అందాలు కోల్పోయి వెలవెలబోతున్న అపూర్వ కట్టడాలకు నగిషీలద్దే ప్రణాళికలు రచించడం ఆమె వృత్తి. ఆ శిథిల భవనాల చరిత్రను గుర్తు చేస్తూ ప్రజల్లో చైతన్యం తేవడం ఆమె ప్రవృత్తి. హైదరాబాద్‌కు శంకుస్థాపన చేసిందెన్నడు? అనడిగితే మహమ్మద్ కులీకుతుబ్‌షాను మాత్రమే కాదు ఆ చరిత్రను అన్వేషిస్తున్న ఆమెనూ గూగుల్ పరిచయం చేస్తుంది. ఆమె పేరు వసంత శోభ. శిశిరంలా శిథిలమవుతున్న వారసత్వ సంపదకు వసంత సంతసాన్ని పంచుతున్న ఆర్కిటెక్ట్‌ను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మా అమ్మ తురగా జానకీ రాణి.. రేడియో జర్నలిస్ట్. రచయిత్రి కూడా. ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసింది. అమ్మను ‘రేడియో అక్కయ్య’ అని పిలిచేవారు. బాలానందం, బాలవినోదం కార్యక్రమాలు నిర్వహించేది. మా నాన్న తురగా కృష్ణమోహన్ రావు కూడా జర్నలిస్ట్.
ఆంధ్రపత్రికలో కాలమిస్ట్, రేడియోకు కరస్పాండెంట్‌గా పని చేసేవారు. చిన్నప్పుడు అమ్మతోపాటు రేడియో కార్యక్రమాల కోసం రేడియో స్టేషన్‌కు వెళ్లేవాళ్లం. నేను, మా అక్క ఉష సంగీతం, నృత్యం నేర్చుకున్నాం. నాటకాలు కూడా వేసేవాళ్లం. మా అమ్మమ్మ చలం మేనకోడలు. సాహిత్య వాతావరణంలో పెరగడం వల్ల మా అమ్మ కూడా రచయిత్రి అయింది. మా అక్కపైనా అదే ప్రభావం ఉంది.
ఒక హీరో చూపిన దారి
స్కూల్లో చదివే రోజుల్లో దూరదర్శన్‌లో ఒక సీరియల్ వచ్చేది. అందులో కథా నాయకుడు ఆర్కిటెక్ట్. జిప్సీలో తిరుగుతూ, పాత కట్టడాల డ్రాయింగ్ వేస్తుండేవాడు. ఓహో ‘ఆర్కిటెక్ట్’ అనే ఉద్యోగి ఒకరు ఉంటారని అప్పుడు తెలిసింది. పెద్దయ్యాక నేనూ ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను.
ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్కిటెక్చర్ తీసుకుంటానని అమ్మతో చెప్పాను. తను కాదనలేదు. బాగా సపోర్ట్ చేసింది. అయితే, మా ఇంట్లో సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటక కళలు ఉన్నాయి. కానీ బొమ్మలు గీయడం ఎప్పుడూ నేర్పలేదు. ఆర్కిటెక్చర్ కోసం బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. ఆర్కిటెక్చర్ అయిదేండ్లు చదివాను. తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (న్యూఢిల్లీ)లో మాస్టర్ డిగ్రీలో చేరాను. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్ స్పెషలైజేషన్ తీసుకున్నాను.
అధికారులు అడ్డుకున్నారు
చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీ, వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్‌కు 2001 నుంచి 2005 వరకు ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్‌గా పనిచేశాను. వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ వాళ్లు దర్బార్ హాల్ పరిరక్షణకు నిధులు ఇస్తామన్నారు. దాని నిబంధనలకు అనుగుణంగా పరిరక్షణ పనులు ఎలా చేపట్టాలో డీపీఆర్ రూపొందించాను. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే పాయిగా టూంబ్స్ డ్రాయింగ్స్ చేశాను.
సిటీలో ఉన్న చిన్న చిన్న భవనాల పరిరక్షణ పనులతోపాటు గోల్కొండ గురించి రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి చేశాం. అప్పుడు గోల్కొండ కోట డ్రాయింగ్స్ తీశాం. ఈ పనులు చేస్తున్నప్పుడే హైదరాబాద్‌ను వరల్డ్ హెరిటేజ్ సిటీ చేయాలనే ప్రతిపాదన చేశాను. నా దగ్గర ఉన్న డ్రాయింగ్స్ అన్నీ చూపి, హైదరాబాద్‌కు ఆ అర్హత ఉందని చెప్పాను. నా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచాలని ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. వారసత్వ కట్టడాలకు అంత ప్రాధాన్యం ఇస్తే ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సమస్యలు వస్తాయని ప్రభుత్వం పట్టించుకోలేదు.
సికింద్రాబాద్ ద్విశతాబ్ది వేడుకలు
బ్రిటిష్ రెసిడెన్సీ కన్జర్వేషన్ పనిలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ నగరం ఏర్పాటుపై నిజాం ఫర్మానా గుర్తించాను. దానిని వెలుగులోకి తెచ్చాను. దాని ఆధారంగా 2006 జూన్ 3న సికింద్రాబాద్‌కు రెండు వందల ఏండ్ల ఉత్సవాలు జరిగాయి. హైదరాబాద్‌లో ఉన్నట్టే లక్నోలో కూడా ఒక బ్రిటిష్ రెసిడెన్సీ ఉంది. లక్నో రెసిడెన్సీ జాతీయ వారసత్వ పరిరక్షిత కట్టడాల జాబితాలో ఉంది.
అదేకాలం నాటి హైదరాబాద్ రెసిడెన్సీ మాత్రం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నేటి హెచ్ఎండీఏ) రక్షిత కట్టడాల జాబితాలో ఉంది. అది కూడా సెకండ్ గ్రేడ్ లిస్ట్‌లో! అంత గొప్ప ప్యాలెస్ పరిరక్షణ పట్ల మన వాళ్లకున్న బాధ్యతేమిటో దీంతోనే తెలిసిపోతుంది. ఈ పరిస్థితి పోవాలని 2006లో హైకోర్టులో కేసు వేశాను. ఆ తర్వాత హైదరాబాద్ రెసిడెన్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిరక్షిత కట్టడాల జాబితాలో చేరింది!
సెకండ్ ఇన్నింగ్స్
ఆర్కిటెక్చరల్ అర్బన్ ప్లానింగ్ స్పెషలైజేషన్‌తో రెండో పీజీ చదివాను. దీని తర్వాత కమ్యూనిటీ ప్రాజెక్టులు చేశాను. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో మాస్టర్ ప్లాన్‌కి నేను హెరిటేజ్ కన్సల్టెంట్‌గా పనిచేశాను. ఒకప్పుడు కేవలం భవనాల పరిరక్షణే చేసేదాన్న. ఇప్పుడు ఒక ప్రాంతంలోని వారసత్వ కట్టడాలను పర్యాటకంగా, సాంస్కృతికంగా ఉపయోగించుకునే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను.
ఆ పరిధిలో ఉన్న వారసత్వ కట్టడాలను పరిశీలించాను. వాటిలో ఏవి హోటళ్లుగా ఉపయోగించుకోవచ్చు, వేటిని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయొచ్చో నివేదిక ఇచ్చాను. నూజివీడు వీణ, కొండపల్లి బొమ్మలు, ఆహారం, కళలను కూడా ఈ అభివృద్ధిలో భాగం చేస్తూ హస్తకళలకు ఉపాధి అవకాశాలు పెంచేలా మాస్టర్ ప్లాన్‌కి కావాల్సిన డీపీఆర్ రూపొందించాను.
కాకతీయుల కోటలో…
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రీజియన్‌లో కూడా ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్‌గా పనిచేశాను. ఆ సందర్భంలో వరంగల్లు, హన్మకొండ, కాజీపేటలోని వారసత్వ కట్టడాలను సర్వే చేశాను. ఓరుగల్లు కోటలో మూడో గోడ గురించి పుస్తకాల్లో ఉంది. ఆ గోడ ఆనవాళ్లను 12 కిలోమీటర్ల మేర గుర్తించాం. అది మాకు గొప్ప డిస్కవరీ. కర్ణాటక ప్రభుత్వం గుల్బర్గా సిటీ డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించమని అడిగింది. అది పూర్తిగా హెరిటేజ్ బేస్డ్ మాస్టర్ ప్లాన్. వారసత్వ కట్టడాలను కాపాడుకుంటూ నగరంలో వసతులు కల్పిస్తూ చేపట్టే అభివృద్ధి గురించి రిపోర్ట్, పాలసీ రూపొందించాం.
అనుభవ పాఠం!
ఈ ప్రయాణంలో అనేక సంస్థల్లో చేరాను. హెరిటేజ్ క్లబ్స్ స్థాపించాను. వాటి సహకారంతో వారసత్వ కట్టడాల పరిరక్షణ పట్ల ప్రభుత్వాలే కాదు ప్రజలూ బాధ్యతగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నాను. ఆర్చిటెక్చర్లో చేరిన రోజుల్లో నాపై సాహిత్యం, కుటుంబ ప్రభావం పెద్దగా లేవని అనుకునేదాన్ని. వారసత్వ కట్టడాల విశ్లేషణ చేయడంలో మిగతా వాళ్ల కంటే వైవిధ్యంగా ఆలోచిస్తాను. వాయిస్ ఆఫ్ హెరిటేజ్ ప్రోగ్రామ్‌లో చాలా తేలిగ్గా మాట్లాడేస్తాను.
ఆర్కిటెక్ట్‌గా బొమ్మలు గీయడం కంటే రాయడం, మాట్లాడటం తేలిక! మిగతా ఆర్చిటెక్చరల్ కన్జర్వేటర్స్ కంటే మెరుగ్గా ఉండటానికి కారణం మా ఇంట్లో వాతావరణమే. ఎదిగే వయసులో చదివిన సాహిత్యం ఏదో ఒక విధంగా మనపై ప్రభావం చూపుతుందని ఇప్పుడు అర్థమైంది. వెనక్కి తిరిగి చూస్తే సాహిత్యం, కళల ప్రభావం నా మీదా ఉందని తెలిసింది! ఏ రంగంలో ఉన్నా మనం చదివినవి, విన్నవి ఎంతోకొంత మనపై ప్రభావం చూపుతాయని అనుభవమైంది.
హైదరాబాద్ బర్త్ డే
అప్పట్లో.. హైదరాబాద్ ఎప్పుడు పుట్టిందనే చర్చ ఆన్లైన్లో జరుగుతున్నది. చాలామంది మహమ్మద్ కులీకుతుబ్‌షా చార్మినార్‌కు శంకుస్థాపన చేసిన తేదీని ఇంగ్లిష్ క్యాలెండర్లో ఏ తేదీన ఉందో చూసి అదే రోజును హైదరాబాద్ పుట్టినరోజుగా పరిగణించాలంటున్నారు. కులీకుతుబ్‌షా చాంద్రమానాన్ని ప్రామాణికం చేసుకుని హైదరాబాద్‌కి శంకుస్థాపన చేశాడు. కాబట్టి అదే క్యాలెండర్‌ని పాటిస్తే సరిపోతుందని, మొహర్రం నెలలో మొదటి రోజున హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఉంది. దానిని అనుసరించి ఏటా అదే రోజున హైదరాబాద్ పుట్టిన రోజు జరపాలని సూచించాను. నా ప్రతిపాదనకు ఎక్కువమంది అంగీకారం చెప్పారు. నేటికీ అదే విధానం కొనసాగుతున్నది. ఈ ఏడాది జూలై 7న హైదరాబాద్ పుట్టిన రోజు జరగనుంది.
…? నాగవర్ధన్ రాయల
గడసంతల శ్రీనివాస్