మెన్స్ట్రుపీడియా.. చదవడానికి కొత్తగా ఉందా? కానీ, మూలాలు పాతవే. తరాలనాటి నమ్మకాల్లో, అపోహల్లో చిక్కుకున్నవే. నెలసరితో ముడిపడిన భయాల్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా అదితి గుప్తా ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఆమెది జార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతం. పన్నెండేండ్ల వయసులో రజస్వల అయ్యింది. తన డ్రెస్ ఎర్రబడినట్టు అనిపించగానే పరుగుపరుగున తల్లి దగ్గరికి వెళ్లింది. హత్తుకోబోయింది. ఆమె మాత్రం అంతే వేగంగా వెనక్కి తోసేశారు. ‘బాత్రూమ్కు వెళ్లి శుభ్రం చేసుకో’ అని ముభావంగా సలహా ఇచ్చారు. ఆ క్షణం నుంచీ తనను ఓ తాకకూడని వస్తువులా, మాట్లాడకూడని మనిషిలా చూడటం ప్రారంభించారు.
అటక మీదున్న పాత బట్టల మూటను ఎదురుగా పడేసి.. ‘వీటిని చుట్టుకో’ అని చెప్పి బాధ్యత వదిలించుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్‌లో చేరాక.. ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల బాలికలకు, తల్లిదండ్రులకు నెలసరిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఒక తరం నుంచి మరో తరానికి చేరుతున్న అపోహలను వదిలించింది. వీటన్నిటికీ ఓ రూపం ఇస్తూ బొమ్మల పుస్తకం తీసుకొచ్చింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాన్ని ముద్రించింది. ఈ పుస్తకాన్ని ఆరువేల పాఠశాలల్లో సిలబస్‌గా చేర్చారు. పన్నెండు భారతీయ భాషల్లో అనువాదమైంది. నాలుగు విదేశీ భాషలు దీనికి అదనం.