చైత్రం: ఈ నెలలో రేవతి, అశ్విని కార్తెల ప్రవేశం సమయం ఆధారంగా వర్షాభావ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, పశ్చిమ, ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో అనుకూల వర్షాలు కురుస్తాయి. మధ్య భారతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
వైశాఖం: ఈ నెలలో భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు సామాన్య యోగ సమయంలో ప్రవేశిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అక్కడక్కడా వర్షసూచన. కొన్ని ప్రాంతాల్లో గాలివాన కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది.
జ్యేష్ఠం: ఈ నెలలో రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి. గాలి, వడగళ్లతో కూడిన వానలు కురుస్తాయి. మృగశిర కార్తెలో సాధారణ వర్షాలు ఉన్నాయి. ఆరుద్రలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి.
ఆషాఢం: ఈ నెలలో ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు ఉన్నాయి. సాధారణ వర్షపాతం నమోదవుతుంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. మాసాంతంలోనూ వర్షాలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
శ్రావణం: ఈ నెలలో పుష్యమి, ఆశ్లేష, మఖ కార్తెలు ఉన్నాయి. మాసం ప్రారంభంలో మంచి వర్షాలు ఉన్నాయి. మధ్యలో సామాన్య వర్షపాతం నమోదవుతుంది. చివర్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలకు అనుకూల వర్షపాతం నమోదవుతుంది.
భాద్రపదం: ఈ నెలలో మఖ, పుబ్బ కార్తెలు ఉన్నాయి. ప్రవేశ సమయం ఆధారంగా భాద్రపదంలో అనుకూల వర్షాలు ఉంటాయి. అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాసాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.
ఆశ్వయుజం: ఈ నెలలో ఉత్తర, హస్త, చిత్త కార్తెలు ఉన్నాయి. సామాన్య వర్షపాతం నమోదవుతుంది. మధ్య భారతంలో సువృష్టి ఉంటుంది. కమ్ముకొన్న మేఘాలు గాలి తీవ్రత కారణంగా తేలిపోతాయి.
కార్తికం: ఈ నెలలో స్వాతి, విశాఖ కార్తెలు ప్రవేశిస్తున్నాయి. అనుకూల వర్షాలు ఉంటాయి. మాసం చివరిలో తుఫాను ప్రభావంతో ఊహించని వర్షాలు కురుస్తాయి. పంటలకు చేటు చేస్తాయి.
మార్గశిరం: ఈ మాసంలో అనురాధ, జ్యేష్ఠ, మూల కార్తెలు ప్రవేశిస్తున్నాయి. ప్రవేశ సమయంలో సామాన్య యోగాలు ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి, కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి ఉంటుంది. మాసాంతంలో చలి తీవ్రత పెరుగుతుంది.
పుష్యం: ఈ మాసంలో ప్రవేశిస్తున్న కార్తుల ప్రభావం మధ్యమంగా ఉంది. మాసం ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో అననుకూల వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. మాసాంతంలో చలి పెరుగుతుంది.
మాఘం: ఈ మాసంలో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎండ తీవ్రత మొదలవుతుంది.
ఫాల్గుణం: ఈ నెలలో ఎండలు పెరుగుతాయి. ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. మాసం చివరి వరకు ఎండ తీవ్రత పెరుగుతుంది.