సీఐ శరత్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పాడు. దీంతో రుద్ర అండ్ టీమ్ ఎదుర్కోబోతున్న ప్రమాదం ఏంటో వివరించి చెప్పాడు శరత్. ‘ఓ నా రుద్ర బంగారం.. పురాణాలను, ఇతిహాసాలను, ఆచారాలను, సంప్రదాయాలను, సైన్స్‌ను, లాజిక్‌ను ఇలా అన్నింటినీ కలిపి కొడుతూ పాదరసంలా పనిచేసిన నీ మెదడు.. ఒక్క విషయంలో మాత్రం జీడిపాకంలా తయారైందిరా. అందుకే, ఇప్పుడు నీ టీమ్ మొత్తం ప్రమాదంలో పడిపోయింది’ అంటూ గట్టిగా నవ్వాడు శరత్.ఎక్కడో పొరపాటు చేశానన్నట్టు రుద్ర ఏదో ఆలోచిస్తుండగా.. మధ్యలో కలుగజేసుకొన్నాడు స్నేహిల్. ‘ఏం ప్రమాదం రా.. రాస్కెల్. ఇంతమందిని పొట్టనబెట్టుకొన్న నీకు..’ అంటూ ఇంకా ఏదో చెప్తూ ఊగిపోతున్న స్నేహిల్ను నిలువరించిన శరత్.. ‘ఒరేయ్.. హాఫ్ నాలెడ్జ్‌గా. ఇంట్రెస్ట్‌తో థ్రిల్లింగ్ మూవీ చూస్తుండగా మధ్యలో యాడ్స్ ప్లే అయినట్టు నీ దరిద్రపు ఎంట్రీ ఏంట్రా ప్రతీసారి?? నువ్వు నోరు మూస్కొంటే, నేను కంటిన్యూ చేస్తా’ అంటూ శరత్ అనగానే.. స్నేహిల్ను ఆగమంటూ వారించి శ్రద్ధగా వినసాగాడు రుద్ర.
‘ఏయ్ రుద్ర. నల్లమలలో సాయం కోసమని ఒకరిని నీ టీమ్‌లోకి చేర్చుకొన్నావ్. గుర్తుందా? అక్కడే నీకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందిరా బుజ్జి కన్నా. అయితే, నీ బుద్ధి కుశలతతో నన్ను పట్టుకొన్నావ్ గానీ, ఇప్పటికీ ఆ వ్యక్తిని నువ్వు కనిపెట్టలేకపోయావ్. అంతేనా.. నారాయణాద్రుల స్వామి, ఆ తర్వాత జ్వాలా తటాకం, శ్వేత రక్కసి ఇలా ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఆ వ్యక్తి నిన్ను చాలాసార్లు మిస్లీడ్ చేయాలని చూస్తే, ఏదో శక్తి నిన్ను నడిపినట్టు నువ్వు సరైన రూట్లోనే వెళ్లావ్. అయితే, విచిత్రంగా మేం ఏమీ చేయకపోయినా.. చంద్రముఖీదేవి అంటూ నువ్వే మా వలలో పడ్డావ్. ఇంత టాలెంట్ ఉన్న నువ్వు.. ఇప్పటికీ, నీ టీమ్‌లో ఉన్న నా ప్రేయసిని కనిపెట్టకపోవడం ఏంటో?? నువ్వే కాదు నా లవర్‌ను నీ డొక్కు టీమ్ మెంబర్స్ కూడా ఇంకా కనిపెట్టలేకపోతున్నారు’ అంటూ గట్టిగా నవ్వాడు శరత్.
“నా టీమ్‌లో ఉన్నది ఒకే ఒక్క లేడీ. ఆమెనే ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ. నా చిన్నప్పటి నుంచి ఆంటీ గురించి నాకు తెలుసు. శరత్ ఎవరో ఆమెకు గతంలో తెలిసే అవకాశమే లేదు. మరి వీడు లవర్ అంటున్నాడేంటీ? కొంపదీసి శరత్గాడికి పిచ్చిగానీ ఎక్కిందా?…’ హహ్హహ్హ.. ఏరా రుద్ర.. నీ మనసులో ఇప్పుడు ఇవే మాటలు రన్ అవుతున్నాయ్ కదూ..’ అంటూ శరత్ నవ్వుతూ అనగానే.. అవునన్నట్టు తలూపాడు రుద్ర. ‘నీ బ్రెయిన్ ఇంతకంటే గొప్పగా పనిచేయదు గానీ, నా లవర్ ఎవరో కూడా నేనే చెప్తా’ అంటూ శరత్ అనగానే.. మధ్యలో మళ్లీ కలుగజేసుకొన్నాడు స్నేహిల్. “నీ ముఖం చెప్తావ్. ‘నా లవర్ ఎవరో నీకు తెలియాలంటే, నేను అడిగే ఈ 5 ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు చెప్పు’ అంటూ బేస్ వాయిస్‌లో దిక్కుమాలిన క్వశ్చన్లు అడుగుతావ్గా. అడుగు. ఇక ఆలస్యమెందుకు??’ అంటూ విసురుగా అన్నాడు స్నేహిల్. దీంతో అంతే విసురుగా అందుకొన్న శరత్.. ‘ఈ హాఫ్ నాలెడ్జ్ గాడికి ఆన్సర్లు తెలియదు గానీ.. ఇలాంటి పనికిరాని ఊహాత్మక అల్లికలు మాత్రం బాగానే వచ్చు. సరే రుద్ర.. ఎలాగో నీ కజిన్గాడు.. క్వశ్చన్ల ఫార్మాట్ తెచ్చాడుగా. నా ప్రేయసి ఎవరో నేను చెప్పాలంటే, నేనడిగే 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు’ అంటూ రుద్ర రెస్పాన్స్‌ను పట్టించుకోకుండానే గేమ్ స్టార్ట్ చేశాడు శరత్.
మొదటి ప్రశ్న: స్త్రీ గర్భందాలిస్తే నీళ్లోసుకొందని అంటారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. రెండో ప్రశ్న: దేవాలయాల్లో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..’ రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న: అరటి లేదా మోదుగ విస్తరిలో భోజనాలు చేయాలంటారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇళ్లు నిర్మించవద్దని అంటారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ఐదో ప్రశ్న: ఒక బంతి, ఒక బ్యాట్ రెండూ కలిపి ధర రూ. 110. బంతి కంటే బ్యాట్ రేటు రూ. 100 ఎక్కువ. అయితే బంతి ధర ఎంత? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు.
తాను అడిగిన అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో తన ప్రేయసి ‘శివుడు’ అంటూ శరత్ బాంబు పేల్చాడు. విరాట్+అనుష్క=విరుష్క ఎలా అయ్యారో.. శివుడు+శరత్=శివరత్గా తాము మారనున్నట్టు చెప్పాడు. అది విన్న రుద్ర అండ్ కో ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది పక్కనబెడితే, శరత్ అడిగిన ప్రశ్నలకు రుద్ర ఏ సమాధానాలు ఇచ్చాడో కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు