మాతృత్వం.. మహిళలకు ఓ వరం. అయితే, సొంత వ్యాపారాలు నిర్వహించేవారికి మాత్రం ఈ వరం.. శాపంలా పరిణమిస్తున్నదట. తల్లికావడం అనేది.. వాళ్లు నిర్వహిస్తున్న సంస్థల లాభాల్లో క్షీణతకు దారితీస్తున్నదనీ, దీర్ఘకాలంలో వాటి మనుగడను ప్రమాదంలో పడేస్తున్నదని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. కెనడాకు చెందిన ‘వాంకోవర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’కు చెందిన పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. కెనడా ఎంప్లాయర్-ఎంప్లాయీ డైనమిక్స్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా అనేక విషయాలను వెల్లడించారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పురుషుల కన్నా మహిళలకు తక్కువ అవకాశం ఉన్నదనీ, ఒకవేళ అప్పటికే మొదలుపెట్టినా.. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉన్నదనీ పేర్కొన్నారు.
ముఖ్యంగా, మహిళలు నిర్వహిస్తున్న సంస్థలు.. వారి ప్రసవం అనంతరం నష్టాలవైపు నడుస్తున్నాయని చెప్పారు. కాన్పు అయిన ఏడాది మహిళలు వ్యాపారం ప్రారంభించే అవకాశం 42% తక్కువగా ఉంటున్నదని కనుగొన్నారు. కాలక్రమేణా ఆ ప్రభావం తగ్గిపోయినప్పటికీ.. ప్రసవానికి ముందున్న స్థాయికి మాత్రం చేరుకోవడం లేదని వెల్లడించారు. మొదటి కాన్పు సమయంలో కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నదనీ, నష్టాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నదనీ వెల్లడించారు. పిల్లలు లేని మహిళలు నిర్వహించే వ్యాపారాలతో పోలిస్తే.. తల్లులు నిర్వహించే వ్యాపారాల్లో లాభాల శాతం తగ్గుతున్నదట.
ప్రసవం తర్వాత కూడా.. ఆయా మహిళల నేతృత్వంలోని కంపెనీలు అమ్మకాలలో సగటున 21%, ఆస్తులలో 17%, లాభాల్లో 21% కోల్పోయినట్లు వెల్లడించారు. అదే సమయంలో.. మగవాళ్లు తండ్రులు అయ్యాక ప్రారంభించిన కంపెనీల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదట. ఈ ప్రభావం అన్ని వయసుల మహిళల నేతృత్వంలోని సంస్థలపైనా కనిపిస్తున్నదట. మహిళలకు కుటుంబ మద్దతు లభించకపోవడమే ఈ సమస్యకు ముఖ్యకారణమని సర్వేకారులు తేల్చారు.