Divorce |సోలోగామి.. ఆ మధ్య తెగ వైరల్ అయిన మాట! ఈ మాటకర్థం.. తనను తానే పెళ్లిచేసుకోవడం! ఇష్టం ఉండాలే కానీ, ఆడవాళ్లు ఆడవాళ్లను.. మగవాళ్లు మగవాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్న కాలమిది. ఈ విపరీత పరిణామాలు చాలవన్నట్టు బ్రెజిల్‌కు చెందిన స్యూలెన్ కేరీ అనే 36 ఏండ్ల వనిత.. గతేడాది తనను తానే మనువాడి వార్తల్లో నిలిచింది. సామాజిక మాధ్యమాల్లోనూ తెగ వైరల్ అయ్యింది. తాజాగా తన నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి.. మరో బాంబ్ పేల్చింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోడల్ అయిన స్యూలెన్ కేరీ.. తనకు తగిన భాగస్వామి దొరక్కపోవడంతో స్వీయ వివాహం చేసుకున్నది. అయితే, తన వివాహబంధం పట్ల అసంతృప్తితోపాటు ఒంటరితనం భరించలేక విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తనపై తనకు చాలా అంచనాలు ఉన్నాయనీ, వాటిని అందుకోలేకపోవడమే ఈ విడాకులకు కారణమని చెప్పుకొచ్చింది.
విడాకుల నిర్ణయానికి ముందు ఆమె ‘కపుల్స్ థెరపీ’ కూడా తీసుకున్నదట. కౌన్సెలింగ్ సెషన్లకూ హాజరైందట. ఇవేవీ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో విడాకులే పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చిందట. అయితే, స్యూలెన్ కేరీని ఆదర్శంగా తీసుకొని.. తనను తానే పెళ్లి చేసుకున్న గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు మాత్రం.. ఇటీవలే తన వివాహ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం విశేషం!