సు దొరికితే గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సిద్దిపేటలో కనిపిస్తున్న అభివృద్ధి, మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట జిల్లా బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి నావంతు కృషి చేస్తాను. తెలంగాణ, భారతదేశానికి ఉపయోగపడే విధంగా నా ప్రయాణం సాగుతుందని విశ్వసిస్తున్నాను.
భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం అత్యంత సానుకూల దశలో ఉన్నాయి. గతేడాది ఇరుదేశాల ప్రధానమంత్రులు కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న 20 మందిలో నేను కూడా ఉన్నాను. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో నాకు ఇంకా 30- 40 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది. ఈ కాలాన్ని భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నాను. భారత్-యూకే సంబంధాలు కేవలం రెండు దేశాల ప్రయోజనాలకే పరిమితం కాకుండా ప్రపంచ సమస్యల పరిషారానికి కూడా ఉపయోగపడాలి.
– కత్తుల శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట