ఏ క్కా హువాంగ్?!
ప్రపంచమంతా ఏఐని శ్వాసిస్తున్నది.ఏఐని సిలికాన్ వ్యాలీ నడిపిస్తున్నది.సిలికాన్ వ్యాలీని ఎన్విడియా శాసిస్తున్నది. ఆ ఎన్విడియాను ఇన్నాళ్లూ గెలిపిస్తూ వచ్చింది మాత్రం జెన్సన్ హువాంగ్. ఇదంతా నిన్నటి కథ! నేడు హువాంగ్ ఆధిపత్యాలన్నీ రద్దయిపోయాయి. అతని పదవి పోయింది. సంపద మంచులా కరిగిపోయింది.
ప్రపంచమంతా ఏఐని శ్వాసిస్తున్నది.ఏఐని సిలికాన్ వ్యాలీ నడిపిస్తున్నది.సిలికాన్ వ్యాలీని ఎన్విడియా శాసిస్తున్నది. ఆ ఎన్విడియాను ఇన్నాళ్లూ గెలిపిస్తూ వచ్చింది మాత్రం జెన్సన్ హువాంగ్.
ఇదంతా నిన్నటి కథ! నేడు హువాంగ్ ఆధిపత్యాలన్నీ రద్దయిపోయాయి. అతని పదవి పోయింది. సంపద మంచులా కరిగిపోయింది. ఇన్నాళ్ల విజయాలు, గౌరవాలు, అవార్డులు అన్నీ… అతన్ని వెక్కిరిస్తున్నాయి! ‘ఏ క్యా హువాంగ్?!’ అని ప్రశ్నిస్తున్నాయేమో కూడా!!‘నా తప్పుని సమర్థించుకోలేను’ అని జెన్సన్ హువాంగ్ భారంగా చెబుతున్నాడు. పట్టుదల, ప్రతిభ, అవకాశం, అదృష్టమే కాదు విజేతకు నైతికత ప్రధానం అన్న నిజం ఆ సమాధానంలో ప్రతిధ్వనిస్తున్నది. సామాన్యులే కాదు దిగ్గజాలు నేర్చుకోవాల్సిన నైతిక పాఠం.. హువాంగ్లాంటి వారికి గుణపాఠం.
ప్రపంచ మీడియాలో ఇప్పుడంటే హువాంగ్ శీర్షాసనమేశాడు కానీ, అతను సాధించిన విజయాలు పతాక శీర్షికల్లో కొండంత అక్షరాల్లో వెలిగాయి ఒకప్పుడు. బుడిబుడి అడుగుల ఏఐకి పరుగులు నేర్పిన ఘనత అతను సీఈవోగా ఉన్న ఎన్విడియా సొంతం. ఇంత ఘనత వహించిన హువాంగ్ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం ప్రతిచోటా కష్టం ఉంది. కష్టపడిన తత్వం ఉంది. పట్టుదలతో గెలిచిన ఉదంతాలూ ఉన్నాయి. కానీ, ముప్పై ఏండ్ల శ్రమ ఒక్క దెబ్బకు కుదేలై పోతుందని ఎవరూ అనుకోలేదు. చివరికి, హువాంగ్ కూడా ఊహించి ఉండడు.
తైవాన్‌లోని తైపీలో జెన్సన్ హువాంగ్ పుట్టాడు. వాళ్ల నాన్న ఆయిల్ రిఫైనరీ కంపెనీలో ఇంజినీర్. అమ్మ టీచర్. హువాంగ్‌కు అన్న కూడా ఉన్నాడు. వాళ్ల కుటుంబం అక్కడి నుంచి టైనాన్ అనే పట్టణానికి వలస పోయింది. హువాంగ్‌కి అయిదేండ్ల వయసున్నప్పుడు వాళ్ల నాన్న ఉద్యోగ రీత్యా థాయ్‌లాండ్‌లో ఉన్న ఆయిల్ రిఫైనరీకి మారాల్సి వచ్చింది. అందువల్ల కుటుంబమంతా ఆ దేశానికి పోయింది. అక్కడే హువాంగ్ విద్యాభ్యాసం మొదలైంది. పిల్లలకు ఆంగ్లం నేర్పాలని డిక్షనరీ సాయంతో వాళ్లమ్మ రోజుకు పది ఆంగ్ల పదాలను నేర్పేది. కంపెనీ పనుల్లో భాగంగా హువాంగ్ వాళ్ల నాన్న అమెరికాకి వెళ్లి వచ్చాడు. తన పిల్లలు అమెరికాలో పెరగాలని, అక్కడే చదవాలని ఆయన కోరుకున్నాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇద్దరు పిల్లలను అమెరికా పంపించాడు.

అవమానాలతో మొదలైన ప్రయాణం
తొమ్మిదేండ్ల వయసులో జెన్సన్ హువాంగ్ అమెరికాలో అడుగు పెట్టాడు. తమ బంధువులు కూడా అప్పుడే వాషింగ్టన్‌లోని టకోమాకు వలస వచ్చారు. వాళ్ల దగ్గరికి చేరుకున్న అన్నదమ్ములు కెంటకీలో ఉన్న ఒనెడా బాప్టిస్ట్ విద్యా సంస్థలో ప్రవేశం పొందారు. ఇది చాలా ప్రముఖమైన విద్యా సంస్థ అని పొరపాటుపడి అందులో చేరారు. నిజానికి అది నేర స్వభావం కలిగిన పిల్లల్లో వ్యక్తిగత పరివర్తన తీసుకువచ్చేందుకు నిర్వహించే విద్యా సంస్థ. జెన్సన్ అన్నతో కలిసి ఒనెడా డార్మిటరీలో ఉన్నాడు. తన అన్నకు రీఫార్మ్ అకాడమీలో చదువుకునేందుకు ప్రవేశం లభించింది. జెన్సన్ చిన్నవాడు కావడంతో ఎలిమెంటరీ స్కూల్లో చేరాల్సి వచ్చింది.
అక్కడ ఆసియావాసులను చిన్నచూపు చూసేవాళ్లు. తన పొడవైన జుట్టుని, ఆంగ్ల పదాలను పెద్దగా ఉచ్చరించడాన్ని చాలామంది హేళన చేసేవారు. అవన్నీ జెన్సన్ భరించాడు. తిట్లతోపాటు తరచూ వాళ్లతో తన్నులు కూడా తినేవాడు. అక్కడ బతకడం కోసం చిన్న వయసులో మానసిక క్షోభను ఓర్చుకోవడంతోపాటు చెమటోడ్చాడు. తనతోటి పిల్లల్లా టేబుల్ టెన్నిస్ నేర్చుకోవాలనుకున్నాడు. టాయిలెట్లు శుభ్రం చేయగా వచ్చిన డబ్బుతో ఆట నేర్చుకున్నాడు. స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాడు. ఆటల్లో మంచి ప్రావీణ్యం చూపాడు. ఆ రోజుల్లో ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మ్యాగజైన్ జెన్సన్ చిత్రాన్ని ప్రచురించింది.
ఆల్ రౌండర్ అంటే ఇతనేనా..
ఆటపాటల్లో హువాంగ్ దూసుకుపోతున్న రోజుల్లో… అమ్మానాన్న అమెరికా వచ్చారు. అన్నదమ్ములిద్దరూ వాళ్ల దగ్గరికి చేరుకున్నారు. కెంటకీలో ఉన్న పాఠశాల నుంచి వెనక్కి వచ్చి అలొహ హైస్కూల్లో చేరారు. రెండు తరగతులు తప్పించి పై తరగతిలో చేరాడు. ఆ పాఠశాలలో హువాంగ్ చదువులో బాగా రాణించాడు. టేబుల్ టెన్నిస్ ఆటలో జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్‌లో జెన్సన్కు స్థానం దక్కింది. ఆటల్లో రాణిస్తూనే నాటికి మ్యాథమేటిక్స్, కంప్యూటర్స్, సైన్స్ క్లబ్‌లలో జెన్సన్ సభ్యుడిగా చేరాడు. స్కూల్ మేనేజ్మెంట్ యాపిల్-2 కంప్యూటర్ని కొనుగోలు చేసింది. ఆ కంప్యూటర్ సాయంతో హువాంగ్ టెక్ట్స్ బేస్డ్ సూపర్ స్టార్ ట్రెక్ ఆడేవాడు. అలాగే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుని యాక్షన్ వీడియో గేమ్ ‘స్నేక్’ని సొంతంగా రూపొందించాడు.
హైస్కూల్ చదువు అయిపోయింది. ట్యూషన్ ఫీజు తక్కువని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. తల్లిదండ్రుల సహకారం ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల హువాంగ్ పదిహేనేండ్ల వయసులో పని చేయాల్సి వచ్చింది. ఒక రెస్టారెంట్లో పాత్రలు కడిగేందుకు పనిలో చేరాడు. అందులోనే టేబుళ్లు తుడవడం, వెయిటర్‌గా పలు బాధ్యతల్లో అయిదేండ్లపాటు పని చేశాడు. చదువు, ఆటలు, పని చేస్తూ హువాంగ్ అత్యధిక మార్కులతో ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. పదహారేండ్లకే గ్రాడ్యుయేట్ అయ్యాడు!
ఉద్యోగం.. సంసారం.. చదువు
బ్యాచిలర్ డిగ్రీ అయిపోగానే హువాంగ్ సిలికాన్ వ్యాలీలో ఏఎండీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అందులో మైక్రో చిప్‌లను తయారు చేసేవాడు. అప్పటికే ఆయనకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగం చేస్తూ, సంసారాన్ని నడిపిస్తూ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఈవినింగ్ కళాశాలలో చేరాడు. రాత్రి జరిగే తరగతులకు హాజరవుతూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ సాధించాడు.
మైక్రో ప్రాసెసర్ చిప్స్ తయారు చేస్తున్న హువాంగ్ ఎల్ఎస్ఐ లాజిక్ కంపెనీ కొత్తగా గ్రాఫిక్ యాక్సెలరేటర్ కార్డ్‌లు తయారు చేయాలనుకుంటున్నదని విన్నాడు. ఎల్ఎస్ఐ లాగిక్ ఆ ప్రాజెక్ట్‌ని సన్ మైక్రో సిస్టమ్స్ అనే స్టార్టప్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. వెంటనే ఏఎండీ కంపెనీని వీడి, సన్ మైక్రో సిస్టమ్స్‌లో టెక్నికల్ ఆఫీసర్‌గా చేరాడు. గ్రాఫిక్ యాక్సెలరేటర్ కార్డ్‌లు తయారు చేస్తున్న సందర్భంలో మరో ఇద్దరు సాంకేతిక నిపుణులు క్రిస్ మలాచోవ్స్కీ, కర్టిస్ ప్రియమ్ పరిచయమయ్యారు. ఈ ముగ్గురు కలిసి రూపొందించిన ‘జీఎక్స్ గ్రాఫిక్ ఇంజిన్’ మార్కెట్లో విజయవంతమైంది. సన్ మైక్రో సిస్టమ్స్ ఆదాయం ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగింది! ఆ విజయం హువాంగ్ను ఎల్ఎస్ఐ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోట్ చేసింది.
ఎన్విడియా ఐడియా
తొంభయ్యో దశకంలో సన్ మైక్రో సిస్టమ్స్ పోటీ కంపెనీల కంటే వెనుకబడింది. హువాన్, మలాచోవ్స్కీ, ప్రియమ్ ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చి సొంతంగా చిప్‌లను తయారు చేయాలనుకుంటున్నారు. కానీ, వారి దగ్గర స్పష్టమైన సొంత ప్రణాళిక లేదు. కంపెనీ స్థాపన కోసం చర్చించేందుకు డెన్నీస్లో తరచుగా కలుసుకునేవారు. ఆ కాలానికి వాళ్లు సంపన్నులు కాదు. తక్కువ ధరకు కాఫీ దొరుకుతుందనే కారణంతో వీరు డెన్నీస్లో కలుసుకునేవారు. హువాంగ్ చిన్నప్పుడు పని చేసిన రెస్టారెంట్ ఇదే. ఓ రోజున ముగ్గురూ కలిసి బ్రేక్ ఫాస్ట్ బూత్‌లో కూర్చుని ఒక కంపెనీని స్థాపించాలనుకున్నారు. కొద్ది రోజులకే తలా రెండు వందల డాలర్ల డబ్బుని జమ చేసి, ఆరు వందల డాలర్ల మూలధనంతో ఎన్విడియా కంపెనీని స్థాపించారు. మొదటి రోజే హువాంగ్‌ని ఆ కంపెనీకి అధ్యక్షుడిగా, సీఈఓగా ఎంచుకున్నారు. హువాంగ్‌కు టెక్ రంగంలో ఉన్న పరిచయాల వల్ల ఇద్దరు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు తొలినాళ్లలోనే పెట్టుబడి పెట్టారు.
ఫస్ట్ ఫెయిల్యూర్.. వాట్ నెక్ట్స్?
ఎన్విడియా మొదట రూపొందించిన చిప్ మార్కెట్ అంచానలను అందుకోలేకపోయింది. ఆ వైఫల్యంతో మూలధనమంతా కరిగిపోయింది. కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. ఉద్యోగులను తగ్గించుకున్నారు. మళ్లీ నిలదొక్కుకునేందుకు హువాంగ్ కొత్త గ్రాఫిక్ ప్రాసెసర్ల తయారీలో పడ్డాడు. రెండో ప్రయత్నంలో రెండు వందల శాతం విజయం సాధించారు! అంతే లాభాలే లాభాలు. అప్పటి నుంచి ఎన్విడియా ఎప్పుడూ గడ్డు పరిస్థితులను ఎదుర్కోలేదు. మొదట్లో కేవలం వీడియో గేమ్స్ కోసం గ్రాఫిక్ ప్రాసెసర్లను రూపొందించారు. జీపీయూలకే పరిమితం కాకుండా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, అటానమస్ డ్రైవింగ్‌కు ఉపయోగపడే చిప్‌ల తయారీపై దృష్టి పెట్టడంతో ఎన్విడియా విస్తరించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ కంప్యూటింగ్ మీద హువాంగ్ ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. ఆయన ఊహించినట్టే ఏడేండ్ల క్రితం చిప్ తయారీ రంగానికి బూమ్ వచ్చింది. ఎన్విడియా కంపెనీ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. అంతేకాదు ఆ కంపెనీ విలువ ఎన్ని రెట్లు పెరిగిందో తన సంపద కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ ఆరేండ్ల కాలంలో ఎన్విడియా లాభాలు, కంపెనీ విలువ పెరుగుతూ వస్తున్నది. ఏఐ విజృంభణతో ఎన్విడియా కంపెనీ ప్రపంచ టెక్ రంగలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. ఎన్విడియా కంపెనీ 2025లో అయిదు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన మొదటి సంస్థగా చరిత్ర సృష్టించింది. హువాంగ్‌కి ఎన్విడియాలో 3.6 శాతం వాటా ఉంది. తన ఆస్తి విలువ పెరగడంతో ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ టెన్‌లో జెన్సన్ హువాంగ్ పేరు చేరింది. అమెరికాలోని సీఈఓలలో అత్యధిక పారితోషికం అందుకునేవారిలో హువాంగ్ ఒకరని ఫోర్బ్స్ ప్రకటించింది.
టెక్ రాజ్యానికి చిప్ చక్రవర్తి
సాంకేతిక రంగంలో ఎంతో వేగం ఉంది. వెంటవెంటనే సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్స్ వస్తుంటాయి. వాటికి తగ్గట్టు టెక్ లీడర్స్ కూడా అంతే వేగంగా మారిపోతుంటారు. కానీ, ఎన్విడియా కంపెనీకి హువాంగ్ మూడు దశాబ్దాలు సీఈఓగా పని చేశాడు. ‘వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండే సిలికాన్ వ్యాలీలో ఎన్నడూ వినని మాట ఇది’ అని జెన్సన్ హువాంగ్ పదవీ కాలాన్ని గురించి ద వాల్‌స్ట్రీట్ జర్నల్ వర్ణించింది. రెండేండ్ల క్రితం.. విన్ ఫ్యూచర్ ప్రైజ్, ఎడిసన్ అవార్డ్, ప్రైమ్‌టైమ్ ఇంజినీరింగ్ అవార్డ్ ఆయన్ని వరించాయి. ఏడాది క్రితం.. క్వీన్ ఎలిజెబెత్ ప్రైజ్ ఫర్ ఇంజినీరింగ్ గెలుచుకున్నాడు. కొన్ని నెలల క్రితం…నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ ఆయన సొంతమైంది. ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ ఏఐ’ గుర్తింపు పొందిన కొందరిలో ఆయన ఒకడు. టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 గౌరవం పొందిన ఆయన ఏడాది తిరక్కుండానే అప్రతిష్ఠపాలయ్యాడు.
ఫలించని పశ్చాత్తాపం
టెక్ ప్రపంచం చూపంతా హువాంగ్ మీదే. ప్రతి రోజూ వార్తల్లో ఆయనే. అతను ధరించిన జాకెట్ వేలం వేస్తే ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయింది. ఎన్విడియా సీఈవో ధరించడం వల్ల టామ్ ఫోర్డ్ లెదర్ జాకెట్ విలువ అంత పెరిగింది! అది ఆయన ప్రతిభ వల్లే. కానీ, ఆ కంపెనీలో మాత్రం ఆ ప్రతిభ ఒక్కటే చెల్లలేదు. నైతికత ప్రశ్నార్థకమయ్యాక అతను ఉనికి కోల్పోయాడు. నిన్నా, మొన్నా తలెత్తుకుని అవార్డులు అందుకున్న హువాంగ్ ఇప్పుడు రాజీనామా చేసి తలదించుకుని వెళ్లిపోయాడు. ఫోర్బ్స్ లెక్కల్లో అత్యంత సంపన్నుడిగా, టైమ్స్ సర్వేల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉంటూ ఒకనాడు వార్తల్లోకి ఎక్కిన హువాంగ్ ఇప్పుడు అక్రమ సంబంధాల వార్తలతో అపఖ్యాతి పాలయ్యాడు.
అవమానాల్ని సహించి, అవకాశాల్ని అందిపుచ్చుకుని ఎన్నో కష్టాలను గెలిచిన ప్రతిభ, మూడు దశాబ్దాలుగా మూట గట్టుకున్న కీర్తి ఒక్క పూటలో మంటగలిశాయి. ప్రేమాయణం వ్యక్తిగతం. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే! కానీ, హువాంగ్ సంబంధం నెరిపిన అలిస్ హువాంగ్.. చైనా గూఢచారి అన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠతోపాటు ఎన్విడియా భవితవ్యానికీ సవాలు విసిరింది. ఆఫీసులోనూ మరో ఇద్దరు మహిళలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు హువాంగ్ స్థాయిని పాతాళంలోకి దిగజార్చాయి. ప్రతిభ, సంపద, అధికారానికి బాధ్యత కూడా ఉంటుందని హువాంగ్ వైఫల్యం ప్రపంచానికి చాటి చెబుతున్నది. భార్యకు, పిల్లలకు బాధ కలిగించినందుకు క్షమాపణలు కోరాడు. కానీ, అకస్మాత్తుగా కూలిపోయిన అతని స్వేద సౌధాన్ని తిరిగి నిర్మించుకోవడం సాధ్యమేనా?
వెంటాడిన గతం
భవిష్యత్‌ను ఊహించి వ్యాపార వ్యూహాలు రచించే హువాంగ్ తన భవిష్యత్‌ను ఊహించలేక పోయాడు. లోకం జనరేటివ్ ఏఐ గురించి ఆలోచిస్తుంటే ఆయన రేపటి అవసరాల కోసం ఫిజికల్ ఏఐ గురించి ఆలోచించే పనిలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే రేపటిలో జీవించే హువాంగ్‌ని చిత్రంగా గతం వెంటాడింది. ఒక్కసారిగా ఆయన భవిష్యత్తునే కాదు వర్తమానాన్ని కూడా చిందరవందర చేసింది. ముందుచూపుతో దూసుకుపోయిన హువాంగ్ అనుభవం చెప్పేదేమిటంటే ఎప్పుడూ వెనుకాముందు చూసుకుని అడుగేయాలి. ప్రపంచ ధనవంతుల్లో పది మందిలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆయన రెండు రోజుల్లో నాలుగు స్థానాలు కిందికి జారిపడ్డాడు. తన సంపద విలువ నిమిషాల్లో కోట్ల డాలర్లు కరిగిపోయింది. ఒక తప్పు జీవితకాల సంపద, కీర్తిని గాలికి తన్నుకుపోయింది. నాయకత్వానికి నైతికత వెన్నెముక లాంటిదని హువాంగ్ ఓడిపోయాక తెలుసుకున్నాడు. మళ్లీ నిలబడి నిలదొక్కుకోవాలంటే ఇంకెంత కష్టపడాలో, మరెన్నాళ్లు నిరీక్షించాలో!
– నాగవర్ధన్ రాయల
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

