Transgender | ట్రాన్స్జెండర్.. ఈ మాట వినగానే చాలామంది అసౌకర్యంగా కదులుతారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎదురుపడే వ్యక్తులు కళ్ల ముందు మెదులుతారు. ఆ యాచన వారి దుస్థితికి పరాకాష్ట అని ప్రపంచం గ్రహించేలా చేస్తున్నారు విద్య రాజ్పుత్. ట్రాన్స్జెండర్ అయిన విద్య తన పరిస్థితిని గ్రహించేందుకు చాలా సమయమే పట్టింది. వాస్తవాన్ని యథాతథంగా స్వీకరించే ముందు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో తనలాంటివారినంతా ఏకం చేశారు. భావ సారూప్యం ఉన్న సంఘాలకు నాయకత్వం వహించారు.
‘ట్రాన్స్జెండర్స్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటారు. కాబట్టి, వారికి ఆర్థిక స్వాతంత్య్రం అవసరం’ అని చాటుతూ ప్రతి సంస్థకూ వెళ్లారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు కల్పించమని వేడుకున్నారు. టాటా స్టీల్ లాంటి కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ఖేలో ఇండియాలో ట్రాన్స్జెండర్ క్రీడాకారులకు అవకాశం కల్పించినా, ఛత్తీస్గఢ్ పాఠ్య పుస్తకాలలో వారి గురించి అవగాహన కల్పించే వివరాలు చేర్చినా.. అదంతా విద్య కృషి ఫలితమే. ట్రాన్స్జెండర్స్ హక్కుల కోసం పోరాడుతూ, ఇప్పటికే ఉన్న హక్కుల గురించి చైతన్యం కల్పిస్తూ విద్య చేపట్టిన ఉద్యమాన్ని, చొరవను భారత ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ సభ్యురాలిగా ఎంపిక చేసింది.