కెరీర్ వృద్ధి ఒకప్పుడు స్పష్టంగా కనిపించేది. ఒక ఉద్యోగికి బాధ్యతలు పెరగడం; ఉన్నత స్థాయికి చేరుకోవడం; ఎక్కువ జీతం అందుకోవడం.. ఇలా ఒక సంస్థలో చాలామంది తమ కెరీర్లో పురోగతిని చూసేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అంతా గందరగోళంగా తయారైంది. ఇప్పుడు చాలామంది ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటున్నారు. అధిక బాధ్యతలను మోస్తున్నారు. కానీ, ఎక్కువ జీతాన్ని మాత్రం పొందలేక పోతున్నారు. ప్రమోషన్లలో కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోతున్నారు. దీనినే ‘ఘోస్ట్ గ్రోత్’ అని నిపుణులు పిలుస్తున్నారు.
ఈ ‘ఘోస్ట్ గ్రోత్’ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగులు.. కెరీర్లో ముందుకు సాగలేకపోతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా,‘మై పర్ఫెక్ట్ రెజ్యుమె’ నిర్వహించిన ఓ సర్వే.. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 1,000 మంది నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా 53 శాతం మంది తమ కెరీర్లో ‘ఘోస్ట్ గ్రోత్’ బారిన పడ్డట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగంలో పని పెరుగుతున్నా.. పురోగతి మాత్రం కనిపించడం లేదని వాపోయారు.
నిజానికి ‘ఘోస్ట్ గ్రోత్’ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సాధారణంగా ఇది రెండు ప్రధాన కోణాల్లో కనిపిస్తున్నది. మొదటిది.. బాధ్యతలు పెరగడం – హోదా మారకపోవడం. చాలా కంపెనీల్లో ఉద్యోగి చేసే పని పరిధి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కానీ, వారి హోదా, జీతం మాత్రం అలాగే ఉంటున్నాయి. ఈ ధోరణి.. ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తున్నది. రెండో విషయం.. ఉద్యోగి నైపుణ్యాలు పెరగడం. ‘ఘోస్ట్ గ్రోత్’.. కొన్నిసార్లు ఉద్యోగులకూ లాభం తెచ్చిపడుతుందట. అధిక బాధ్యతలు అప్పగించడం వల్ల ఉద్యోగి వ్యక్తిగతంగా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ ఎవరైనా ఘోస్ట్ గ్రోత్‌ను అనుభవిస్తున్నారని భావిస్తే.. కొన్ని పనులు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఉద్యోగి చేస్తున్న అదనపు బాధ్యతలను ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్స్‌లో మీ నైపుణ్యాల పెరుగుదల వల్ల కంపెనీకి జరిగిన మేలును వివరించి, ప్రమోషన్, శాలరీ హైక్ లాంటివి కోరవచ్చట. లేకుంటే, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలో గుర్తింపు లేకపోయినా.. మీరు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలు భవిష్యత్తులో వేరే కంపెనీలో మంచి ఉద్యోగం సాధించడానికి ‘అదృశ్య శక్తి’లా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.