Fathers Day | ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం. చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్! అలా బయటికి వెళ్లగానే.. అల్లరి షురూ! ఇప్పుడు నాన్న బయట ఉన్నంత సేపూ ఇంట్లో నిశ్శబ్దం. ఇంటికి వచ్చీరాగానే అల్లరి మొదలు. అందుకే ఈ తరం చిన్నారులు నాన్న కూచీలు అవుతున్నారు. ఒక తరం కిందట నాన్నకు భయపడిన బుడతలు.. నాన్నలయ్యాక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. నాన్నగారి అడుగుల చప్పుడు విని అలెర్ట్ అయిన వీళ్లు.. తమ బిడ్డల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వెరసి ఈ తరం తండ్రి ఆప్త మిత్రుడిగా మారిపోతున్నాడు. నిజ జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలే సినిమాల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి, ఇప్పటి సినిమాలను గమనిస్తే ఆ సంగతి స్పష్టం అవుతుంది.
అరవై ఏండ్లు వెనక్కి వెళ్తే.. చాలామంది తండ్రులు లెక్కల మాస్టార్ కన్నా కఠినంగా ఉండేవాళ్లు. తెలుగు పండితుడి కన్నా ఘాటుగా తిట్ల దండకం అందుకునేవాళ్లు. ఓ పదిహేనేండ్ల కిందటి వరకూ సినిమాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. ఆనాటి ‘అంతస్తులు’ చిత్రం నుంచి రెండు దశాబ్దాల కిందటి ‘బొమ్మరిల్లు’ దాకా ఫాదర్ క్యారెక్టర్స్ కాస్త కటువుగానే ఉండేవి. నాటి సాంఘిక జీవనశైలి ప్రభావంతో ‘నాన్న’ను కొంత గంభీరంగా, ఇంకొంత కఠినంగా ఆవిష్కరించేవాళ్లు.
విరుద్ధ సిద్ధాంతాలను విశ్వసించే తండ్రీకొడుకుల కథలకు అప్పట్లో భలే గిరాకీ! అందుకు మెచ్చు తునక ‘ఆకలిరాజ్యం’. రమణమూర్తి, కమల్ హాసన్ పాత్రల సంఘర్షణ ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ‘రుద్రవీణ’లో బిలహరి గణపతి శాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి పాత్రల మధ్య ఉండే విరుద్ధ భావాలే ఆ చిత్రానికి మూలకథ అయింది. బిలహరి గణపతి శాస్త్రిగా జెమిని గణేషన్ పండిపోతే.. సూర్యంగా చిరంజీవి వెలిగిపోయాడు. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు, అంతర్లీనంగా సాగిపోయే ప్రేమానురాగాలు ముచ్చటగొలుపుతాయి. సోమయాజులు, శోభన్‌బాబు తండ్రీకొడుకులుగా నటించిన ‘దేవాలయం’ ఈ తరహా చిత్రమే! ఇందులోనూ ఉభయ కలహోపరి మనస్తత్వాలే! ఇలా 90వ దశకం చివరి దాకా సింహభాగం సినిమాల్లో తండ్రీ తనయుల కాంబినేషన్ ఉప్పు, నిప్పు అన్నట్టుగానే ఉండేవి. ఇంకా చెప్పాలంటే ‘పెద్దరికం’ చిత్రం శైలిలో సాగేవి.
కాలంతోపాటు సినిమాల్లో తండ్రి పాత్రలూ కొత్తదనాన్ని సంతరించుకున్నాయి.
సమాజంలో తండ్రులు తమ పాత్రను తల్లికన్నా మిన్నగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పిల్లల పెంపకం అంతా తల్లులదే అన్నట్టుగా ఉండేది! ఈ తరం తండ్రులు ఆ బాధ్యతను ప్రేమగా భుజానికెత్తుకుంటున్నారు. హోమ్వర్కులూ చేయిస్తున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. టీనేజ్‌కు వచ్చిన కుర్రాళ్లతో సరదాగా జోకులు వేసుకుంటున్నారు. ఈ ట్రెండుకు తగ్గట్టుగానే సినిమాల్లో తండ్రి పాత్ర కొత్తపుంతలు తొక్కుతున్నది. ‘డార్లింగ్’లో ప్రభు.. ఈ తరం తండ్రికి ప్రతీకగా కనిపిస్తాడు. ‘భలే భలే మగాడివోయ్’, ‘సమ్మోహనం’, ‘సామజవరగమన’ తదితర చిత్రాల్లో నాన్నగా నరేశ్ చేసిన అల్లరి అంతా ఇంతా ఉండదు. తండ్రి పాత్రలో చంద్రమోహన్‌ది ప్రత్యేక శైలి. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, మురళీ శర్మ, టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్, గోపరాజు రమణ తదితర నటులు ఫ్రెండ్లీ ఫాదర్స్గా ప్రేక్షకులను అలరిస్తూ నేటి నాన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిన్నటి హీరోలే నేటి తండ్రులు కావడంతో ఆ పాత్ర మరింత దోస్తీగా మారిపోయిందన్నమాట. ఏ తరమైనా నాన్నంటే హీరోనే కదా!
‘లాంగ్ లాంగ్ అగో.. సో లాంగ్ అగో..’ అని కామెడీ పండిచిన కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడి పాత్రల తర్వాత తండ్రిగానూ అలరించాడు! కెరీర్ మొదట్లో కామెడీ తండ్రిగా, పీక్‌లో ఉన్నప్పుడు విలనీ తండ్రిగా, ఆపై అర్థం చేసుకునే తండ్రిగా ఎన్నో పాత్రల్లో నటించి, మెప్పించి వెండితెర ఫాదర్ అనిపించుకున్నాడు. బ్లాక్ అండ్ వైట్ జమానాలో నాన్న పాత్రకు ‘గుమ్మడి’ కేరాఫ్‌గా నిలిస్తే.. నయా జమానాలో ఆ క్రెడిట్ కోట కొట్టేశాడు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమాలో విసుక్కునే నాన్నగా, ‘బొమ్మరిల్లు’లో విస్కీ పుచ్చుకునే నాన్నగా, ‘ఇడియట్’లో విస్తుపోయే నాన్నగా గుర్తుండిపోయే పాత్రలెన్నో చేశాడు. ‘కోట’కు దీటుగా తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు ప్రకాశ్‌రాజ్. ‘బొమ్మరిల్లు’లో ‘ఆకాశమంత’ నటన కనబరచి నిన్నటి తరం తండ్రి పాత్రకు ‘నువ్వే.. నువ్వే’ సూటబుల్ అనిపించుకున్నాడు.