Rezo.AI | కాల్‌సెంటర్ నిర్వహణ కత్తిమీద సాము. తేడావస్తే.. కస్టమర్లను సంతృప్తి పరచలేం. క్లయింట్ కంపెనీలనూ సంతోషపెట్టలేం. ఈ సమస్యకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌లో పరిష్కారం కనిపెట్టింది రాశి గుప్తా. తను ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేసింది. బయోమెట్రీలో పీహెచ్డీ అందుకుంది. కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసినా, ఆ తర్వాత కార్పొరేట్ కొలువు వెలగబెట్టినా పెద్దగా సంతృప్తినివ్వలేదు. దీంతో స్టార్టప్ వైపు అడుగులు వేసింది.
‘రేజో.ఏఐ’ పేరుతో కాల్‌సెంటర్ నిర్వహణకు కృత్రిమ మేధను జోడించింది. కాలర్ ఏ భాషలో మాట్లాడుతున్నారన్నది కనిపెట్టి, అదే భాషలో స్పందించే సాంకేతికతను రూపొందించింది. ఏ ఐదో పదో ప్రశ్నలకు ముందస్తుగా రికార్డు చేసిన సమాధానాలు ఇస్తుంటాయి కాల్‌సెంటర్ రోబోలు. కానీ రాశి గుప్తా దాదాపుగా మనుషులతో సమానంగా సంభాషించగల సాంకేతికతను సిద్ధం చేసింది. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఓ చోటుకు తీసుకొచ్చి.. లోతుగా విశ్లేషించే పనీ రోబోలదే. దీంతో మారుతి సహా అనేకానేక దిగ్గజాలు క్లయింట్‌గా మారాయి. ఆ పనితీరు నచ్చే డెల్హీవరీ, మాడ్యులర్ క్యాపిటల్ తదితర సంస్థలు రేజోలో పెట్టుబడులు పెట్టాయి. ‘మనుషులతో మాట్లాడే రోబోలు చాలానే ఉన్నాయి. నేను పనిచేస్తున్నది మనుషులను అర్థం చేసుకునే రోబోలతో’ అంటున్నది రాశి.