పెద్ద లక్ష్యాలు సాధించాలంటే పెద్ద ప్రయత్నమే చేయాలని లేదు. అవకాశాన్ని బట్టి, స్తోమతకు తగ్గ ప్రయత్నాలతోనూ విజయం సాధించవచ్చని చెప్పడానికి యశోద జీవితం ఓ ఉదాహరణ. ఒక గ్రామీణ బాలిక పెరిగి, పెద్దయ్యాక ఆంగ్ల భాషలో సొంతంగా పట్టు సాధించి, తనకు వచ్చిన ఇంగ్లిష్‌ని సోషల్ మీడియా ద్వారా నలుగురికీ నేర్పిస్తున్నది. ఈ ప్రయత్నం ప్రియాంక చోప్రాకు నచ్చింది. యశోదను ప్రశంసిస్తూ, తన ఫాలోవర్లకు ఆమెను పరిచయం చేసింది. నిన్నటి దాకా ‘English with Dehati Madam’గా ఉన్న యశోద గురించి, తను చెప్పే ఇంగ్లిష్ పాఠాల గురించి ప్రధాన పత్రికలు వార్తలు రాశాయి! ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌసంబి జిల్లా, సిరాతునగర్ పంచాయతీ పరిధిలోని లోధన్ కా పూర్వ గ్రామం యశోద స్వస్థలం. తనకు ఏడాది వయసున్నప్పుడు పంజాబ్‌లో నివసించే బంధువులు ఆమెను దత్తత తీసుకున్నారు.
బంధువుల సంరక్షణలో పెరిగిన యశోద ఇంటర్మీడియట్ వరకు చదివింది. తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌కు తిరిగి వచ్చింది. గ్రామీణ జీవితంలో చిన్న చిన్నపనులు చేసుకుంటూ ఉండేది. తనకు ఇంగ్లిష్ రాదు. నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. అందుకు తగ్గ అవకాశం లేకపోయినా నిరాశ చెందలేదు. ఇంటర్నెట్లో వీడియోల్లో ఇంగ్లిష్ సంభాషణ ఆసక్తిగా వినేది. ఆ తర్వాత వాళ్లను అనుకరిస్తూ మాట్లాడేది. పదిహేను రోజుల తర్వాత… యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. నెమ్మదిగా దానికి ఫాలోవర్లు పెరుగుతూ వచ్చారు. కొన్నాళ్లకు మానిటైజ్ అయింది. ఆంగ్ల భాషపై నిదానంగా పట్టుచిక్కడంతోపాటు ఆదాయమూ మొదలైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కూడా యశోద చానెల్స్ ప్రారంభించింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ చెప్పే ఆంగ్ల పాఠాల వీడియోలు ప్రియాంక చోప్రాను ఆకట్టుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యశోద హ్యాండిల్ @yashoda5944 ని నాలుగు లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రియాంక చోప్రా ప్రశంసలతో మరో లక్షన్నర మంది ఫాలోవర్లు కొత్తగా చేరారు!

Yashoda