Nayan Sarika | ‘నయన్’ సారిక.. పేరుకు తగ్గట్టే నయనాలతోనే నటించేస్తున్నది. ‘గంగం గణేశా’ అంటూ.. గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాలో ‘ఆయ్..’ అని పలకరించి.. ‘క’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నది.చారడేసి కళ్లతో కనికట్టు చేస్తున్న ఈ ముంబై ముద్దుగుమ్మ గురించిన మరిన్ని ముచ్చట్లు..
ఒక మంచి హిట్‌తో.. హీరోయిన్గా నా టాలీవుడ్ ప్రయాణం మొదలవ్వడం ఎంతో సంతోషం. ఓ సినిమా సక్సెస్ అనేది.. మొత్తం చిత్ర బృందానికీ సంబంధించింది. అయితే.. ‘ఆయ్’ సక్సెస్ మాత్రం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిచ్చింది. నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
హీరోయిన్గా అవకాశం వచ్చినప్పుడు డిగ్రీలోనే ఉన్నా. నటిస్తూనే డిగ్రీ పూర్తి చేయాలనుకున్నా. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు బుక్స్, స్టడీ మెటీరియల్ వెంట తీసుకెళ్లేదాన్ని. ఓవైపు షూటింగ్.. మరోవైపు పరీక్షలకు ప్రిపేర్ కావడం అనేది, చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
వినోదం పంచే కథలకంటే..సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే కథలంటేనే ఇష్టం. అలాంటి కథల్లో నటించేందుకు ఇష్టపడతాను. హైదరాబాద్ ఫుడ్ చాలా నచ్చింది. పూతరేకులు.. నా ఫేవరేట్ స్వీట్.
స్కూల్, కాలేజీ రోజుల్లో స్టేజ్ షోలలో నటించేదాన్ని. అప్పుడే నటనపై ఆసక్తి కలిగింది. హీరోయిన్ కావాలనే కోరిక ఏర్పడింది. సినిమా అవకాశం వచ్చినప్పుడు నా కల నెరవేరబోతున్నదని ఎంతో సంతోషించాను. ఆయ్ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు.. నేను, నార్నే నితిన్ కలిసి రిహార్సల్స్ చేసేవాళ్లం. తెలుగు కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాం. నా టీమ్ సభ్యులు కూడా ఎంతో సపోర్ట్ చేశారు.
తెరపై శ్రీదేవి, మాధురీ దీక్షిత్ వంటి నటులను చూసినప్పుడల్లా.. నాకూ హీరోయిన్ అవ్వాలనిపించేది. శ్రీదేవి.. నా ఇన్స్పిరేషన్. ఆమె నటనంటే నాకు చాలా ఇష్టం. విభిన్నమైన పాత్రల్లో నటించి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నా.జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనేది నా డ్రీమ్.
‘ఆయ్’ సక్సెస్ తర్వాత.. జూ.ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి స్టార్స్ నా నటన గురించి మాట్లాడుతుంటే.. నా ఆనందం వర్ణించలేను. ‘ఆయ్’లో నా పాత్రలో చాలా సహజంగా నటించానని ఎన్టీఆర్ గారు అభినందించారు. ఇక అల్లు అర్జున్ గారైతే.. నన్ను దక్షిణాది అమ్మాయనే అనుకున్నారు. కాదని తెలిసి.. అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయావంటూ ఆశ్చర్యపోయారు.