ఉద్యోగుల కెరీర్లో ప్రతిభ, ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి ఇవి కీలకంగా మారుతాయి. బాడీ లాంగ్వేజ్, మాటల్లో పదాల ఎంపిక, సమయ పాలన లాంటి సాధారణ విషయాలే.. అసాధారణ ప్రభావం చూపుతాయి. యాజమాన్యంతో సత్సంబంధాలను మెరుగుపరుస్తాయి. తోటి ఉద్యోగుల్లో మీపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మరి, పదిమందిలో మీరే ప్రత్యేకంగా ఉండాలంటే.. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సలహాలు పాటించాల్సిందే!
నిశ్శబ్దం చాలా శక్తిమంతమైన ఆయుధం. ఉన్నత స్థాయి సమావేశాలు, వాడివేడి చర్చల్లో.. ఈ ఆయుధాన్ని చాకచక్యంగా ఉపయోగించండి. ఏదైనా ఒక విషయంపై చర్చించిన తర్వాత, కఠినమైన ప్రశ్నలు అడిగిన తర్వాత.. కాసేపు మాట్లాడకండి. మీ కొలీగ్స్ సమాధానం కోసం వేచి ఉండండి. దీనివల్ల అవతలి వ్యక్తినుంచి మంచి స్పందన వస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువ విషయాల్నే రాబడుతుంది.
ఎదుటివారి శరీర భాషను అనుకరించడం ఓ కళ. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచడానికి ఇదో సహజసిద్ధమైన మార్గం. ఎందుకంటే.. తమలాగా ఉండేవారినే ఎక్కువమంది ఇష్టపడతారు. వారి హావభావాలు, భంగిమలు, స్వరాన్ని కాపీ చేయడం వల్ల.. వారు మీతో మరింత ప్రశాంతంగా మెలుగుతారు.
మీరు నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారా? అయితే, కింది ఉద్యోగులకు ఆదేశాలకు బదులుగా చాయిస్‌లు ఇవ్వండి. తామేం చేయాలో ఎదుటివారు చెప్పడాన్ని.. చాలామంది ఇష్టపడరు. తమను ఎవరూ నియంత్రించ కూడదనే భావనలో ఉంటారు. అందుకే.. ‘ఈ పని ఇప్పుడే చేయండి’ అని ఆదేశించే బదులుగా.. ‘మీరు దీన్ని ఈరోజే చేస్తారా? రేపు పూర్తి చేస్తారా?’ అని అడగండి. అప్పుడు వారిలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. మీరు కోరుకున్న ఫలితం తప్పకుండా వస్తుంది.
సంభాషణలో ఉన్న వ్యక్తిని పేరుతో సంబోధించండి. ఎవరి పేరు వారికి ఇష్టంగా అనిపిస్తుంది. కాబట్టి, సంభాషణలో వ్యక్తుల పేర్లను ఉపయోగించడం వల్ల.. వారి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇది మీ కమ్యూనికేషన్‌ను మరింత వ్యక్తిగతంగా మారుస్తుంది. మీరు వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఎదుటివారికి అనిపిస్తుంది. దాంతో, వారు సానుకూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.